Saturday, September 27, 2014
Dharma puri narahari stuti
ఓమ్ గం గణపతయే నమః
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.
భరణభూషితం భూషిత ప్రభమ్,
జలధిపుత్రికా సేవితాంఘ్రికం,
హరినరాకృతిం సైంహికాననం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.1
హరివరాననం ఘాతుకాంతకం
శ్రితజయప్రదం చక్రధారిణం
భుజగశాయినం భూరిదాయినం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.2
ఋషివరాశ్రితం ఋగ్భిరర్చితం
విదితవేద్యకం వేదగమ్యకం
శ్రితవరార్థినే కల్పవృక్షకం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.3
ద్విజబుధైః సదా పూజితం స్తవైః
దితిజబాలకప్రాణరక్షణే
దితిజమందిరే స్తంభసంభవం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.4
సుజనభక్తకాన్ సక్తరక్షకం
కుజనశిక్షణే సక్తచిత్తకం,
మకరమౌఖికాత్ నాగరక్షకం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.5
సురపతేః సుఖాత్ సంచయాఘగాం
మునిసతీం వరాం పాదుకోద్ధృతం
నిరతభావినాం పాపనాశకం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.6
విహితపాపధిం కాలకాలగం
హరిరితీరితం నిర్మలంకరం
యదియముచ్యతే2జామిళాదినా
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.7
నిగమరక్షణే మత్స్యకాయినం
అమృతసాధనే కూర్మవేషినం
అవనిపాలనే శ్రీవరాహకం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.8
దనుజమారణే సైంహికాననం
బలివిమర్దనే వామనాకృతిం
కుపతిభంజనే భార్గవద్విజం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.9
రఘుకులోద్భవం రావణాంతకం
ద్రుపదాత్మజావనే కృష్ణరూపిణం
శమనసాధనే బుద్ధరూపిణం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.10
కలివిమర్దనే కల్కిదేహినం
అభయరూపిణం ఆశ్రితాశ్రయం
నతముఖో2స్మ్యహం నైకధాకృతిం
నరహరిం భజే ధర్మపూర్విభుమ్.11
Friday, March 21, 2014
Sri Dharma Puri Ramalimgeshwara mangalaa shasnam
అథ
శ్రీ ధర్మపురీరామలింగేశ్వర మంగళాశాసనమ్
ఏకస్మై జగతాం భర్త్రే హ్యనేకాకృతిశోభనే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 1 ||
ద్విజిహ్వ గళభూషాయ ద్విజేంద్రాశ్రితమౌళయే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 2 ||
త్రినేత్రాంచితరూపాయ త్రిశూలాయుధధారిణే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 3 ||
చతురాస్యసుసేవ్యాయ చతుర్వేదస్వరూపిణే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 4 ||
పంచాస్యశోభినే తస్మై పంచబాణవిమర్దినే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 5 ||
షడ్దర్శనైః సువేద్యాయ షడానననుతాయ చ |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 6 ||
సప్తర్షివర్యగీతాయ సప్తాశ్వరథచక్షుషే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 7 ||
అష్టమూర్తిస్వరూపాయ హ్యష్టైశ్వర్య ప్రదాయినే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 8 ||
నవగ్రహాణాం శాస్త్రే చ నవ ద్రవ్యాత్మకాయ చ |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 9 ||
దశదిగ్వ్యాప్తదేహాయ దశాస్యేన నుతాయ చ |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 10 ||
ఏకాదశాత్మరుద్రాయ హ్యేకాదశాఘనాశినే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 11 ||
దాక్షాయణీ ప్రియంకర్త్రే దక్షయజ్ఞవినాశినే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 12 ||
పార్వతీహృతదేహాయ పర్వతాగ్రనివాసినే |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 13 ||
యతీంద్రప్రవారా యం హి నిత్యం ధ్యాయంతి తత్పరాః |
మంగళం ధర్మపూర్వాస ! రామలింగేశ్వరాయ తే || 14 ||
మయాహి కోరిడే కులీన విశ్వనాథశర్మణా ,
ముదా కృతం తు రామలింగ సుప్రభాత సేవనమ్ |
శివాయ చాస్తు మోదకం ప్రపాఠకాయ మోక్షదం
భవేన్నుతాయ శంకరం సదా హ్యరిష్ట నాశకమ్ || 15 ||
శ్రీ ధర్మపురవాస్తవ్య కోర్డే వంశోద్భవేన హి |
రాజన్నశాస్త్రి పుత్రేణ విశ్వనాథేన శర్మణా ||
కృతా హి వాఙ్మయీ పూజా శివానుగ్రహకాంక్షిణా |
శివాయ ప్రీతిదా భూయాత్ పాఠకాయ శివంకరీ || 16 & 17 ||
|| ఇతి
సంస్కృతసాహిత్యరత్నపదలాంఛనస్య, బుధకోటినుతస్య, ప్రథితకవిపణ్డితగణాగ్రణీవరస్య,
అఖిలశిష్యకోటిబృందార్చితపాదపద్మయుగళస్య, ఆచార్యకోరిడేరాజన్నశాస్త్రిణః
ద్వితీయపుత్రేణ కోరిడే విశ్వనాథ శర్మణా విరచితా
శ్రీధర్మపురీరామలింగేశ్వర వాఙ్మయీపూజా సమాప్తా||
Godavari Mahatmyam (Brahma puranam) {2} Puthra theertham
బ్రహ్మ పురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము -2
రచన: విశ్వనాధశర్మ కొరిడె
పుత్ర తీర్థ విశిష్టత
గోదావరి యందు మరొక ప్రసిద్ధమైన తీర్థమొకటి కలదు. దాని పేరు ‘పుత్ర తీర్థం’. అట్టి దాని నామ శ్రవణము చేతనే సమస్త అభీష్టములను పొందగలడు. పూర్వమున దితి , తన పుత్రులు, దనుపుత్రులు కూడా యుద్ధములందు నశించుచుండగా తన సవితి పుత్రులైన ఆదిత్యులు అభివృద్ధిని పొందుతుండుట గమనించి, మిక్కిలి దుఃఖమును పొందినదై దనువు దగ్గరికి వెళ్ళినది. ఆయనతో తన దుఃఖానికి కారణాన్ని తెలిపి , “ఆర్యా! ! మన ఇరువురి పుత్రులు నశించుచున్నారు. నేనేమి జేతును? అదితి వంశమును చూడు. ఉన్నతమైనదిగా సర్వోన్నతముగా అభివృద్ధిని పొందుతున్నది. శత్రుదుర్భేద్యమైనదై , అజేయమైనదైనది. జయ,కీర్తులను కలిగి రాజసుఖములను పొందుచున్నది. నాతో సమానురాలగు అదితిని, అదితి సంతానమును, వారి వృద్ధిని చూచిన నాకు అస్వస్థత కలుగు చున్నది. కలలో కూడా ఆ అదితి వైభవమును చూచినప్పటికినీ కలిగే బాధకంటే అగ్నిలోనైనూ సుఖమనిపించుచున్నది . ” అని అతి దీనురాలై విలపించినది. ఆమెను చూచి , పరమేష్ఠి పుత్రుడైన దనువు ఓదార్చుతూ , “ ఓ కళ్యాణి ! నీవు ఇలా దుఃఖిచుట తగదు. పుణ్యకర్మానుచరణ ద్వారానే కోరికలు సాధింపబడగలవు. మహానుభావుడైన నీ భర్త కశ్యప ప్రజాపతి నీ కోరికలను సాధించు మార్గమును చెప్పగలడు .ఆ ప్రజాపతిని నీ సద్గుణములచేత సంతోష పెట్టు. ప్రసన్నుడైన ఆ మహానుభావుడు నీ అభీష్టమును నెరవేర్చగలడు . ” అని ఉపదేశించినాడు.
అఫ్ఫుడామె అట్లే యని అంగీకరించి, తన భర్తయైన కశ్యపప్రజాపతిని సకలోపచారముల ద్వారా సంతోషపరచినది. సంతుష్టుడై కశ్యపుడు ఆమెతో ‘ ఓ దితి ! నీ అభీష్టమును కోరుకొమ్మనమ’ ని అడిగినాడు. అప్పుడా దితి తన భర్తతో “ బహుగుణములతో కూడుకొని సర్వలోక విజేత, సర్వలోక నమస్కృతు డగు పుత్రుని ప్రసాదించమని “ కోరినది . అందులకు కశ్యపుడు పన్నెండు సంవత్సరము లాచరించదగిన వ్రతమును ఉపదేశించి, ’అ వ్రత ఫలసిద్ధి వలన నీ మనోరథము సిద్ధించగల’దని తెలిపినాడు. ఆమె కూడా భర్త అదేశానుసారము భక్తితో ఆ వ్రతమును యథావిధిగా ఆచరించినది. అటు పిదప కశ్యప ప్రజాపతి వలన ఆమె గర్భమును ధరించినది.
అటుపిమ్మట ఒకనాటి ఏకాంతమందున అమెతో కశ్యపప్రజాపతి ” ఓ దేవి ! తపోనిష్ఠులైన మునులు కూడా తమ వ్రతాదులందు కర్మలను ఆచరించుటలో నిర్లక్ష్యము గావింతురు. అందువలన తమ మనోరథములను పొందలేక పోవుచున్నారు. వ్రతదీక్షా నియమములేమనగా – ఉభయ సంధ్యాకాలములందు నిదురించ రాదు . ఆ సమయమునందు నింద్యకార్యములను ఆచరించరాదు , బయటకు వెళ్ళరాదు , వెంట్రుకలను విరబోసుకొని యుండరాదు , అట్టి సంధ్యా కాలములందు అనేక ప్రాణులతోనున్న ప్రదేశమునందు భుజించరాదు. ఆవలించుట, తుమ్ముట అనేవి చేయరాదు. నవ్వునప్పుడు కూడా ముఖముపై ఏదేని అడ్డుగా నుంచుకొనవలెను. అట్టి కాలములందు ఇంటి మధ్య ప్రదేశములందు ఉండరాదు. రోలు,రోకటి,చేట, పీట,(ఆసనము) మొదలైన వాటిని ఎప్పటికినీ దాటి వెళ్లరాదు. ఉత్తరము వైపు తల ఉంచి నిదురించరాదు. ముఖ్యముగా సంధ్యాకాలమునందు అట్లాచరించరాదు. అసత్యము పలుకరాదు. ఇతరుల ఇళ్ళకు వెళ్ళరాదు. పరపురుషుడిని చూడరాదు. ఇట్టి
నియమ బద్ధురాలవై వ్రతమును అచరించినచో, నీకు జగదైశ్వర్యవంతుడగు పుత్రుడు కలుగగలడు. “అని
ఉపదేశించినాడు.
అందులకా దితి అంగీకరించి, ప్రతిజ్ఞ గావించినది. ఆమె ధరించిన గర్భము కూడా మంచి బలిష్టమై యున్నది. ఈ విషయము మయాసురుడు తన మాయ ద్వారా తెలిసికొనినాడు. తన స్నేహితుడైన ఇంద్రుని వద్దకు వెళ్ళి ఈ విషయమును వివరించినాడు. ” అని బ్రహ్మ ఈ కథను తెలుపుతూ ఉండగా మధ్యలో ఈ మాటను విని నారదుడు “నముచి సోదరుడైన మయునికి, నముచి హంతకుడైన ఇంద్రునికి స్నేహము ఎలా కుదిరింది ?” అని అడగగా, అప్పుడు వారి స్నేహాన్ని ఇట్లు తెలిపినాడు.
