Sunday, July 21, 2013

AMMA (MOTHER)

అమ్మ అమ్మంటే కమ్మని మాట - ఆకలి దప్పులను మరిపించు, అమ్మంటే ఉన్నత శిఖరం - ఆమెను మించిన వారెవరు? అమ్మంటే పరాదేవత _ ఆదిదేవుడైన తలవంచు. అమ్మంటే చంద్రబింబం - కంటిపాపలు కలువలై విరియు. అమ్మంటే కమ్మని మంత్రం - ఆర్తులకది ఉపశమనమిచ్చు అమ్మంటే కల్పవల్లి -అడిగినవరముల తీర్చుచుండు. అమ్మంటే కమ్మని గాయని - ఆదమరిచే జోల పాడు. అమ్మంటే కమ్మని కావ్యం - మమతల కవితల కొలువుల నిలయం

Sunday, July 14, 2013

SAMSKRUTHA STREE KAVAYITRINA :

నా రేడియో ప్రసంగాలు.. brodcosted on 23-09-1988 on AIR HYD సంస్కృత సాహిత్యము లో ప్రముఖ కవయిత్రులు. కొరిడె విశ్వనాథ శర్మ, ప్రిన్సిపాల్ శ్రీ ల.న.సం.ఆం. కళాశాల, ధర్మపురి, కరీంనగర్ జిల్లా (ఆం ప్ర) మహోన్నతమైన ప్రాచీన భారతీయ సంస్కృతీ నాగరికతలకు దర్పణము వం టి ది వైదిక వాఙ్మయము. అది మొదలుకొని నేటి వరకును స్కృతవాఙ్మయమునందు గణనీయము గా సారస్వతసేవయొనరించిన మహిళామణులెందరో మనకు కానవచ్చుచున్నారు. వైదిక వాఙ్మయముపరిశీలించిన ఆత్మజ్ఞాన సముత్తీర్ణులైన గార్గి, మైత్రేయి మున్న గు వారు జగత్ప్రసిద్ధులైయ్యిరి. విశ్వవార, అపాల, లోపాముద్ర మొదలుగాగల గృహిణులు మంత్రదర్శినులుగా పేరొందియున్నారు. తనభర్తయైన మండనమిశ్రునకు జగద్గురు ఆదిశంకరులకు ను జరిగిన వాదమునకు న్యాయాధి పురాలుగా నుండిన ఊభయభారతి మిక్కిలి ప్రసిద్ధురాలైయ్యెను. శ్లో. గోధా ఘోషా విశ్వవారా పాలేషా మ్మాతృకర్షికా, బ్రాహుర్నామా అగస్త్యస్య స్వసాదితిః, లోపాముద్రా చ నద్యశ్చ యమీ నారీ చ శశ్వతీ శ్రీర్లాక్షా సార్పరాజ్ఞీ వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా రాత్రీ సూర్యా చ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః. (అపాలోపనిషత్) అని అపాలోపనిషత్తునందు మంత్రదర్శినులపేర్లు పేర్కొనబడినవి. దీని వలన ఆనాడు స్త్రీవి ద్య యే కాక వేద విద్య కూడ స్త్రీసమాజమున ఎట్లు వ్యాపించి యున్నదోతెలిసికొనవచ్చును. ఇదేవిధముగ లౌకిక సాహిత్యమునందునూ ప్రశంసనీయములైన సేవలం దించిన కవయిత్రులు ఎందరో ! వారిలో ప్రముఖమైన కవయిత్రుల పరిచయము దిఙ్మాత్రముగ ఉద హరించుటే ఈవ్యాసము ఉద్దేశము. శ్లో. శీలావిజ్జా మరులా మోరికాహ్వాః, కావ్యం కర్తుం సంతు విజ్ఞాః స్త్రియోఽపి. విద్యాం వేత్తుం వాదనే నిర్విజేతుం, దాతుం విద్యాం యః ప్రవీణః స వంద్యః. అని ధనదేవుడు తెలిపి యున్నాడు. అనగా శీల, విజ్జ మారల, మోరిక, యనువారలు కావ్య మును వ్రాయగలుగుదురేమోగాని, విద్యనభ్యసించుటకు,విద్యనభ్యసింపజేయుటకు, విద్వద్గోష్ఠి వాద నలో జయించుటకు కూడ ప్రవీణుడైన పురుషుడే సమర్థుడని అభిప్రాయపడినాడు. ఇయ్యది ఆతని అసూయను తెలిపినప్పటికినీ, ఆయా కవయిత్రుల విశయములను పరిశీలించినచో వారు శాస్త్రచర్చా దులలో పురుషులతో సమానులని తెలియుచున్నది. విజ్జిక/విజయ.:- శ్లో. