Friday, April 27, 2012

unexpected person


        ఎవరవయ్య ! నీవు?
 
పిలవని పేరంటానికి చేరుకొన్న అతిథి !
ఎవరవయ్య ! నీవు? ఫ్రేములో చేరావు?
టక్కేసి, బూట్లేసి, నడుమున చెయ్యేసి,
గోడపై కూర్చుండి స్టైల్ గా ఫోజెట్టి
నా కెమరాకై నీవు ఎదిరిచూస్తున్నావా?
...
శరవేగాన వెళ్ళు కారులోన నేను
మైసూర్ నగరాన్ని గిరిపైన నుండి
తిలకించి,పులకించి,మరింత మైమరచి,
కెమరాలోన బంధించ క్లిక్ మనిపిస్తే,

అంతవేగములోన పరుగెత్తుకొచ్చావు
పెండ్లిచూపులకైనట్టు
ఫోజేట్టి దూరావు.
పిలచి పిల్లనిద్దామన్నా మోము తెలియదాయే
ఎవరవయ్య ! నీవు? ఫ్రేములో చేరావు?

Thursday, April 12, 2012

telugu chando padyaalu.

దత్తపది : అత్త, ఉత్త, రిత్త,చిత్త. రామాయణార్థమున

ఉ. అత్తరినీశ్వరున్ దలచి, ఆరఘురాముడు నెక్కు పెట్టెన
నత్య్త్తమశైవచాపము మహోత్తముడాతని హస్త రశ్మిచే
రిత్తమునయ్యే భారము నరేంద్రకుమారులు నొక్కమారుగా
చిత్తము దప్పి నెవ్వెరపు చెయ్యులతో నటుజూచి రంతయున్.
కొరిడె విశ్వనాథ శర్మ, ధర్మపురి
{సాహితీకౌముది . సాహిత్య్, సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. జులై 2011 లోముద్రితము}

Saturday, April 7, 2012

          పద్మ ప్రాశస్త్యం

ఉదయద్యౌవనముగ్ధమనోహరమై,
ఉద్యద్భానుప్రకాశకరకిరణ
సంయోగపులకితతన్వియై,
మాధుర్యగానగీతాసక్తమధుపములకు
మధుమాధుర్యమునందించుచు,
సుమసౌరభవీచికలతో
సుగంధమును దశదిశలావ్యాప్తినొందింపజేయుచూ,
నిజ యజమానకృత పూజలో
నిటలేక్షునికి అర్పించబడి,
 వరభక్తుల హృదయానందదాయక
ప్రసాదచిహ్నమై,శిరోరత్నమై నిలుచు
 ఓ కమలమా!
పామరునుండి పరమాత్మ వరకు
పరమానందమునందించు ఓ పద్మమా!
పంకజమైనా నీవు ప్రశస్తమైనదానవే !