పూర్వములో నముచి దైత్యకులకు ప్రభువు గా ఉండెడి వాడు. సురాసురులకు జరిగిన యుద్ధమునందు ఇంద్రుని చేతిలో సంహరించబడినాడు. తన సోదరుని సంహారకుని వధింపవలెనని మయుడు ఘోరమైన తపస్సు గావించి, శ్రీమన్నరాయణుని మెప్పించి అనేక వరములను శత్రు భీషణకరమైన మాయను కూడా పొందినాడు. అటుపిమ్మట నిత్యము అగ్ని బ్రాహ్మణ పూజలను గావించుచు, సత్య దాన పరాయణుడై, ఇంద్రుని జయించుటకు ఎదిరించుఛుచున్నాడు. వాయువు ద్వారా ఈ విషయమును తెలిసికొన్న ఇంద్రుడు మయుని దగ్గరకు బ్రాహ్మణ రూపమున వెళ్ళి “ఓ దితిజాధిపతీ ! నీ దాతృత్వమును గురించి తెలిసి బ్రాహ్మణుడను నీ దగ్గరకు వచ్చినాను. నాకు వరమునిమ్ము.” అని యాచించినాడు. అందులకు మయుడు ఇంద్రుని గుర్తించక బ్రాహ్మణుడేనని నమ్మి,” నీకు కావలిసింది ఏదైననూ ఇచ్చినాను. అది పెద్దదా. లేక చిన్నదా అని విచారించుట తగదు. ” అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు ’ నీతో స్నేహము కోరివచ్చినాను ’ అని అన్నాడు. అందులకు ఆశ్చర్య పోయిన మయుడు ‘మన ఇరువురికి శత్రుత్వము లేదు కదా ! ’ అని ప్రశ్నించినాడు . అప్పుడు ఇంద్రుడు వర విషయమున మాట తీసుకొని తన సహస్రాక్షరూపమును ధరించినాడు. మయుడు మరల ఆశ్చర్య పోయి, ఇదేమిటని యనగా అప్పుడు ఇంద్రుడు మయుని ఆలింగనము గావించుకొనుచు ఏ విధముగానైన పండితులు తాము సాధించుకొనుదానిని సాధింతురు కదా ! కావున మనమివ్వురము ఇక్కడినుండి మిత్రులము. గడచినదేదో గడిచినది. వదిలి వేయుము.” అని తెలిపినాడు. అప్పటినుండి వారిరువురు ప్రియమిత్రులైనారు. మయుడు ఇంద్రునికి హితైషి యైనాడు. అందువలననే ఇంద్రుని హితముకోరి మయుడు దితి వృత్తాంతమును తెలిపినాడు .
మయుని మాటలను విన్న ఇంద్రుడు ’నేనేమి చేతును ? ‘ అని అడిగినాడు. అందులకు మయుడు తన వద్దనున్న మాయావిద్యను ఇచ్చి , ” మిత్రమా! నీవు అగస్త్యాశ్రమమునకు వెళ్ళు. అక్కడ గర్భిణియైన దితి ఉంటుంది. నీవు కొంతకాలము ఆమెకు సేవ చేస్తూ సరియైన సమయమునకై ఎదిరి చూడు. సమయము వచ్చిన పిదప ఆమె గర్భమున ప్రవేశించి, నీ వజ్రాయుధముతో ఆ గర్భమును ముక్కలుగా చేస్తూ సంహరించుము. లేదా నీ వశము అయ్యే విధముగా ఒనరించుము. అందువలన ఇక నీకు భవిష్యత్తులో శత్రు బాధ ఉండదు. ” అని అన్నాడు. ఇంద్రుడు కూడ అందులకు సరే యని అదే విధముగా దితి దగ్గరకు మిక్కిలి వినయమును నటిస్తూ వెళ్ళినాడు. ఏంతో సేవలను గావించినాడు. ఇంద్రుని ఆంతర్యమును గుర్తించని అ దితి కూడ ఆతనిని నమ్మినది.
ఒకనాటి సంధ్యాకాలమున మిక్కిలి నిద్ర వచ్చుటచేత ఉత్తరదిక్కుగా తలను పెట్టి, పరుండినది. అదే సమయము సరియైనదిగా తలంచి. వెంబడే మయుని మాయావిద్య ద్వారా ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆమె గర్భములోనికి ప్రవేశించి, గర్భమును సంహరించ బోయినాడు. అప్పుడు ఆ గర్భమందున్న శిశువు భీతుడై, “ఓసోదర! సోదరుడవైన నన్ను సంహరింతువా? నీవు పరాక్రమవంతుడవు. కదా ! యుద్ధముకంటే భిన్నముగా యుద్ధమునందు కాక మరొకరకముగా సంహరించుట ధర్మవిరుద్ధము కదా ! ఐననూ నేను ఈ గర్భమునుండి వెలివడిన పిదప నాతో యుద్ధము గావించుము. ఇట్లు గర్భమునందు శస్త్రాయుధ విహితుడనగు నన్ను సంహరించుట తగదు. ఆపత్తులోనున్ననూ మహనీయులు అధర్మ కార్యముల నాచరించరు కదా ! నన్న సంహరించిన నీవు విశ్వాసఘాతకుడవు. బాలఘాతకుడవు. బ్రహ్మ ఘాతకుడవు అగుదువు. ఈ చరాచర జగత్తే నీ ఆజ్ఞవలన నడుచుకొను చున్నది. అట్టి నీవు ఇట్లాచరించుట తగునా? శిశువు నైన నా పై దౌర్జన్యమునకు పాల్పడుటకు కారణమేమి? ఈ చర్య అపకీర్తికరమగునే కాని. పౌరుష చిహ్నమగునా? ” అని వివిధరీతుల అభ్యర్తన ద్వారా ఉపదేశమును గావించినాడు.
కాని ఇట్లెన్ని చెప్పిననూ, వినక ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఖండించినాడు. లోభగ్రస్తులకు, క్రోధగ్రస్తులకు దయ ఉండదు కదా! అట్లు ఖండించబడిన ఆ గర్భస్థ శిశువు చనిపోక, ఆ ముక్కలు అనేకులుగా మారి ఆయుధఘాత బాధలు తాళలేక “మేము నీ సోదరులము. విశ్వసింపదగినవారము. మమ్ము చంపవద్దు.” అనినప్పటిని పలుమారులు తన ఆయుధముతో ముక్కలుగా చేసినాడు. ద్వేషముచే బుద్ధినశించిన వారికి లేశమాత్రమైన కరుణ ఉండదు కదా ! . మొదట ఏడు భాగములుగాను, ఆ ఒక్కొక్కటి మరల ఏడేడు భాగములుగాను (7 x 7 = ) కలిసి మొత్తము 49 భాగములుగాను ఐనవి. అట్లు బహుశుభకర రూపములైన ఆ శిశువులు రోదించినవి. వాటి రోదనలు వినలేక ఇంద్రుడు రోదించవద్దు ( మా రుత ) అని పలికినాడు. అప్పటినుండి ఆ శిశువులు తేజో బల గుణ సమేతులైయ్యిరి. అటు పిమ్మట వారు తమ తల్లి ఎవరి ఆశ్రమమునందున్నదో అట్టి అగస్త్యుని వేడుకొనుచూ ” ఓ మహర్షి! మా జనకులు మీకు సోదరులు. మీ ఇరువురి సఖ్యత మా జనకులు నిరంతరము స్మరింతురు. మాపై కూడా మీకు అమితమైన వాత్సల్యముందని అనుకుంటున్నాము. కాని ఈ ఇంద్రుడు మాకు సోదరుడైననూ ఒక చండాలుని వలె మమ్ము సంహరించ ప్రవర్తించుతున్నాడు. ” అని వారందరు తమ బాధను తెలియ జేయగా వెంటనే అగస్త్యుడు అక్కడికి వచ్చి, దితికి తెలియజేసినాడు. ఇంద్రుని కూడ ” ఓ ఇంద్రా ! నీ శత్రువులు ఎల్లపుడు నీ పృష్ఠభాగమును చూతురు గా ! యుద్ధమునందు ఎవని పృష్ఠభాగమును శత్రువులు చూతురో అట్టి వానికి అది మరణప్రాయమే కదా ! ” అని శపించినాడు. గర్భవేదన నుభవించుచున్న దితి కూడ క్రోధముతో.. ” స్త్రీలచే అవమానము నొంది రాజ్యభ్రష్ఠుడవవుదువు .” అని శపించినది.
అదేసమయమునకు అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చినాడు. ఆయనకు అగస్త్య మహర్షి విషయమును వివరించినాడు. ఇంద్రుడు కూడ గర్భమునుండి వెలుపలికి వచ్చుటకు భయపడినాడు. ఆ పరిస్థితిని చూసి కశ్యపుడు మిక్కిలి దుఃఖించినాడు. ఇంద్రుని బయటకు రమ్మన్నాడు. “నీవు చేసినపని ఎట్టిది? నిర్మల వంశసంజాతులు ఇటువంటి నీచకార్యములాచరించుటకు మనస్సును కేంద్రీకరించరు.” అని అసహనంగా పలికినాడు.ఇంద్రుడు బయటకు వచ్చి, సిగ్గుతో తలవంచుకొని నిలబడినాడు. వ్యక్తులాచరించిన సదసద్ కర్మలను వారి స్వరూపమే తెలియజేయును. చివరకు మరల ఇంద్రుడే శిరస్సు వంచి , “శ్రేయస్సని తలచి, మీరేమి చెప్పుదురో నిస్సంశయముగా దానిని ఆచరింతున” ని పలికినాడు.
కశ్యపుడు లోకపాలురతో పాటు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు. ఆయనకు వృత్తాంతమంతా చెప్పి, దితికి గర్భశాంతిని ,ఇంద్రునికి నిర్దోషమును మరియు శాపవిమోచనమును , గర్బస్థ శిశువులకు ఆరోగ్యము తోపాటు ఇంద్రునితో మైత్రిని, విషయములను గురించి అడిగినాడు. అట్లు వినయముతో అడిగిన కశ్యప ప్రజాపతిని చూసి, బ్రహ్మ దేవుడు ” ఓ కశ్యపా ! నీవు ఇంద్రునితో పాటు వసువులతో, లోకపాలకులతో కలసి గౌతమీ నదికి వెళ్ళు. అక్కడ అందరితో కలిసి ఆ నదియందు స్నానమాడి, పరమేశ్వరుని పూజించి కీర్తించు. అందువలన శివానుగ్రహము కలిగినవాడవై , సర్వ శ్రేయస్సులను పొందగలవు. ” అని ఉపదేశించినాడు.
అదే ప్రకారము ఆచరించి, కశ్యపుడు పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించినాడు. ఆర్తుల దుఃఖములను తొలగించుటలో శివుడు, గౌతమీ రెండే కీర్తించబడినవి కదా ! కశ్యపుని స్తోత్రములకు మిక్కిలి సంతసించిన పరమేశ్వరుడు వృషవాహనుడై ప్రత్యక్షమైనాడు. కశ్యపుని మొర వినినాడు. అటు పిమ్మట దితి అగస్త్యులతో ఆ భగవంతుడు ” దితి గర్భమునందున్ననలుబది తొమ్మండుగురు మరుత్తులు సౌభాగ్యవంతులై, యజ్ఞభాగధేయమును , మరియు యజ్ఞములందు ఇంద్రుని కంటే ముందుగా హవిర్భాగమును పొందుదురు. ఇంద్రునితో వీరు సంతోషముతో నుందురు. అదేవిధముగా మరుత్తులతో కలిసిన ఇంద్రుని శత్రువులు జయింపజాలరు. ఓ కశ్యప ! నీ పుత్రులు సర్వకాలములందు విజయమును పొందుదురు. నేటి నుండి సోదరులను వధించువారు వంశనాశనమును , ఆపత్తులను పొందుదురు.” అని అన్నాడు . అగస్త్యునితో ” ఇంద్రుని పై క్రోధము తగ్గించుకొని శాంతించుము” అని అన్నాడు దితితో కూడ” ఐశ్వర్యవిభూషితుడగు పుత్రును ఒకడినే నీవు కోరుకొని దీక్ష వహించితివి. కాని నేడు నీకు శుభ, గుణ, శూర, బలసమన్వితులగు అనేకులైన పుత్రులు కలిగినారు. కావున మనో వ్యథను వదిలి వేయుము.” అని అనునయించినాడు.