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ, యా వైదర్భీ గిరాంవాసః కాలిదాసాదనంతరమ్. అని రాజాశేఖరుడిచే కాలిదాసుని తరువాత స్థానాన్నే పొందిన కవయిత్రి విజయాంక. ఈమె యే విజయ. విద్య,విజ్జిక అని కూడ ఈమె ప్రసిద్ధినొందినది. ధనదేవుని చే పేర్కొనబడిన విజ్జ కూడ ఈమెయే! శ్లో. నీలోత్పలదలశ్యామాం విజ్జికాం మామజానతా, వృథైవ దండినా ప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ, ’దండికి తన గురించి తెలియకనే శ్వేతవర్ణురాలిగా సరస్వతీదేవిని వర్ణించినాడు.’ అని ఈ కవయిత్రి తానే సరస్వతినని గర్వంగా ప్రకటించుకొన్నది. ఈమె కర్ణాటక దేశస్థురాలని, రెండవ పుల కేశి కుమారుడైన చంద్రాదిత్యుని భార్య యని క్రీ.శ.ఏడవశతాబ్దికి చెందినదని సాహిత్య విమర్శకుల అభిప్రాయము. శ్లో. ఏకో భూన్నలినాత్ తతశ్చ పులినాద్వల్మీకతశ్చాపరః, తే సర్వే కవయో భవంతి గురవ స్తేభ్యో నమస్కుర్మహే।, అర్వాంచో యది గద్యపద్య రచనై శ్చేతశ్చమత్కుర్వతే తేషాం మూర్ధ్నిదదామి వామచరణం కర్ణాటరాజప్రియా॥ అని విజ్జికశ్లోకము గా లభించు ఈశ్లోకమునందు కవయిత్రి "బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు మా త్రమే కవులు,గురువులు. అట్టివారికి మాత్రమే నమస్కరిస్తున్నాను. తదితరులు గద్యపద్యరచనా చ మత్కారమును వినోదముకొరకే కలుగ జేయువారు గాన అట్టివారి తలపైన కర్ణాట రాజప్రియయైన తా ను వామపాదమునుంచెదనని ప్ర కటించుకొన్నది. కాని అజ్ఞాతకర్తృత్వకమై ’కౌముదీమహోత్సవము’ అను కావ్యమును ఈమెయే వ్రాసెనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సుభద్ర శ్లో.పార్థస్య మనసి స్థానం లేభే ఖలు సుభద్రయా, కవీనాం చ వచో వృత్తి చాతుర్యేణ సుభద్రయా. పార్థుని మనస్సునందు అలనాటి సుభద్ర స్థానము నొందినట్ట్లు, కవయిత్రియగు సుభద్ర తన వాగ్వృత్తిచాతుర్యముచేత కవులమనస్సునందు స్థానము నొందినదని రాజశేఖరునిచే కొనియాడబడిన కవయిత్రి ఈ సుభద్ర. కావ్యమాలలో నుదహరించబడిన ఈమె శ్లోకమొక్కదానిని గమనించండి. శ్లో. దుగ్ధం చ యత్ తదను యత్కథితం తతో ను మాధుర్యమస్య హృతమున్మథితం చ వేగాత్, జాతం పునర్ఘృతకృతే నవనీతవృత్తి స్నేహో నిబంధన మనర్థపరంపరాణామ్. ఈశ్లోకమునందు పాలయొక్క దీనావస్థను తెలుపుతూ స్నేహవృత్తి అనర్థపరంపరలనే కలి కించునని అన్యాపదేశమున తెలిపెను. పదవశతాబ్దీయుడైన రాజశేఖరునిచే ప్రసిద్ధ కవయిత్రిగా కొని యాడబ డిన ఈమె కాలము అంతకంటె పూర్వమని చెప్పవచ్చును . ప్రస్తుతము ఈమె గ్రంథములే వియును కానరాకున్నవి. అవంతి సుందరి రాజశేఖరుని ప్రశంసలందు కొన్న మరొక ముఖ్యమైన కవయిత్రి అవంతి సుందరి . ఈమె రాజ శేఖరుని భార్య కావడము మరొక విశేషము . శ్లో. చాహుణకులమౌలిమాలికా రాజశేఖర కవీంద్ర గేహినీ , భర్తుః కృతిమవంతి సుందరీ సాప్రయోజితు మేతదిచ్ఛతి. అని తనకర్పూరమంజరిని ఆమె ప్రయోగింపనిచ్ఛగించుచున్నదని రాజశేఖరుడు తన నాటక మున తెలియజేసినాడు . ఇంకను ఆయన తన కావ్యమీమాంస యందు కొన్ని చర్చనీయాంశములం దు ఈమె అభిప్రాయములనుతెలిపియున్నాడు . తద్ద్వారా ఈమె యొక్క సునిశితపరిశీలనజ్ఞానము వ్యక్తమగుచున్నది . గంగా దేవి కవయిత్రులలో ఉత్తమమైన రచన గావించిన కవయిత్రి గంగాదేవి . క్రీ. శ. 14 వ శతాబ్ది కాల మువాడై తనభర్త కంపరాయుని శౌర్యసాహసములను ‘వీరకంపరాయచరితమ్ ’ అను కావ్యముద్వా రా తెలియజేసినది. వీరరసస్ఫొరకమైన ఈ కావ్యమునకు “మధురావిజయం "నామాంతరముకూడ కలదు . మనోహరమైన, సరళమైన శైలిలోనున్న ఈ కావ్యము కాళిదాసకవిత్వమును స్ఫురింపజే యును . ఈమె శ్లోకమోకదానిని గమనించండి. శ్లో. ఘనమాన దలారరీపుటం నలిన మందిరమిందిరాస్పదమ్, పరిపాలయతిస్మ నిక్వణన్ పరితో యామికవన్ మధువ్రతః . తిరుమలాంబ క్రీ.శ. 16వ శతాబ్ద ఉత్తరార్ధమునకు సంబంధించిన అచ్యుతరాయలభార్యలలో నొకతె యైన తి రుమలాంబ కూడ తన భర్తనే నాయకునిగా జేసికొని ‘వరదాంబికా చంపు’ అను చంపూకావ్యమును వ్రాసినది. ఈ కావ్యమున అచ్యుతరాయలు వరదాంబతో వివాహము మొదలుకొని, వెంకటాద్రి యౌవరా జ్యపట్టాభిషేకమువరకు వర్ణించినది. శబ్దచమత్కారములతోనూ,అర్థప్రౌఢిమతోనూ కావ్యము రసవత్త రముగానూ కొనసాగుతూ ఈ కావ్యము పాఠకుల మనస్సును రంజిల్లజేయును. రామభద్రాంబ అధిక శ్రియమచ్యుతేంద్రసూనుం, రఘునాథం రఘునాథమేవ సాక్షాత్ , హృదయే కలయన్తి యే మహాంతః , పరమానందభరాత్త ఏవ ధన్యాః . అని 16 వ శతాబ్దమునకు సంబంధించిన తిర్యుమలాంబాకాలమునకు సంబంధించిన “రామ భద్రాంబ” కవయి త్రి కూడ తన భర్తయైన తంజావూరు ప్రభువైన రఘునాథనాయకుని నాయకునిగా జేసికొని ఆయన అనుజ్ఞతో చారిత్రికకావ్యశ్రేణిలో జేరు “రఘునాథాభ్యుదయ మహా కావ్యము”ను వ్రాసి నది. 900 శ్లోకములకుపైగా వ్రాయబడిన ఈ కావ్యము 12 సర్గలతో నిబద్ధమైనది. “అష్టభాషాకల్పిత చతుర్విధకవితాను ప్రణీత సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబా విరచితే... "అను గద్య మును బట్టి ఈమె పాండిత్యప్రకర్షత్వమును అర్థం చేసుకొన వచ్చు. మధురవాణి తంజావూరు ప్రభువైన రఘునాథనాయకు (1614-1633) ని చే వ్రాయబడిన రామాయణ మును ఆయన కొలువులోనున్న మధురవాణి అనే కవయిత్రి సంస్కృతీకరించినది. ప్రస్తుతము ఈ కావ్యము1500 శ్లోకములకుపైగా 14 సర్గలతో లభించుచున్నది. ఈమె రచన ఆమె పేరుకుతగినట్లు గా లలితమధురమైనట్టిది. శీలభట్టారిక ధనదేవునిచే పరిచయము గావించబడిన మరొక కవయిత్రి శీలబట్టారిక. ఈమె గురించి రాజ శేఖరుడు - శ్లో. శబ్దార్థయో సమో గుంఫః పాంచలీరీతిరుచ్యతే, శీలాభట్టారికావాచి బాణోక్తిషు చ సర్పతి . అని బాణునితో సమముగా ప్రశంసించినాడు. ఈమె రచన యైన ప్రసిద్ధమైన ఈ శ్లోకము రసజ్ఞులైన స హృదయులగు మీ స్మృతిపథమున విరాజిల్లుచునేయుండును. అట్టి ఈ శ్లోకమును గమనించితిరా?.. శ్లో. యః కౌమారహరః స ఏవ వరః తా ఏవ చైత్రక్షపాః , తే చోన్మీలితమాలతీసురభయః ప్రడాః కదంబానిలాః, సా చైవాస్మి తథాఽపి తత్ర సుతవ్యాపారలీలావిధౌ, రేవారోధసి వేతసీతరుతలే చేతః సముత్కంఠతే . ఈశ్లోకమున నాయిక తన చెలికత్తెలతో తన వైవాహికజీవితమును వివరించుచూ, “ పూర్వమున తన మనోహరుడైన ప్రియుడినే పెండ్లియాడిననూ,రేవానదిలోని యిసుకతెన్నెలపై అట్టి ఆప్రియునితో గావించిన సురతవ్యాపారమే తన మనస్సునకూ ఇప్పటికినీ ఉత్కంఠమును కలిగించు చునేయున్నది.” అని తెలిపిన ఈ శ్లోకము ఎంత హృద్యముగానున్నదో సహృదయులెరుగనది