అటుపిమ్మట దితి పరమేశ్వరునికి రెండు చేతులు జోడించి, ” ఓ భగవాన్ ! సురపూజిత ! తల్లిదండ్రులకు విశేషించి తల్లికి పుత్రదర్శనము శ్రేష్ఠమైనది, ప్రియమైనట్టిది కూడా కదా ! అందులోనూ రూపసంపద, శౌర్యవిక్రమములుగల పుత్రుడు ఒక్కడున్ననూ సంతోషము కలిగిచినప్పుడు అనేకులున్న ఇక చెప్పవలసినదేమున్నది? నీ అనుగ్రహమువలన నా పుత్రులు నిశ్చయముగా విజేతలగుదురు. ఓ దేవా ! నీ అనుగ్రహము కలిగే చోటు , గౌతమి అనుగ్రహము కలిగే చోటు శుభములను నిస్సంశయముగా కలిగించగలవు. నేను కృతార్థురాలనైతిని. ఐననూ మీరంగీకరించినచో భక్తితో మీకు ఒక విజ్ఞాపన. స్వామీ ! లోకమున సంతానము కలుగుట దుర్లభము. పుత్రుడు కలిగిన ఆ తల్లి కి కలుగు ఆనందము ఏమని వర్ణింపవచ్చు ? అందునా గుణవంతుడు, దీర్ఘాయుర్వంతుడు, రూపవంతుడు జన్మించిన ఆ తల్లికి స్వర్గలోకముతోనూ బ్రహ్మపదవి తోనూ అవసరమేమున్నది? ఇహ, పరలోకములందు ప్రయోజనములను కోరుకొనువారికి గుణవంతుడైన పుత్రుడు లభించుట అభీష్టకరమైనదే కదా ! అందువలన కల్పాంతమువరకు కూడా ఇట్టి అనుగ్రహమును కలిగించుము” అని కోరినది.
అందులకు పరమేశ్వరుడు ” సంతానము కలుగకపోవుటకు గాని, స్త్రీకి, గాని వంధ్యత్వం కలిగిన గాని కారణము గతజన్మ కృత మహాపాపఫలము. అట్టి దోషమును నివారించుటకు ఈ పుణ్య తీర్థమున స్నానము గావించి నన్నుస్తుతించిన, వారికి పాపము నశించును. మూడు మాసములు స్నాన, దానములు కావించిన పుత్రుని పొందగలరు. పుత్రసంతానము లేనట్టి స్త్రీ ఇక్కడ స్నానము గావించిన పుత్రుని పొందగలదు. ఋతు స్నాతయైన స్త్రీ ఈ గోదావరియందు స్నానమాడినచో పుత్రులనేకులను పొందగలదు.మూడు మాసములందు స్నానము గావించి నన్ను దర్శించుకొని స్తోత్రములతో స్తుతించునో ఆట్టి స్త్రీకి ఇంద్రునితో సమానుడైన పుత్రుడు కలుగగలడు. పితృదోషములచేత పుత్రులుపొందని వారు గాని, ధనాపహార దోషములచేత కూడుకొన్నవారు గాని ఇక్కడ గోదావరియందు నిష్కృతి లభించగలదు. ఇక్కడ స్నానమాచరించి పిండదానము గావించుటచేత యథాశక్తిగా సువర్ణదానము గావించుటచేత పితృదేవతలు సంతోషించగలరు. వారికి పుత్రుడు కలుగగలడు. ఎవరైతే కుదువబెట్టిన వాటిని దుర్బుద్ధితో అపహరింతురో రత్నమాణిక్యాదులను అపహరింతురో పితృదేవతలకు శ్రాద్ధాది కర్మలనాచరించడో అట్టి వారికి సంతానము కలుగదు. వంశవృద్ధి కలుగదు. వారికి ప్రేతగతి కలుగును. కావున అట్టివారు బ్రతికి యున్నప్పడు తీర్థ సేవనాదుల ద్వారా శ్లాఘ్యమైన సంతానము కలుగగలదు. గంగాసంఘమునందు స్నానమాడి, అనాదియూ, అనంతుడునూ, అజరుడు, చిత్సదానంద స్వరూపుడునూ, లింగాత్మకుడైన మహాదేవుడగు సిద్ధేశ్వరుని పూజించినచో, నిత్యం భక్తితో నియమ నిష్ఠలతో నిత్యము ముఖ్యముగా చతుర్దశి,అష్టమీ దివసములందు స్తుతించి, యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము సువర్ణదానము ఈ గోదావరియందు గావించినచో వారు శతాధిక పుత్రులను పొందుదురు. అటు పిమ్మట సకల మనోవాంఛలను పొంది అంత్యమునందు శివపురమును చేరుదురు . ఎవరైననూ మీరు ఈ స్తోత్రము గావించిన ఆరునెలలో వంధ్యయైనప్పటికినీ నిస్సంశయముగా పుత్రుని పొందగలదు. ” అని వరమిచ్చినాడు.
అప్పటినుండి గోదావరిలోని ఆ తీర్థము ’పుత్రతీర్థము’ గా కీర్తించబడుచున్నది. అక్కడ స్నానదానాదులచేత సర్వాభీష్టములను పొందగలడు. ఇంద్రునికి మరుత్తులకు కూడ అక్కడ మైత్రీ ఏర్పడుటచేత ’మిత్రతీర్థము’ గానూ ఇంద్రునకు నిష్పాపము కలిగినందువలన ’శక్రతీర్థము’ గానూ ,ఇంద్రుడు ఐంద్రీ (ఇంద్ర సంధమైన) శ్రీని పొందినాడు గావున ’కమలాతీర్థము’ గానూ చెప్పబడుచున్నది . ఆ ఒక్క తీర్థమే లక్ష తీర్థముల పుణ్యముల నిచ్చునట్టిదిగా కీర్తించబడుచున్నది.
Godavari Mahatmyam (Brahma puranam) {1} Ramatheertham
బ్రహ్మపురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము
రచన: విశ్వనాధశర్మ కొరిడె
అష్టాదశ పురాణములలోని ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విశిష్టతను పుంజుకొన్నది. పురాణములన్నీ శ్రవణపేయములైన కథాత్మకములు కలిగినవి కావు. కొన్ని శాస్త్రములను విశ్లేషించునట్టివి కాగా మరికొన్ని మంత్రములను, వాటి విశిష్టతను, వాటి ఉపదేశ, ఆచరణాది విశేషములు పెర్కొన్నవి. ఉదాహరణమునకు గరుడపురాణము ఔషధశాస్త్రమునకు పెద్దపీఠ వేసినది. అగ్ని పురాణము మంత్రశాస్త్రమునకు విజ్ఞానఖని ఐనది . పురాణములన్నీ వ్యాసమహర్షి వ్రాసినట్టుగా అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీ సుతః అని పేర్కొనబడినప్పటికినీ తరచి చూస్తే రచయితల బాహుళ్యం , కాలముల భేదములు కూడా కనపడుతున్నవి. కనుక సాహిత్య విమర్షకులు ఏకకర్తృత్వాన్ని అంగీకరిస్తూ లేరు. పురాణాలలో చివరిదిగా గుర్తిఛబడుచున్న
శ్రీమద్ భాగవతం మధురభక్తిమయ కథలసంపుటిగా పేర్కొనవచ్చు. శివపురాణము పరమేశ్వరుని లీలలను తెలిపే శివభక్తి రసాత్మక కథలనిలయం. బ్రహ్మ పురాణము కూడా 246 అధ్యాయములలో అనేక కథలను తెలుపునట్టిది. ఇందు అధిక భాగము సూర్యవంశ, చంద్ర వంశ రాజులవంశుల కథనములతోపాటు శ్రీ కృష్ణుని వృత్తాంతము. పార్వతీపరమేశ్వరుల పరిణయాది వృత్తాంతములు దశావతారములు మొదలైనవి ప్రధానముగా నుండగా ఇందుప్రధానముగా గోదావరీ మాహాత్మ్యం వరుసగా 70 వ అధ్యాయమునుండి 175 వరకు 106 అధ్యాయములందు చెప్పబడినవి. వాటికి మరల ప్రత్యేకమైన అధ్యాయ సంఖ్యలు ఇవ్వబడినవి. దాదాపుగా అన్ని అధ్యాయాలలో విడివిడిగా గోదావరీ మాహాత్మ్య కథలు ఉన్నవి. నాకు లభ్యమైనంతవరకు వాటిని అందించే ప్రయత్నం చేస్తాను.
శ్రీ రామతీర్థము
బ్రహ్మహత్యా దోషమును నశింపజేయునట్టి రామతీర్థమను పేరుగల తీర్థ రాజము ఒకటి కలదు. అ తీర్థముయొక్క నామ శ్రవణముచేతనే సర్వ పాపముల నుండి విముక్తుడు కాగలడు. అట్టి దాని గురించి ఒక ఐతిహ్యము కలదు.
పూర్వకాలమున ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన దశరథ మహారాజు శూరుడు, ధీరుడు, ప్రజ్ఞాశాలి. లోకప్రసిద్ధుడు. తన వంశపరంపరగా వచ్చిన రాజ్యమును ఏలుచున్నట్టి వాడు. ఆయనకు కౌసల్యా , సుమిత్ర , కైకేయి అను ముగ్గురు భార్యలు . ఆ ముగ్గురు కూడ సద్వంశ సంజాతులు , రూపలావణ్యాది లక్షణ లక్షితులు. సద్గుణ సంపన్నులు.
బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాన తపోనిష్ఠా గరిష్ఠుడైన వశిష్ఠ మహర్షి పురోహితులై ఉపదేశములు ఇచ్చుచుండగా ఆ రాజు రాజ్యము చేయుచుండగా చాతుర్వర్ణ్యములకు ఆధి, వ్యాధి రోగములు గాని, అనావృష్టి , దుర్భిక్షాది ఈతి బాధలు కాని ఉండెడివి కావు. బ్రహ్మచర్యాది చతురాశ్రమవాసులు తమతమ సంతృప్తికరమైన సౌకర్యములను పొందెడివారు.
ఇట్లుండగా అట్టిసమయమున దేవదానవులకు రాజ్యనిమిత్తమై యుద్ధము జరిగినది. ఒకసారి వారు మరొకసారి వీరు విజయమును పొందెడివారు. అందువలన ముల్లోకములు మిక్కిలి భయముతో నుండెడివి. యుద్ధము మానుమని బ్రహ్మ దేవుడు చెప్పినపటికినీ వారు వినలేదు. ఆ రెండు వర్గములవారు మహావిష్ణువును, పరమేశ్వరునికలిసి వారితో యుద్ధము గురించిచెప్పగా వారిని చూసి, ఆ దేవాధిదేవతలు ఇరువురు కూడ “ముందు తపస్సుతో బలవంతులు కండి. అటుపిమ్మట యుద్ధము గావించండి.” అని ఉపదేశించినారు. అదేవిధముగా వారు తపస్సునావరించి మరల యుద్ధము జేసిరి కాని విజయము పొందలేక పోయినారు.
అట్టి సమయమున అశరీరవాణి వారితో “ దశరథ మహారాజు ఏ పక్షమున ఉండునో ఆ పక్షమునకు విజయము కలుగును” అని పలికినది . అది విని రెండు పక్షములవారు విడివిడిగా మహారాజు దగ్గరకు కలువడానికి బయలుదేరినారు . దేవతాపక్షపువాడగు వాయువు శీఘ్రముగా మహారాజు దగ్గరకు వెళ్ళి విషయమును చెప్పి,“నీవు మా పక్షమున నుండవలసినదని” కోరినాడు . అందులకు అంగీకరించి , ‘వత్తున’ని ‘నీవు వెళ్ళమ’ని మాట ఇచ్చినాడు. పిమ్మట దైత్యులు కూడ వచ్చినారు కాని వారికి దేవతలకు మాట ఇచ్చినట్లు చెప్పి తిప్పి పంపినాడు. అదే మాటప్రకారము దేవతల పక్షమున దశరథుడు యుద్ధము గావించునప్పుడు తాళలేక నముచి సోదరులైన దైత్యులు దశరథుని రథచక్రపు చీలని భిన్నము గావించినారు. యుద్ధసందోహమునందు దశరథుడు ఆ విషయమును గమనించలేదు. యుద్ధము చూడగోర వచ్చి రథమునందున్న కైకేయిదేవి అట్టి దానిని గమనించి, రాజునకు చెప్పక తానే ఆ చీల ప్రదేశమునందు తన చేతి వేలును ఉంచినది . అటుపిమ్మట కొంత సేపటికి యుద్ధము ముగిసినది . దేవతల పక్షమున విజయము వరించినది. దేవతలచే సన్మానితుడై దశరథుడు తిరిగి అయోధ్యకు బయలు దేరినాడు. మార్గమధ్యలో కైకేయీ సహాయమును గుర్తించి, ఆశ్చర్య పోయి, ఆమెను మూడు వరములను కోరుకొమ్మనమని అడిగినాడు. అఫ్ఫుడా కైకేయి తానిప్పుడు కోరుకొననని చెప్పెను . అందులకు ఆమెకు ఇష్టమైన ఆభరణములను, కానుకలుగా ఇచ్చి వరములను సమయానుకూలముగా కోరుకొమ్మనమని తెలిపినాడు .
ఒకసారి ఆ మహారాజు వేటకు వెళ్ళినాడు. ( ద్యూత, స్త్రీ, మృగయా, మద్య, వాక్పారుష్య దండ పారుష్య , అర్థదూషణములు అను ) రాజు సప్తవ్యసనములు లేనివాడై యుండాలి అని తెలిసి కూడ ఆయన విధివశాత్తు వేటకు వెళ్ళినాడు . అక్కడ ఒకచోట పల్లపు ప్రాంతములో నీటిని త్రాగుటకు వచ్చిన మృగములను సంహరించెడివాడు. అదే ప్రకారముగా ఆనాడు కూడ అక్కడికి చేరుకొన్నాడు.
కాని కాలవైపరీత్యము బలీయమైనది. అక్కడికి సమీపములో వృద్ధుడైన వైశ్రవణుడు అను మహర్షి తన భార్యా పుత్రునితో ఉంటున్నాడు. ( వాల్మీకి రామాయణము ప్రకారము వారు వైశ్యులు) అతడు, అతని భార్యకూడ అంధులు, బధిరులు. (చూడలేరు వినలేరు). అదే సమయానికి వారు తన పుత్రుని పిలిచి అక్కడికి మేమిరువురము దాహముతో తాళలేక ఉన్నాము. తొందరగా నీరు తీసుకరమ్ము.” అని అన్నారు. తల్లిదండ్రులపట్ల మిక్కిలి భక్తిశ్రద్ధలు గల ఆ పుత్రుడు సరే యని వారికి నమస్కరించి, ఒక కలశమును తీసుకొని రాజున్న నీటి కొలనుకు వెళ్ళినాడు. రాజు అక్కడ ఉన్నట్టి విషయము ఆ బాలునకు తెలియదు. రాజుకూడ ఆ ద్విజకుమారుని రాకను గమనించలేదు. అతడు నీళ్ళ లోనికి దిగి , కలశమును నీట ముంచినాడు. ఆ సమయమున వచ్చిన శబ్దమును విని , రాజు ఏనుగు వచ్చినదనుకొని తీక్షణబాణములు వేసినాడు. వనగజములైనా రాజులకు సంహారయోగ్యములు కావన్న విషయము ఆయనకు తెలిసిననూ బాణములు వేసినాడు.
మర్మ దేశమునందు గాయపడిన ఆ బ్రహ్మణకుమారుడు ” అనపరాధుడైన బ్రాహ్మణపుత్రుడనైన నాపై బాణము వేసినది ఎవరు?” అని బిగ్గరగా అరువగా ఆ ఆర్తనాదమునకు నిశ్చేష్టుడైన దశరథుడు వెంటనే అక్కడికి చేరుకొన్నాడు. అక్కడ బ్రహ్మతేజస్సు చేత విరాజమానముగా నున్న ఆ ముని కుమారుని చూచి దుఃఖితుడైనాడు. ” ఓ బ్రాహ్మణోత్తమ ! నీవెవ్వరవు? నీ పై బాణము వేసిన నేను బ్రహ్మహత్యా దోషమును పొందినాను. బ్రహ్మ హంతకుడిని చండాలకుడు కూడా స్పృషించరాదు. చూడకూడదు. కదా ! నా పాపమునకు నిష్కృతి లేదా ? ” అని అనగా అప్పుడా బాలుడు ” నా ప్రాణములు పెకిలించబడుతున్నాయి. ఇదంతా పూరజన్మకర్మ ఫలితము. నేను నా గురించి బాధపడ్తూ లేను. కాని నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. అంధులైన వారిరువురికి శుశ్రూషచేయువారు లేరే ! నేను లేక వారిరువురు ఎట్లు బ్రతుకగలరు? అనియే నా బాధ . వారిరువురి సేవను కోల్పోతున్నాను. ఐనా భగవంతుడు ఎటువంటి పని చేసినాడు? సరే ఐనప్పటికినీ ఓ రాజా ! నీవు తొందరగా ఈ కలశములో నీరు తీసుకొని మా జననీ జనకులు ఇవ్వవలసినది. వారు దాహంతో అల్లాడుతున్నారు. వారి ప్రాణములను కాపాడవలసినది. ” అని కోరినాడు. ఈ విధముగా పలుకుతున్నంతలోనే ఆ బాలుని ప్రాణములు గాలిలో కలిసి పోయినవి.
రాజు వెంటనే తన ధనుర్ బాణములను వదిలి కలశమున నీటిని తీసుకొని ఆ వృద్ధదంపతులదగ్గరికి వెళ్ళినాడు. తమ కుమారుని రాక ఆలస్యమునకు తాళలేక వారు పలు పర్యాయములు కీడును శంకించుతూ దుఃఖితులై యుండగా కాళ్ళ చప్పుళ్ళకు తమ కుమారుడే అని తలంచి సంతసించినారు. ఆలస్యానికి గురించి పలుప్రశ్నలు వేసినారు. మహారాజు జవాబు ఇవ్వక పోయేసరికి వారికి అనుమానము వచ్చి జవాబివ్వనిచో జలపానము చేయమని భీష్మించుక కూర్చొనేసరికి వారికి దశరథుడు జరిగిన సంఘటన చెప్పినాడు.
అది వినగానే ఆ దంపతులు హఠాత్తుగా క్రిందపడి దుఃఖించినారు . రాజు వారిని సమీపించగా”బ్రహ్మహత్యా దోషముగల నిన్ను మేము తాకరాదు. నీకు ఎప్పటికినీ పాపనివృత్తి లేదు.” అని నివారించినారు . తోవ చూపించగా వారు పుత్రుని శవముదగ్గరకు వెళ్ళి ఆ శవమును స్పృశించి మిక్కిలి విలపించుతూ “నీవు కూడా మావలె పుత్రవియోగము తాళలేక ప్రాణములను వదిలెదవు ” అని శపించుతూ , వారిరువురు ఆ శవముపైననే ప్రాణములను వదిలినారు. రాజు వారందరికి అంతిమసంస్కారములు గావించి తన భవనమునకు వెళ్ళినాడు.
అటుపిమ్మట మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్పగా ఆయన కూడ ఆ పాప నిష్కృతికై పలు విధములుగా ఆలోచించి, మహారాజుతో అనేకమహర్షుల ఆధ్వర్యమున అశ్వమేధ యాగమును గావింపజేసినాడు. అట్టి యాగము పూర్తి ఐనంతలోనే అశరీరవాణి “దశరథుని శరీరము పవిత్రమైనది . యథా ప్రకారముగా వ్యవహరించగలడు. ఆతనికి పుత్రులు కలుగగలరు. జ్యేష్ఠ పుత్రుని పుణ్య ప్రభావమువలన భవిష్యత్తులో నిష్పాపుడు కాగలడు. ” అని పలికినది.
అటు పిమ్మట చాలా రోజులకు ఋష్యశృంగ మహర్షి ప్రభావమువలన , దేవతల కార్యసిద్ధికొరకు దేవతలతో సమానులైన నలుగురు పుత్రులు కలిగినారు. కౌసల్యయందు శ్రీరాముడు, సుమిత్రయందు లక్ష్మణ , శత్రుఘ్నలు , కైకేయి యందు భరతుడు జన్మించినారు. వారు పెరిగి పెద్దవారైనారు, వశిష్ఠాదులవద్ద సకల విద్యాపారంగతులైనారు. విశ్వామిత్రమహర్షి యాగ రక్షణమునకు బాలులను పంపమని కోరగా ముందు అంగీకరించక పోయినప్పటికినీ వశిష్ఠ మహర్షి ఉపదేశము మేరకు దశరథుడు విశ్వామిత్రుని వెంబడి రామలక్ష్మణులను పంపినాడు. విశ్వామహర్షి కూడా సంతసించి, వారికి అనేకమైన దివ్యమైన శస్రాస్త్రవిద్యలను వారికి ఉపదేశించినాడు. అట్టి శస్త్రవిద్యలతో వారు యాగ రక్షణ గావించినారు,
యాగరక్షణ ముగిసిన పిదప ఆ మహర్షి రామలక్ష్మణులతో జనకమహారాజును చూడ వెళ్ళినాడు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు వారిరువురు బాలలు తమ విలువిద్య యొక్క చిత్రమైన ప్రదర్శనముతో వారందరిని అబ్బురపరిచినారు. అట్టిదానికి మిక్కిలి సంతోషించిన జనకమహారాజు లక్శ్మీస్వరూపిణీ, అయోనిజయగు తన కూతురు సీతాదేవిని రామునకు ఇచ్చినాడు, అట్లే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా తమ కూతురులను ఇచ్చి అందరికి దశరథ సమక్షములో వివాహము గావించినాడు.
అటు పిమ్మట చాలా కాలమునకు రాజు ప్రజల కోరికతో గురువుల అనుమతితో శ్రీరామునకు రాజ్యమునివ్వ గోరగా మంథర ప్రోద్బలమువలన కైకేయి అందులకు అడ్డుపడి, రాముని వనవాసమునకు వెళ్ళునట్లు చేసినది. రాముడు కూడ తన తండ్రిని సత్యవాక్యపాలకునిగా గావింపజేయ గోరి, సీతా లక్ష్మణులతో పాటు వనములకువెళ్ళెను. దశరథుడు కూడా భరతునికి రాజ్యమునివ్వలేదు. దశరధుడు వనములకు వెళ్ళిన వారిని తలచుకొంటూ బ్రాహ్మణ శాపమును కూడా స్మరించుకొనుచూ ప్రాణములను వదిలినాడు.
తాను గావించిన పరిపాకముల వలన ఆ దశరథ మాహారాజు యమ లోకమునకు తీసుకపోబడినాడు. అక్కడ తామిస్రాది అనేక నరకములందు విభిన్న భయంకర యమయాతనములు విధించబడినవి.
ఇంతలో సీతా రామలక్ష్మణులు వనవాసము గావించుచు కొంతకాలము చిత్రకూటమునందు కొంతకాలము గడపి. అక్కడ నుండి దండకావనమునకు చేరుకొన్నారు . అక్కడ సంచరించుచూ ఒకసారి గౌతమీ నదికి ఐదు యోజనముల దూరములో చేరుకొన్నారు. అట్టి సమయమున యమరాజు తన కింకరులను పిలిచి, ” శ్రీరాముడు గోదావరీ సమీపమునకు చేరుకొన్నాడు. ఆయన గోదావరికి ఐదు యోజనాల పరిసర ప్రాంతములో ఉన్నంతవరకు ఆతని తండ్రియైన దశరథుని నరకబాధను కలిగించవద్దు. పరమేశునితో కలిసిన పరాశక్తిగా గోదావరిని చెప్పుదురు. కావున త్రిమూర్త్యాది సమస్త దేవతలకు అర్చ్యనీయురాలు. ఎవరైననూ గౌతముని అగౌరవించనిచో వారు నిష్కృతి లేని పాపమున పడుదురు. పాపాత్ముని కుమారుడైననూ నిరంతరము ఆ దేవిని స్మరించినచో, ఆతని తండ్రి ఐన పాపాత్ముడు కూడ అనంత ఘోర పాపముల నుండి విముక్తుడగును. ఆ నది సమీపమున పుత్రుడున్నచో తండ్రిని నరకయాతన గావించుట ఎవరితరము కాదు. ” అని ఆదేశించుచూ పలికినాడు. అదేవిధముగా దశరథునకు యమబాధలు నిలిపివేయబడినవి.