కాదు. దేవకుమారిక క్రీ. శ. 17 వశతాబ్ది ఉత్తరార్ధ, 18 వశతాబ్ది పూర్వార్ధములకు సంబంధించిన ఉదయ్ పూర్ రాజవంశీయుడైన రాణా అమరసింహుని భార్య యైన దేవకుమారిక “బైద్యనాథప్రాసాదప్రశస్తిః ” అను కావ్యమును రచించినది. ఈ లఘుకావ్యమునందు రాణావంశీయులచరిత్రను పేర్కొన్నది. ముఖ్యము గా తనకుమారుడైన సంగ్రామసింహుని పట్టాభిషేకమును అద్భుతముగా వర్ణించినది. మచ్చునకు ఈమె శ్లోకమునొకదానిని పరిశీలించండి. శ్లో. గుంజద్ భ్రమద్ భ్రమరరాజివిరాజితాస్యం, స్తంబేరమాననమహం నితరాం నమామి , యత్పాదపంకజపరాగపవిత్రితానాం, ప్రత్యూహరాశయ ఇహ ప్రశమం ప్రయాంతి . వికటనితంబ శ్లో. కే వైకటనితంబేన గిరాం గుంఫేన గుంఫితాః , నిందంతి నిజకాంతానాం న మౌగ్ధ్యమధురం వచః . అని రాజశేఖరుడు తన సూక్తిముక్తావళియందు పేర్కొన్న మరొక కవయిత్రి వికటనితంబ. ‘వికటనితం బపదగుంభనములను గమనించినవారెవరు తమ భార్యలమృదుమధుర వాక్యములనైననూ నిందిం చకమానరు?’ అని ఈమెను ప్రశంసించియున్నాడు. ఈమె కాశ్మీరదేశస్థురాలు. ఈమెను గురించి భోజ మహారాజు కూడ తన శృంగారప్రకాశిక లో ప్రస్తావించినాడు. ఐనప్పటికినీ ఈమె కావ్యములేవియూ ప్ర స్తుతము లభ్యములుకాకున్నవి. ఫల్గుహస్తినీ ఏనమిదవ శతాబ్ది ఉత్తరార్ధమున ప్రసిద్ధినొందిన కవయిత్రి ఫల్గుహస్తిని. సుభాషితావళియందు ఈమె శ్లోకములు రెండు కానవచ్చుచున్నవి. శ్లో. త్రినయనజటావల్లీపుష్పం నిశావదనస్మితం, గ్రహకిసలయం సంధ్యానారీనితంబనఖక్షతమ్| తిమిరభిదురం వ్యోమ్నః శృంగం మనోభవకార్ముకం ప్రతిపదినవస్యేందోః బింబం సుఖోదయమస్తు నః || అను ఈ శ్లోకమునందు శుక్లపక్షప్రతిపదచంద్రునివర్ణన గావించబడినది. అలంకారశాస్త్రకర్తయైన వామ నుడు కూడ ఈమె ప్రస్తావనగావించినాడు. త్రివేణి క్రీ. శ. 19వ శతాబ్దికి చెందిన త్రివేణి యను కవయిత్రి దక్షీణభారతమునకు చెందినట్టిది. శ్రీవైష్ణ వీయురాలగు నీమె దౌర్భాగ్యమువలన తనకు వైధవ్యము ప్రాప్తించగా, ఆధ్యాత్మికవ్యాసంగమొనరిం చుచూ,స్తోత్రములను, కావ్యములను రచించుటేకాక మేఘసందేశముననుసరించుచు రెండు కావ్య ములను, రెండు వేదాన్తనాటకములను కూడ రచించియుండెను. బీనాబాయి చాహువాక వంశీయుడు ఫాటలీపుత్రరాజైనహరిసింహుని భార్య బీనాభాయి. ఈ రచయిత్రి కా లము 15వ శతాబ్దమని తెలియవచ్చుచున్నది. మిక్కిలి పవిత్ర క్షేత్రమైన ద్వారకానగరము గురించి ద్వారకా పట్టల యను గ్రంథమును సంకలనమొనరించెను. ఈమె గొప్ప ప్రతిభావంతురాలు. ఈమె కాలమునకు సంబంధించినట్టిదే విశ్వాసదేవి. ఈమె గంగావాక్యావళీ యను గ్రంథము ను సంకలనమొనర్చెనని చెప్పుదురు. ఇట్లు ప్రాచీన సంస్కృతసాహిత్యమునకు సేవజెసిన మహిళామణులెందరో! నాటికాలముననే “ముదితల్ నేర్వగరానివిద్యగలదే ముద్దరనెర్పింపగన్"అని విద్యా, సాహిత్యరచనాపాటవమున మగధీ రులను కూడా తలదన్నువారమని చాటిచెప్పినట్టి మాతృమూర్తులకు వందనమర్పించుచూ.. 1) Broadcasted from All India Radio Hydra bad. 2) Published by http://magazine.maalika.org in April 2013 Issue నా రేడియో ప్రసంగాలు.. brodcosted on 23-09-1988 on AIR HYD

Monday, April 15, 2013

31వ డిసెంబర్2012 రోజున సాయంత్రము మాధర్మపురికి శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామిగారు వచ్చినాఅరు. వారికి ఆమరునాడు(1వ జనవరి రోజున నేను అర్పించిన పద్యకుసుమపంచకమ్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~‘
ఓం గం గణపతయే నమః శ్రీశోమేశాభ్యాం నమః శ్రీమాత్రే నమః
శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య,పదవాక్యప్రమాణపారావారపారీణయమనియమాద్యష్ఠాఙ్గయోగానుష్ఠాననిష్ఠ ,తపోనిష్ఠావరిష్ఠ , షడ్దర్శనస్థాపనాచార్య , వ్యాఖ్యానసింహాసనాధీశ్వర,వైదికమార్గప్రవర్తక ,సర్వతంత్ర స్వతంత్ర, శ్రీమదాదిశంకరాచార్య
పరంపరాప్రాప్త , ఋష్యశృంగ పురవరాధీశ్వరతుఙ్గభద్రతీరవాసీ శ్రీ శ్రీ శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామిగురుకరకమలసంభవ శ్రీజగద్గురుశృఙ్గేరీ దక్షిణామ్నాయ శారదాపీఠాధిప తత్ర భగవత్
      శ్రీశ్రీశ్రీమద్ భారతీ తీర్థమహాస్వామి చరణారవిందేభ్యః సమాదర భక్తిపూర్వకం
సప్రశ్రయం సమాహ్వానపూర్వకం సమర్ప్యతే పద్యకుసుమపంచకం యద్ -

శ్లో. సకలనిగమశాస్త్రావాస! పుంభావవాణే! ,
ప్రణతనిజముఖస్త్వ ద్దర్శనాసక్తచిత్తః |
వదతి సహృదయం సుస్వాగతం ధర్మపుర్యాం ,
పురజనసముదాయో భారతీతీర్థ యోగిన్ ! ||1||

శ్లో.పరిగతవరపాత్రః శారదాంబాదయాయాః ,
కిమయమపరరూపః శంకరో బ్రహ్మతేజాః |
కలికలుషనివారః పామరాణాం జనానాం ,
ప్రచురిత ఋషి(1) విద్యారణ్యమూర్తిర్ భవాన్ కిం || 2 ||