వారు దశరథుని ఘోర నరకముల నుండి ఉద్ధరించుతూ “ఉత్తముడైన పుత్రుని పొందినందులకు నీవు ధన్యుడవు. అట్టి పుత్రుని వలన తండ్రికి ఇహ, పరలోకములందు కూడ సౌఖ్యమే కదా ! భాగ్యశాలివైన నీవు తప్ప అట్టి పుత్రుని మరెవరు పొందగలరు ?” అని పొగిడినారు. మహారాజునకు జరిగిన విషయము ఏమిటో అర్థం కాలేదు . విషయమేమిటని వారిని అడిగినాడు. అప్పుడు వారిలోని ఒక కింకరుడు ఒకడు ” వేదశాస్త్రాలలో నున్న అతి రహస్యమైన విషయము ఈ రోజు నీ పుత్రుని వలన మేము తెలిసికోగలుగుతున్నాము. నీ పుత్రుడు రాముడు భార్యా, సోదరులతో పాటు గౌతమీ పరిసర ప్రాంతమునకు వచ్చినాడని నీవు ఈ నరకమునుండి ఉద్ధరింపబడినావు . వారు ఆ ప్రాంతమున ఉన్నంతవరకు నీకు నరక బాధలు నిలిపివేయబడును. ఒకవేళ వారు ఆ పవిత్ర గోదావరీతీరాన నిన్ను స్మరించినవారై, స్నానమాచరించి , పిండాదికములు అర్పించినచో నీవు సర్వపాప విముక్తుడవై స్వర్గమును చేరుదువు. ” అని వివరించినాడు.
అది విని సంతోషించిన దశరథుడు ” అటులైన నాకు అనుమతించిన నేను అక్కడికి వెళ్ళి మీ మాటలను వారిరువురికి చెప్పెదను. నా విముక్తికై అనుజ్ఞ నిచ్చి నాకు సహాయపడగలరు” అని వారిని కోరినాడు. అందులకు వారు రాజు పట్ల దయతో అంగీకరించగా రాజు తన పుత్రులున్న గౌతమీసమీపమునకు వెళ్ళినాడు. కాని పాపాత్ములు పొందదగిన భయంకర యాతనా శరీరమును చూచుకొనుచూ , తమ పాపకర్మను తలంచుకొనుచూ మిక్కిలి బాధపడుచున్నవాడై అక్కడికి చేరుకున్నాడు .
అదే సమయానికి సీతారామలక్ష్మణులు కూడా గోదావరీ తటమునకు వెళ్ళినారు. యథావిధిగా స్నానమాడినారు. కాని వారికి అక్కడ తినుటకు ఏమియునూ దొరకలేదు. ఆకలితో నున్న లక్ష్మణుడు “తినుటకు ఏమియునూ దొరకుట లేదు. ఆకలితో నున్నాము ఏమి చేయుదుము?” అని అన్నను అడిగినాడు. అప్పుడు రామచంద్రుడు “సోదరా ! మనమాచరించిన కర్మానుసారముగా మనకు ఫలితము దక్కగలదు. మనము బ్రాహ్మణ భోజనము గావింపలేదు . ఎవరైతే బ్రాహ్మణులకు భోజనము పెట్టరో, వారిని పూజించరో. పెట్టిన భొజనము కూడా అవమానమును కలిగించుతూ పెట్టుదురో వారికి భొజనము దొరకక ఆకలితో అలమటింతురు . అందువలన మనకు భోజనము దొరకలేదు. కావున మనము దేవతాభ్యర్చన గావించి, అగ్నికి హవనము గావించిన , సమయానుకూలముగా విధి మనకు భోజనము కల్పించగలదు . ”
ఇట్లు వారిరువురు కర్మసంచయఫలితములను గురించి ఆలోచించుతూ మాట్లాడుతున్నంతలోనే దశరథుడు పిశాచరూపములో అక్కడికి చేరుకొన్నాడు. లక్ష్మణుడు తండ్రిని చూచి కూడ గుర్తుపట్టక కోపముగా ధనస్సును ఎక్కుపెట్టి, “ఓరి ! నీవు దానవుడవో రక్కసుడవో గాని ఆగుమక్కడనే. దగ్గరికి వచ్చిన నిన్ను సంహరింతును. ఇక్కడ ధర్మపరాయణుడు, సత్యసంధుడు, గురుభక్తిపరాయణుడు, దేవ,బ్రాహ్మణ సేవానిరతుడు ముల్లోకరక్షకుడునూ ఐన దశరథాత్మజుడగు శ్రీ రాముడు ఉన్నాడు. నీవంటి పాపాత్ములకు ఇక్కడికి ప్రవేశము లేదు. వెళ్ళు . లేదా నీ ప్రాణములను నేను అంతమొందింతును . ” అని హెచ్చరించినాడు.
అప్పుడా దశరథుడు వారితో ” పుత్రులారా ! నేను దశరథుడను . మీ జనకుడను . మూడు బ్రహ్మహత్యా దోషములవలన నరకమునందు పడి ఈ విధమైన శరీరముద్వారా నరక బాధలను అనుభవించుతున్నాను.”అని తన పాప వృత్తంతమును వివరించినాడు. తండ్రిని గుర్తించి, ఆయనకు సాష్టాంగంగా నమస్కరించుతూ వారు ఆయన వృత్తాంతమును విని , మిక్కిలి దుఃఖితులై మూర్ఛను పొందినారు . చివరకు సీతాదేవి వారిని ఓదారుస్తూ రామునితో ” నాథా! మీవంటి వారు ఇట్లు దుఃఖించ తగదు. ఇది దైవికమైననూ, మానుషమైననూ ప్రతీకారము గావించుట గురించి ఆలోచించవలెను. మూడు బ్రహ్మహత్యాదోషములలో హత్యగావించబడిన విప్రకుమార హత్యాదోష పాపమును మొదట నాకివ్వనిమ్ము. మిగిలిన రెండిటిల్లో మీరిరువురు తలా ఒకొటిని తీసుకొనండి. ” అని ధర్మయుతమైన మార్గమును తెలిపినది. అందులకు వారిరువురు కూడా అంగీకరించినారు.
అప్పుడు దశరథుడు సీతతో ” సీత ! నీవు బ్రహ్మతత్వజ్ఞుడైన జనకరాజ పుత్రికవు. అయోనిజవు. ధర్మస్వరూపుడైన రాముని ధర్మపత్నివి కావున యుక్తి యుక్తముగా మాట్లాడుచున్నావు. ఐననూ, నా విషయములో అంతగా శ్రమ పడవలసిన పని లేదు. ఈ గోదావరియందు స్నానదానములు గావించుట చేతనూ, పిండ నిర్వాపణము ద్వారా బ్రహ్మహత్యా దోషముల మూడింటినుండి విముక్తుడను కాగలను. గోదావరియొక్క అనుగ్రహము చేత దుర్లభమైనదేమున్నది?”అని పలికినాడు .
ఆ మాటలకు రాముడు అంగీకరించి సిద్ధపడుచుండగా అక్కడ భక్ష్య భోజ్యపదార్థములు ఏవి కనపడనందున లక్ష్మణుడు ఇంగుదీ ఫలములను తెచ్చినాడు.
ఆ ఇంగుదీ ఫలముల పిండిముద్దతో పిండప్రదానము చేయబోవుచూ మిక్కిలి దుఃఖించినాడు. అంతలో అశరీరవాణి ” ఓ రామ ! ధర్మనిరతుడవైన నీవు ఈ విధముగా దుఃఖించకూడదు. ధనప్రాగల్భముతో చేసిన వ్యక్తి పాపి యగును. శ్రాద్ధమును చేయుగోరు వ్యక్తి ఏ అన్నమును స్వీకరిస్తున్నాడో , అదే అన్నమును పితృదేవతలు కూడ గ్రహింతురు . అని శాస్త్రములలో చెప్పబడుతున్నది కదా ! అందువలన శ్రద్ధయే ప్రధానము. ” అని పలికినది.
ఓదార్పు పొందిన ఆ రామచంద్రుడు అదే విధముగా పిండప్రదానము చేయుచూ , పిండమును భూమిపై నుంచినంతనే అక్కడ దశరథుడు కనబడలేదు. అక్కడ ఆయన శవము మాత్రమే కనబడినది. ఆ వెంఠనే అనేక విమానములలో లోకపాలకులు , రుద్రులు , ఆదిత్యులు , అశ్వినీదేవతలు చేరుకున్నారు. వారి మధ్యన దశరథుడు దివ్యరూపమును ధరించి, కిన్నెరులచేత కీర్తించబడుచు, మిక్కిలి ప్రకాశమానుడై యున్నాడు. ఆ దేవతాగణమును గని రాముడు చేతులు జోడించి నమస్కరించినాడు. కాని వారి మధ్యనున్న తన తండ్రిని గుర్తించక ‘ మా తండ్రి దశరథమహారాజు కనబడుట లేదు. ఎక్కడున్నాడు? ’ అని వారిని అడిగినాడు. అప్పుడు అశరీరవాణి ” రామ ! మీ పితృపాదులు సమస్త బ్రహ్మహత్యాది దోషములనుండి విముక్తుడైనాడు . దేవతలందరితో పాటు ఆ విమానాన్ని అధిరోహించినాడు. చూడుము. ” అని పలికినది .
ఆ తరువాత దేవతలు కూడ శ్రీ రామునితో ” ఓ రామా ! నీవు ధన్యుడవైనావు. కృతకృత్యుడవైనావు. గౌతమీ తీరమునందు నీవు చేసిన పుణ్యకర్మల ద్వారా మీ జనకుడైన దశరథుడు స్వర్గమును చేరుకుంటున్నాడు. ఏ వ్యక్తియైతే తన కర్మలద్వారా తమ పితృవర్గములను ఉద్ధరించునో, అట్టివాడు ధన్యుడు. ఆట్టి ధన్యుని చేత ఈ భువనత్రయము అలంకరించబడుచున్నది.” అని ప్రశంసించినారు. దశరథుడు కూడ ” ఓ పుత్రా! నీ కర్మాచరణ ద్వారా నేను తరించబడినాను. నేను కృతకృత్యుడనైనాను. ఏ పుత్రుడైతే తన పితృవర్గమును తరింపజేయునో, అట్టి పుత్రుడు ధన్యుడు.” అని ఆనందముతో పలికినాడు .
అది విని దేవతలతో రాముడు “ఓ దేవతలారా ! పరమపూజ్యుడైన మా జనకుల విషయమున చేయదగిన కార్యములు ఇంకా ఏమున్నవి ? ” అని అడిగినాడు. అప్పుడు దేవతలు “మహావీర ! గంగతో సమానమైనట్టిది గంగ ( నది) కాని , నీతో సమానుడైన పుత్రుడు కాని , శివునితో సమానుడైన దేవుడు కాని తారకమంత్రముతో సమానమైన మంత్రము కాని లేవు. నీవు పితృలకు చేయదగినదంతయునూ చేసియున్నావు. పుత్రుడవైన నీ చేత పితరులు తరించబడినారు. కావున నీవు స్వేచ్ఛగా నుండవచ్చు.” అని పలికిరి. అట్లు దేవతల ద్వారా ఆ గోదావరీ మాహాత్మ్యము విని విస్మితుడై మిక్కిలి సంతోషముతో “అహో ఈ గంగా ప్రభావము. ముల్లోకము నందు సాటిలేనట్టిది. త్రిలోకపావనమైన ఈ గంగను మేము చూసి ధన్యులమైతిమి.” అని అక్కడ గౌతమీ సైకతముతో మహేశ్వరుని ప్రతిష్ఠించి , భక్తిపూర్వకముగా పూజించినాడు. బహువిధములుగా స్తుతించినాడు .
సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. అందులకు రాముడు” భక్తితో నిన్ను ఎవరైతే స్తుతింతురో వారు కార్యసిద్ధులను పొందవలెను. నరకమున పడినవారు తమ పుత్రులు గావించిన పిండ ప్రదానముచేత నరకమును వీడి స్వర్గమును చేరుకొనవలెను. ఈ గోదావరియందు స్నానమాత్రము చేతనే తమ పుట్టుకనుండి త్రికరణముల ద్వారా గావించిన పాపములన్ని నశించవలెను. ఇక్కడ ఎవరైతే యాచకులకు భక్తితో అణు పరిమాణమైన దానమును జేసిన వారికి అక్షయమైన ఫలితము కలుగవలెను.” అని కోరినాడు. భగవంతుడు మహేశ్వరుడు కూడా అందుకు తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. దేవతలు కూడా తమ తమ లోకములకు వెళ్ళినారు.
అప్పటినుండి ఆ తీరము రామతీర్థముగా ప్రసిద్ధమును పొంది స్నాన,దాన,పూజా పితృ కర్మల నాచరించువారి సమస్త పాపములను నశింపజేయుచూ సర్వాభీష్టములను నెరవేరజేయుచున్నది .
Dhanur Masam - Vaikuntha Ekadashi
ధనుర్మాసము -వైకుంఠ ఏకాదశీ
రచన: కొరిడె విశ్వనాథ శర్మ
మన ప్రాచీనులు కాలాన్ని సూచించడములో నాలుగు ప్రమాణములను అనుసరించారు. ‘మాసశ్చతుర్థా – సావనస్సౌరశ్చాంద్రో నాక్షత్ర ఇతి ” అని నిర్ణయ సింధుకారుడు మాసములు సావనము, సౌరము, చాంద్రము,
నాక్షత్రము అని నాలుగు విధములని పేర్కొన్నాడు. మనము చైత్ర, వైశాఖాది మాసములు, అదేవిధముగా పాడ్యమి, విదియాది తిథులను చాంద్రమానముననుసరించి లెక్కింతుము. చంద్రుని భ్రమణమును బట్టి ఈ కాలమానము నడుచును. ఔత్తరాహికులు ఆచరించు బార్హస్పత్యమానము కూడ చాంద్రమానమునే అనుసరించును. దాక్షణాత్యులు సౌరమానమును అనుసరింతురు. సూర్యోదయాస్తమయాదులే ఈ కాల మానమునకు ఆధారములగుచున్నవి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండు నెల రోజులకు ఆయా మాసములుగా గుర్తించబడుచున్నవి. ఇవి చాలావరకు ఆయా ఇంగ్లీష్ తేదీలను పోలినవై, అధిక శాతం ఆయా తేదిలలోనే వచ్చును. అందులకే తమిళులకు ఏప్రిల్ 14వ తేదీయే మేషమాసారంభమగుటచే దానిని వారు సంవత్సరాదిగా ఉత్సవము జేసికొందురు.
“రవేః సంక్రామణం రాశౌ సంక్రాంతి రితికథ్యతే ” నాగరఖండం అని చెప్పుట చేత ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంక్రాంతిగా చెప్పబడుచున్నది, ఈ ప్రమాణముగా మకర సంక్రాంతి (జనవరి 14 ) మొదలుకొని కర్కాటక సంక్రాంతి (జులై 16) వరకు ఉత్తరాయణముగా, తదాది మరల సంక్రాంతివరకు దక్షిణాయణముగా – “మకర కర్కట సంక్రాతి క్రమేణోత్తరాయణం దక్షిణాయనం స్యాత్” ముక్తసంగ్రహం
అని చెప్పబడినది. ఇది మానవులకు కాలమానము కాగా “ అయనే దక్షణే రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కాపింజలసంహిత పేర్కొన్నది. మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక అహోరాత్రమైన దివసముగా చెప్పబడుతున్నది.అందు ఉత్తరాయణము దివసభాగము కాగా, దక్షిణాయనము రాత్రి భాగమగుచున్నది.
ధనుర్మాసము
అట్టి ప్రమాణమున మనకు ఒక సంవత్సరము (12 నెలలు ) దేవతలకు 24 గంటలు అగుచున్నది. అనగా మనకు ఒక నెల వారికి 2 గంటలు కదా ! అట్లైన మకర సంక్రాంతి దేవతల సూర్యోదయ కాలమగును. మకర సంక్రాంతికంటే పూర్వమైన ధనుస్సంక్రాంతి ఉషః కాలమగును అగుచున్నది. ‘ బ్రాహ్మే ముహూర్తే బుద్ధ్యేత ధర్మార్థౌ చాను చింతయేత్ ” అని స్మృతికారులు చెప్పినట్లు బ్రాహ్మీ ముహూర్తమునందు మేల్కొనాలి. అదే విధముగా ఈ ధనుర్మాసము దేవతలకు బ్రాహ్మీమూహూర్తకాలము కావున ఇట్టి సమయమున దేవతార్చన చాలా విశిష్టమైనది.
“ఆషాఢాదిషు మాసేషు శయంతం కార్తికావధి
చాపంగతే దివానాథే ఉత్థాప్య శయనాద్ధరిమ్ |
సవిష్ణులక్షణైఃస్తోత్రైర్ బహుభిః పరిగీయ చ
ఉషః కాలే తు సంప్రాప్తే చార్చయిత్వా జనార్దనమ్
ఉపచారైః షోడశీభిర్ ముద్గాన్నం చ నివేదయేత్ “
అని బ్రహ్మండపురాణము తెలిపినది. ముల్లోకాధిపతియైన ఆ శ్రీమన్నారాయణుడు ఆషాఢమున మొదలుకొని కార్తీకము ( మానవ ప్రమాణమున రాత్రి ఏడున్నర నుండి ఉదయము నాలుగున్నర ) వరకు నిదురించును. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశిగా సంబోధిస్తారు. ఈ సమయమును చాతుర్మాస్య దీక్షాసమయము గా ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఆ సమయములో చతుర్వర్ణ్యములవారికి ఆచరించవలసిన నియమములను అవి పేర్కొన్నవి. సూర్యుడు దనురాశి లోనికి ప్రవేశించిన సమయమునుండి విష్ణు సంబంధమైన స్తోత్రాదులచేత భగవంతుని మేల్కొపవలెను. (మానవ ప్రమాణాత్మకమైన) ఉషఃకాలమునందు షోడ శోపచారములచే పూజిచవలెను. పిమ్మట ముద్గాన్నము (పులగం) ను నివేదించవలెను
కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయేద్ధరిమ్ |
“ సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి ||”~ శ్రీమద్భాగవతము
“ ధనుస్సంక్రాంతిమారభ్య మాసమేకం వ్రతం చరేత్ | ~ కాపింజలసంహిత .63.అధ్యా.39 శ్లో.
అని భాగవత , కాపింజలసంహితలు కూడ ఈ ధనుర్మాస పూజా వైశిష్ట్యాన్ని తెలుపుతున్నాయి. సూర్యోదయమున కంటే పూర్వమే ఉషః కాలము అరుణోదయ సమయమునందు ఆ భగవంతుని నెలరోజులు పూజించవలెనని పేర్కొంటున్నాయి. అరుణోదయ సమయమనగా _
“ఉదయాత్ప్రాక్ చతస్రస్తు ఘటికా అరుణోదయః ” మాధవీయ స్కంధం
అని అరుణోదయమును గురించి నిర్ణయ సింధువు నందు తెలియజేయబడినది. ఉదయమునకు పూర్వము నాలుగు ఘడియలు అరుణోదయమగును. అనగా ఒక ఘడియ ఇరువది నాలుగు నిమిషములు కాగా నాలుగు ఘడియలనగా తొంబది ఆరు నిమిషములగును. అనగా ఒక గంటా ముప్పది అరు నిమిషములు అని కదా ! తత్పూర్వము అరుణోదయముగా చెప్పవచ్చును.
“ చాపస్థితే ఉషః కాలే రవౌ ప్రతిదినం హరిం” ~ వాసిష్ఠ సంహిత వచనం
“ బ్రాహ్మేముహూర్తే సంప్రాప్తే రవౌ ధనుషి సంస్థితే |
.అర్చయిత్వా శ్రియః పతిమ్ ||”~ శ్రీ వైఖానస శాస్త్రము.
అను ప్రమాణములు కూడ ఉషఃకాల పూజను ప్రశంసించుచున్నవి. ఇట్లు చేసినచో సహస్రవర్ష పూజను చేసిన ఫలితమును పొందునని తెలిపి యున్నవి.
ముక్కోటి ఏకాదశి – వైకుంఠ ఏకాదశి
ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా శుక్లపక్ష ఏకాదశి తిథి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రములైనవి. ఇట్టి దివసమునందు గృహస్థునకు , బ్రహ్మచారులకు నిత్యాగ్ని హోత్రులకు కూడ నైమిత్తికమైన కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది.
“ గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్తథైవ చ |
ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి ||
అని అగ్ని పురాణము మొదలైనవి తెలిపినవని నిర్ణయసింధుకారుడు తెలిపియున్నాడు.
ఇట్టి ఏకాదశి దివసమున సౌరమానమునందలి ప్రశస్తమైన ధనుర్మాసము నందు ( అది మార్గశిర్షము నందే కాని పుష్యమాసమందే కాని ) వచ్చు ఏకాదశి వైకుంఠ ఏకాదశి గా లేదా ముక్కోటి ఏకాదశి గా కీర్తించ బడుచున్నది. ఇది ఆ భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది. శుభకరమైనది కూడ. ఎందులకనగా రెండు నేత్రములు కలిగిననూ దృష్టి యొకటే యైనట్లు సూర్యచంద్రులు నేత్రములుగా కలిగిన ఆ భగవంతునకు సౌరమాన , చాంద్రమానములలోని ప్రశస్తములైన ధనుర్మాసము , శుక్ల ఏకాదశి శ్రేష్ఠమైనదనుటలో అతిశయోక్తి కాదు కదా !
“ ధనూ రాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ
త్రింశత్ కోటిసురైః సాకం బ్రహ్మా వైకుంఠమాగతః || “
“ పౌలస్త్యేన నిపీడితాః సురగణాః వైకుంఠ లోకం యయుః
ద్వారే తత్ర విషాదభావమనసా సూక్తైర్ హరిం తుష్టువుః |
శుక్లే శ్రీహరివాసరే ప్రభాతసమయే భానౌ ధనుః సంస్థితే
తేభ్యోఽదాత్ సుఖదర్శనం కరుణయా నారాయణో మాధవః ||
అనియు ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యము తెలుపబడినది. రావణుని బాధలు తాళలేక దేవతలు బ్రహ్మను ఆశ్రయించగా , అప్పుడా బ్రహ్మ దేవుడు ధనుర్మాస శుక్లైకాదశీ (హరివాసరమునందు) దివసమున దేవతలందరితో వైకుంఠమును చేరినాడు. అచ్చడ అట్టి శ్రీహరి నిలయమునందు దేవతలు విషాదభావ మనస్కులై వేదముల సూక్తములతో శ్రీహరిని స్తుతించగా అపుడా ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశీ దివసమున వారికి భగవంతుడు సుఖకరమైన దర్శనమును కలుగజేసినాడు. అని ఈ దివస ప్రశస్తి కనబడుతున్నది.
అదియును గాక ! ఈ దివస ప్రాశస్త్యమును తెలుపుతూ.. శ్రీప్రశ్న సంహిత ( 46 అధ్యా.) యందు కూడ ఒక ఐతిహ్యము కలదు అందు మధుకైటభులను భగవంతుడు సంహరించగా , ఆ సమయమునందు వారు దివ్య రూపధారులై దివ్యజ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడిరి. ఇంకనూ …
బ్రహ్మాదిశ్చాపి త్వల్లోక సదృశం రత్నమందిరం
కల్పయిత్వా త్వదర్చాయాం ఏకాదశ్యుత్సవం చరేత్ |
తదా పశ్యంతి యే త్వాంతు నమస్యంతి యే జనాః
ఉత్తరద్వారమార్గేణ ప్రవిశంతి చ యే హరేః ||” 45./38, 39
అని కోరిరి. అనగా బ్రహ్మాది దేవతలెవరైననూ నీలోకమువంటి మందిరమును నిర్మించి ఏకాదశి దివసోత్సవము గావించి, నిన్ను గాంచి నమస్కరించి ఉత్తర ద్వారమున నిన్ను సమీపింతురో అట్టి వారికి వైకుంఠప్రాప్తి కలుగునట్లు వరమిమ్మనమనిరి.
కృత్వోత్సవం తథాభూతం ఏకాదశ్యాం విశేషతః |
విశంతి మోక్షం తస్మాత్ సో మోక్షోత్సవ ఇతీర్యతే || 45/42
ఏకాదశి దివసాన ఉత్సవము జేసి , ఉత్తరద్వారము ద్వారా మోక్షము ( వైకుంఠము) లోనికి ప్రవేశింతురు గాన ఈ ఏకాదశి మోక్షోత్సవ ఏకాదశి గా చెప్పబడును అని శ్రీమహా విష్ణువు వారికి వరమిచ్చినట్లు శ్రీ సంహిత తెలుపుచున్నది.
ఇట్లు ముక్కోటి దేవతల బాధలను నివారించినందున “ ముక్కోటి ఏకాదశి ” గానూ, వైకుంఠ దర్శనము కలిగించునది కావున “‘ వైకుంఠ ఏకాదశి ” గాను భగవంతుని దర్శించుకొను పవిత్ర దివసము కావున “భగవదవలోకన దివసము” గానూ ఈ దివసము కొనియాడబడుచున్నది. సర్వశ్రేష్ఠమైన ఈ హరివాసరము నందు బుద్ధిశాలి వేదపారాయణాదులచేత శ్రీమన్నారాయణోత్సవము గావించవలెనని పేర్కొనబడినది.
ఈ ధనుర్మాస ఏకాడశి కొన్నిసార్లు మార్గశిర మాసమునందు, మరి కొన్నిసార్లు పుష్యమాసమునందు వచ్చును ఈ రెండు మాసముల శుక్లైకాదశులు ప్రశస్తమైనవే . మార్గశిర మాసమునందలి ఏకాదశి మోక్షదైకాదశి కాగా, పుష్యమాసమునందలి ఏకాదశి ‘పుత్రద’, గాను ‘ఫలద ’ గాను ప్రశంసించబడినది.
సుకేతనుడను రాజు విశ్వే దేవతల ఉపదేశానుసారాము ‘పుష్యమాసమునందలి ఏకాదశి వ్రతమునాచరించి భగవంతుని అనుగ్రహమున పుత్రుని బడసినట్లు పద్మపురాణము చెప్పుచున్నది. కావున ఈ దివసమున సకల దేవతారాధ్యుడైన శ్రీమన్నారాయణుని పాద పద్మముల నర్చన గావించినవానికి పుణ్యఫలమేమని చెప్పవచ్చును ! అందులకే భాగవతమున శుకమహర్షి ఆ స్వామి పాదారవిందము నశ్రయించిన భక్తునికి సంసార సాగరము ను దాటుట తేలికయై ఉపద్రవమునుండి తరించునని ఈ శ్లోకమునందు తెలిపిన విధానమును అవలోకించండి . :
సమాశ్రితా యే పదపల్లవ ప్లవం
మహత్పదం పుణ్యయశోమురారేః |
భవాంబుధిర్ వత్సపదం పరం పదం
పదం పదం యద్విపదాం న తేషామ్ ||
Sunday, July 21, 2013
AMMA (MOTHER)
అమ్మ
అమ్మంటే కమ్మని మాట - ఆకలి దప్పులను మరిపించు,
అమ్మంటే ఉన్నత శిఖరం - ఆమెను మించిన వారెవరు?
అమ్మంటే పరాదేవత _ ఆదిదేవుడైన తలవంచు.
అమ్మంటే చంద్రబింబం - కంటిపాపలు కలువలై విరియు.
అమ్మంటే కమ్మని మంత్రం - ఆర్తులకది ఉపశమనమిచ్చు
అమ్మంటే కల్పవల్లి -అడిగినవరముల తీర్చుచుండు.
అమ్మంటే కమ్మని గాయని - ఆదమరిచే జోల పాడు.
అమ్మంటే కమ్మని కావ్యం - మమతల కవితల కొలువుల నిలయం
Sunday, July 14, 2013
SAMSKRUTHA STREE KAVAYITRINA :
నా రేడియో ప్రసంగాలు.. brodcosted on 23-09-1988 on AIR HYD
సంస్కృత సాహిత్యము లో ప్రముఖ కవయిత్రులు.
కొరిడె విశ్వనాథ శర్మ,
ప్రిన్సిపాల్
శ్రీ ల.న.సం.ఆం. కళాశాల,
ధర్మపురి,
కరీంనగర్ జిల్లా (ఆం ప్ర)
మహోన్నతమైన ప్రాచీన భారతీయ సంస్కృతీ నాగరికతలకు దర్పణము వం టి ది వైదిక వాఙ్మయము. అది మొదలుకొని నేటి వరకును స్కృతవాఙ్మయమునందు గణనీయము గా సారస్వతసేవయొనరించిన మహిళామణులెందరో మనకు కానవచ్చుచున్నారు.
వైదిక వాఙ్మయముపరిశీలించిన ఆత్మజ్ఞాన సముత్తీర్ణులైన గార్గి, మైత్రేయి మున్న గు వారు జగత్ప్రసిద్ధులైయ్యిరి. విశ్వవార, అపాల, లోపాముద్ర మొదలుగాగల గృహిణులు మంత్రదర్శినులుగా పేరొందియున్నారు. తనభర్తయైన మండనమిశ్రునకు జగద్గురు ఆదిశంకరులకు ను జరిగిన వాదమునకు న్యాయాధి పురాలుగా నుండిన ఊభయభారతి మిక్కిలి ప్రసిద్ధురాలైయ్యెను.
శ్లో. గోధా ఘోషా విశ్వవారా పాలేషా మ్మాతృకర్షికా,
బ్రాహుర్నామా అగస్త్యస్య స్వసాదితిః,
లోపాముద్రా చ నద్యశ్చ యమీ నారీ చ శశ్వతీ
శ్రీర్లాక్షా సార్పరాజ్ఞీ వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా
రాత్రీ సూర్యా చ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః.
(అపాలోపనిషత్)
అని అపాలోపనిషత్తునందు మంత్రదర్శినులపేర్లు పేర్కొనబడినవి. దీని వలన ఆనాడు స్త్రీవి ద్య యే కాక వేద విద్య కూడ స్త్రీసమాజమున ఎట్లు వ్యాపించి యున్నదోతెలిసికొనవచ్చును.
ఇదేవిధముగ లౌకిక సాహిత్యమునందునూ ప్రశంసనీయములైన సేవలం దించిన కవయిత్రులు ఎందరో ! వారిలో ప్రముఖమైన కవయిత్రుల పరిచయము దిఙ్మాత్రముగ ఉద హరించుటే ఈవ్యాసము ఉద్దేశము.
శ్లో. శీలావిజ్జా మరులా మోరికాహ్వాః, కావ్యం కర్తుం సంతు విజ్ఞాః స్త్రియోఽపి.
విద్యాం వేత్తుం వాదనే నిర్విజేతుం, దాతుం విద్యాం యః ప్రవీణః స వంద్యః.
అని ధనదేవుడు తెలిపి యున్నాడు. అనగా శీల, విజ్జ మారల, మోరిక, యనువారలు కావ్య మును వ్రాయగలుగుదురేమోగాని, విద్యనభ్యసించుటకు,విద్యనభ్యసింపజేయుటకు, విద్వద్గోష్ఠి వాద నలో జయించుటకు కూడ ప్రవీణుడైన పురుషుడే సమర్థుడని అభిప్రాయపడినాడు. ఇయ్యది ఆతని అసూయను తెలిపినప్పటికినీ, ఆయా కవయిత్రుల విశయములను పరిశీలించినచో వారు శాస్త్రచర్చా దులలో పురుషులతో సమానులని తెలియుచున్నది.
విజ్జిక/విజయ.:-
శ్లో. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ,
యా వైదర్భీ గిరాంవాసః కాలిదాసాదనంతరమ్.
అని రాజాశేఖరుడిచే కాలిదాసుని తరువాత స్థానాన్నే పొందిన కవయిత్రి విజయాంక. ఈమె యే విజయ. విద్య,విజ్జిక అని కూడ ఈమె ప్రసిద్ధినొందినది. ధనదేవుని చే పేర్కొనబడిన విజ్జ కూడ ఈమెయే!
శ్లో. నీలోత్పలదలశ్యామాం విజ్జికాం మామజానతా,
వృథైవ దండినా ప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ,
’దండికి తన గురించి తెలియకనే శ్వేతవర్ణురాలిగా సరస్వతీదేవిని వర్ణించినాడు.’ అని ఈ కవయిత్రి తానే సరస్వతినని గర్వంగా ప్రకటించుకొన్నది. ఈమె కర్ణాటక దేశస్థురాలని, రెండవ పుల కేశి కుమారుడైన చంద్రాదిత్యుని భార్య యని క్రీ.శ.ఏడవశతాబ్దికి చెందినదని సాహిత్య విమర్శకుల అభిప్రాయము.
శ్లో. ఏకో భూన్నలినాత్ తతశ్చ పులినాద్వల్మీకతశ్చాపరః,
తే సర్వే కవయో భవంతి గురవ స్తేభ్యో నమస్కుర్మహే।,
అర్వాంచో యది గద్యపద్య రచనై శ్చేతశ్చమత్కుర్వతే
తేషాం మూర్ధ్నిదదామి వామచరణం కర్ణాటరాజప్రియా॥
అని విజ్జికశ్లోకము గా లభించు ఈశ్లోకమునందు కవయిత్రి "బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు మా త్రమే కవులు,గురువులు. అట్టివారికి మాత్రమే నమస్కరిస్తున్నాను. తదితరులు గద్యపద్యరచనా చ మత్కారమును వినోదముకొరకే కలుగ జేయువారు గాన అట్టివారి తలపైన కర్ణాట రాజప్రియయైన తా ను వామపాదమునుంచెదనని ప్ర కటించుకొన్నది.
కాని అజ్ఞాతకర్తృత్వకమై ’కౌముదీమహోత్సవము’ అను కావ్యమును ఈమెయే వ్రాసెనని
కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
సుభద్ర
శ్లో.పార్థస్య మనసి స్థానం లేభే ఖలు సుభద్రయా,
కవీనాం చ వచో వృత్తి చాతుర్యేణ సుభద్రయా.
పార్థుని మనస్సునందు అలనాటి సుభద్ర స్థానము నొందినట్ట్లు, కవయిత్రియగు సుభద్ర తన
వాగ్వృత్తిచాతుర్యముచేత కవులమనస్సునందు స్థానము నొందినదని రాజశేఖరునిచే కొనియాడబడిన కవయిత్రి ఈ సుభద్ర. కావ్యమాలలో నుదహరించబడిన ఈమె శ్లోకమొక్కదానిని గమనించండి.
శ్లో. దుగ్ధం చ యత్ తదను యత్కథితం తతో ను
మాధుర్యమస్య హృతమున్మథితం చ వేగాత్,
జాతం పునర్ఘృతకృతే నవనీతవృత్తి
స్నేహో నిబంధన మనర్థపరంపరాణామ్.
ఈశ్లోకమునందు పాలయొక్క దీనావస్థను తెలుపుతూ స్నేహవృత్తి అనర్థపరంపరలనే కలి
కించునని అన్యాపదేశమున తెలిపెను. పదవశతాబ్దీయుడైన రాజశేఖరునిచే ప్రసిద్ధ కవయిత్రిగా కొని యాడబ డిన ఈమె కాలము అంతకంటె పూర్వమని చెప్పవచ్చును . ప్రస్తుతము ఈమె గ్రంథములే వియును కానరాకున్నవి.
అవంతి సుందరి
రాజశేఖరుని ప్రశంసలందు కొన్న మరొక ముఖ్యమైన కవయిత్రి అవంతి సుందరి . ఈమె రాజ
శేఖరుని భార్య కావడము మరొక విశేషము .
శ్లో. చాహుణకులమౌలిమాలికా రాజశేఖర కవీంద్ర గేహినీ ,
భర్తుః కృతిమవంతి సుందరీ సాప్రయోజితు మేతదిచ్ఛతి.
అని తనకర్పూరమంజరిని ఆమె ప్రయోగింపనిచ్ఛగించుచున్నదని రాజశేఖరుడు తన నాటక మున తెలియజేసినాడు . ఇంకను ఆయన తన కావ్యమీమాంస యందు కొన్ని చర్చనీయాంశములం దు ఈమె అభిప్రాయములనుతెలిపియున్నాడు . తద్ద్వారా ఈమె యొక్క సునిశితపరిశీలనజ్ఞానము వ్యక్తమగుచున్నది .
గంగా దేవి
కవయిత్రులలో ఉత్తమమైన రచన గావించిన కవయిత్రి గంగాదేవి . క్రీ. శ. 14 వ శతాబ్ది కాల
మువాడై తనభర్త కంపరాయుని శౌర్యసాహసములను ‘వీరకంపరాయచరితమ్ ’ అను కావ్యముద్వా రా తెలియజేసినది. వీరరసస్ఫొరకమైన ఈ కావ్యమునకు “మధురావిజయం "నామాంతరముకూడ కలదు . మనోహరమైన, సరళమైన శైలిలోనున్న ఈ కావ్యము కాళిదాసకవిత్వమును స్ఫురింపజే యును . ఈమె శ్లోకమోకదానిని గమనించండి.
శ్లో. ఘనమాన దలారరీపుటం నలిన మందిరమిందిరాస్పదమ్,
పరిపాలయతిస్మ నిక్వణన్ పరితో యామికవన్ మధువ్రతః .
తిరుమలాంబ
క్రీ.శ. 16వ శతాబ్ద ఉత్తరార్ధమునకు సంబంధించిన అచ్యుతరాయలభార్యలలో నొకతె యైన తి
రుమలాంబ కూడ తన భర్తనే నాయకునిగా జేసికొని ‘వరదాంబికా చంపు’ అను చంపూకావ్యమును వ్రాసినది.
ఈ కావ్యమున అచ్యుతరాయలు వరదాంబతో వివాహము మొదలుకొని, వెంకటాద్రి యౌవరా జ్యపట్టాభిషేకమువరకు వర్ణించినది. శబ్దచమత్కారములతోనూ,అర్థప్రౌఢిమతోనూ కావ్యము రసవత్త రముగానూ కొనసాగుతూ ఈ కావ్యము పాఠకుల మనస్సును రంజిల్లజేయును.
రామభద్రాంబ
అధిక శ్రియమచ్యుతేంద్రసూనుం,
రఘునాథం రఘునాథమేవ సాక్షాత్ ,
హృదయే కలయన్తి యే మహాంతః ,
పరమానందభరాత్త ఏవ ధన్యాః .
అని 16 వ శతాబ్దమునకు సంబంధించిన తిర్యుమలాంబాకాలమునకు సంబంధించిన “రామ భద్రాంబ” కవయి త్రి కూడ తన భర్తయైన తంజావూరు ప్రభువైన రఘునాథనాయకుని నాయకునిగా జేసికొని ఆయన అనుజ్ఞతో చారిత్రికకావ్యశ్రేణిలో జేరు “రఘునాథాభ్యుదయ మహా కావ్యము”ను వ్రాసి నది. 900 శ్లోకములకుపైగా వ్రాయబడిన ఈ కావ్యము 12 సర్గలతో నిబద్ధమైనది. “అష్టభాషాకల్పిత చతుర్విధకవితాను ప్రణీత సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబా విరచితే... "అను గద్య మును బట్టి ఈమె పాండిత్యప్రకర్షత్వమును అర్థం చేసుకొన వచ్చు.
మధురవాణి
తంజావూరు ప్రభువైన రఘునాథనాయకు (1614-1633) ని చే వ్రాయబడిన రామాయణ మును ఆయన కొలువులోనున్న మధురవాణి అనే కవయిత్రి సంస్కృతీకరించినది. ప్రస్తుతము ఈ కావ్యము1500 శ్లోకములకుపైగా 14 సర్గలతో లభించుచున్నది. ఈమె రచన ఆమె పేరుకుతగినట్లు గా లలితమధురమైనట్టిది.
శీలభట్టారిక
ధనదేవునిచే పరిచయము గావించబడిన మరొక కవయిత్రి శీలబట్టారిక. ఈమె గురించి రాజ
శేఖరుడు -
శ్లో. శబ్దార్థయో సమో గుంఫః పాంచలీరీతిరుచ్యతే,
శీలాభట్టారికావాచి బాణోక్తిషు చ సర్పతి .
అని బాణునితో సమముగా ప్రశంసించినాడు. ఈమె రచన యైన ప్రసిద్ధమైన ఈ శ్లోకము రసజ్ఞులైన స హృదయులగు మీ స్మృతిపథమున విరాజిల్లుచునేయుండును. అట్టి ఈ శ్లోకమును గమనించితిరా?..
శ్లో. యః కౌమారహరః స ఏవ వరః తా ఏవ చైత్రక్షపాః ,
తే చోన్మీలితమాలతీసురభయః ప్రడాః కదంబానిలాః,
సా చైవాస్మి తథాఽపి తత్ర సుతవ్యాపారలీలావిధౌ,
రేవారోధసి వేతసీతరుతలే చేతః సముత్కంఠతే .
ఈశ్లోకమున నాయిక తన చెలికత్తెలతో తన వైవాహికజీవితమును వివరించుచూ, “ పూర్వమున తన మనోహరుడైన ప్రియుడినే పెండ్లియాడిననూ,రేవానదిలోని యిసుకతెన్నెలపై అట్టి ఆప్రియునితో గావించిన సురతవ్యాపారమే తన మనస్సునకూ ఇప్పటికినీ ఉత్కంఠమును కలిగించు చునేయున్నది.” అని తెలిపిన ఈ శ్లోకము ఎంత హృద్యముగానున్నదో సహృదయులెరుగనది కాదు.
దేవకుమారిక
క్రీ. శ. 17 వశతాబ్ది ఉత్తరార్ధ, 18 వశతాబ్ది పూర్వార్ధములకు సంబంధించిన ఉదయ్ పూర్
రాజవంశీయుడైన రాణా అమరసింహుని భార్య యైన దేవకుమారిక “బైద్యనాథప్రాసాదప్రశస్తిః ” అను కావ్యమును రచించినది. ఈ లఘుకావ్యమునందు రాణావంశీయులచరిత్రను పేర్కొన్నది. ముఖ్యము గా తనకుమారుడైన సంగ్రామసింహుని పట్టాభిషేకమును అద్భుతముగా వర్ణించినది. మచ్చునకు ఈమె శ్లోకమునొకదానిని పరిశీలించండి.
శ్లో. గుంజద్ భ్రమద్ భ్రమరరాజివిరాజితాస్యం,
స్తంబేరమాననమహం నితరాం నమామి ,
యత్పాదపంకజపరాగపవిత్రితానాం,
ప్రత్యూహరాశయ ఇహ ప్రశమం ప్రయాంతి .
వికటనితంబ
శ్లో. కే వైకటనితంబేన గిరాం గుంఫేన గుంఫితాః ,
నిందంతి నిజకాంతానాం న మౌగ్ధ్యమధురం వచః .
అని రాజశేఖరుడు తన సూక్తిముక్తావళియందు పేర్కొన్న మరొక కవయిత్రి వికటనితంబ. ‘వికటనితం బపదగుంభనములను గమనించినవారెవరు తమ భార్యలమృదుమధుర వాక్యములనైననూ నిందిం చకమానరు?’ అని ఈమెను ప్రశంసించియున్నాడు. ఈమె కాశ్మీరదేశస్థురాలు. ఈమెను గురించి భోజ మహారాజు కూడ తన శృంగారప్రకాశిక లో ప్రస్తావించినాడు. ఐనప్పటికినీ ఈమె కావ్యములేవియూ ప్ర స్తుతము లభ్యములుకాకున్నవి.
ఫల్గుహస్తినీ
ఏనమిదవ శతాబ్ది ఉత్తరార్ధమున ప్రసిద్ధినొందిన కవయిత్రి ఫల్గుహస్తిని. సుభాషితావళియందు ఈమె శ్లోకములు రెండు కానవచ్చుచున్నవి.
శ్లో. త్రినయనజటావల్లీపుష్పం నిశావదనస్మితం,
గ్రహకిసలయం సంధ్యానారీనితంబనఖక్షతమ్|
తిమిరభిదురం వ్యోమ్నః శృంగం మనోభవకార్ముకం
ప్రతిపదినవస్యేందోః బింబం సుఖోదయమస్తు నః ||
అను ఈ శ్లోకమునందు శుక్లపక్షప్రతిపదచంద్రునివర్ణన గావించబడినది. అలంకారశాస్త్రకర్తయైన వామ నుడు కూడ ఈమె ప్రస్తావనగావించినాడు.
త్రివేణి
క్రీ. శ. 19వ శతాబ్దికి చెందిన త్రివేణి యను కవయిత్రి దక్షీణభారతమునకు చెందినట్టిది. శ్రీవైష్ణ
వీయురాలగు నీమె దౌర్భాగ్యమువలన తనకు వైధవ్యము ప్రాప్తించగా, ఆధ్యాత్మికవ్యాసంగమొనరిం చుచూ,స్తోత్రములను, కావ్యములను రచించుటేకాక మేఘసందేశముననుసరించుచు రెండు కావ్య ములను, రెండు వేదాన్తనాటకములను కూడ రచించియుండెను.
బీనాబాయి
చాహువాక వంశీయుడు ఫాటలీపుత్రరాజైనహరిసింహుని భార్య బీనాభాయి. ఈ రచయిత్రి కా
లము 15వ శతాబ్దమని తెలియవచ్చుచున్నది. మిక్కిలి పవిత్ర క్షేత్రమైన ద్వారకానగరము గురించి ద్వారకా పట్టల యను గ్రంథమును సంకలనమొనరించెను. ఈమె గొప్ప ప్రతిభావంతురాలు.
ఈమె కాలమునకు సంబంధించినట్టిదే విశ్వాసదేవి. ఈమె గంగావాక్యావళీ యను గ్రంథము ను సంకలనమొనర్చెనని చెప్పుదురు.
ఇట్లు ప్రాచీన సంస్కృతసాహిత్యమునకు సేవజెసిన మహిళామణులెందరో! నాటికాలముననే
“ముదితల్ నేర్వగరానివిద్యగలదే ముద్దరనెర్పింపగన్"అని విద్యా, సాహిత్యరచనాపాటవమున మగధీ రులను కూడా తలదన్నువారమని చాటిచెప్పినట్టి మాతృమూర్తులకు వందనమర్పించుచూ..
1) Broadcasted from All India Radio Hydra bad.
2) Published by http://magazine.maalika.org in April 2013 Issue
నా రేడియో ప్రసంగాలు.. brodcosted on 23-09-1988 on AIR HYD
Subscribe to:
Posts (Atom)