శ్లో. విధువదన! భవంతం తంగిరాలాబ్ధి వంశః ,
నిజసుతముపగమ్యోత్తుంగవీచీయశస్కః |
సకలజనహితాయ ప్రాపయత్ ఋష్యశృంగం ,
సుతమివ వసుదేవో బంధనాత్ నందగేహమ్ || 3 ||

శ్లో.గతవరగురుపాదోఽధీతవేదాంబురాశిర్ ,
బుధనుత ! కటిబద్ధో ధర్మరక్షాయ విద్వన్
ప్రణిహిత వరదీక్షో వేదరక్షాక్రియాయై,
తిమిరమివ రవేస్ త్వన్నో గతం మోహజాలమ్ || 4 ||

శ్లో.పరిగతపరమార్థం ధర్మరక్షాకరం త్వాం,
వికసితనిగమాంతం ఖండితధ్వాన్తమాయమ్ |
అభయదకరపద్మం భారతీతీర్థ యోగిన్ ! ,
నిహితచరణపద్మం ధర్మపుర్యాం నతాః స్మః || 5 ||

స్వస్తి శ్రీ నందన మార్గ. కృ. ౩

                                      తత్రభగవత్స్వామినః సందర్శనాశీర్వచనాద్యభిలాషిణః,
తే. 31. 12. 2012                   శ్రీ లక్ష్మీనృసింహదేవార్చకాదిమందిరబృందమ్ ,
                                                 బ్రాహ్మణసంఘసేవాభవనవేదికా ,

                                                ధర్మపురీస్థానిక బ్రాహ్మణపౌరసంఘః ,
                                                          ధర్మపురీ
                                                 ఆర్యవైశ్యాదిసేవాసంఘాశ్చ ,
~ పద్యరచనా : కోరిడే విశ్వనాథ శర్మా (శృంగేరీఫీఠాస్థానవిద్వద్ డా. కోరిడే రాజన్నశాస్త్రిపుత్రః) సంస్కృతోపన్యాసకః ,
1)ఋషిర్వేదే వశిష్ఠాదౌ..’ మేదినీ | ఋత్యకః ఇతి విసంధిః |See More
— with DrBachampalli Santhosh Kumara Sastry and Jagadguru Sri Bharati Tirtha Mahaswamigal.
అయికరికర్ణిక ! మూషికవాహన!! పర్వతజాసుత ! సాంబప్రియ !
నుతజనపోషక ! షణ్ముఖసేవిత ! శంకరచుంబితఫాలతట!|
వరచతురాననదేవగణార్చిత ! దానవభంజక ! దాసరత!
జయ గణనాయక ! విఘ్నవినాశక ! ధర్మపురీజనపాల విభో!

NAMO MAHASE OF Dr. K.Rajanna Shastry


                                   నమో మహసేమా నాన్నగారు{Dr.K.Rajanna Shastry} నేటికి 40 సంవత్సారలకు పూర్వం {4.4.1973} తన 40 సంవత్సరాల వయస్సులో ‘సుమనోంజలిః’ అనే తన చిన్ననాటనుండి ఆయా సందర్భాలలో వ్రాసిన సంస్కృతకవితలపుస్తకమును విడుదల చేసినారు. దానిలోనుండి హరిహరత్మకతత్వమును తెలిపే ఈ పద్యకుసుమాష్టకమును భావముతో మీకు అందిస్తున్నాను.

కాలాయ వర్ష్మణ్యథ కన్ధరాయాం,
పాదేఽథ మూర్ధ్న్యభ్రనదీవతే చ |
 శయ్యావతే నాగవరేణ భూషా-
వతే నమో మే మహసేఽపి కస్మై ||1||


భా. శరీరమందే కాని, కంఠమందే కాని నలుపువర్ణముగలవాడునూ, పాదమందే కాని. మూర్ధభాగమందు కాని ఆకాశగంగను కలిగినవాడునూ, నాగవరుని శయ్యగా కలిగినవాడు కాని భూషణముగ కలిగినవాడే కాని ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

పిత్రేఽథ హన్త్రేఽసమసాయకస్య,
భర్త్రేఽథ హన్త్రేఽఖిలభూతసృష్టేః |
 ధార్యాయ ధర్త్రే ద్విజనాయకస్య,
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||2||

భా. అసమసాయకుడగు మన్మథుని జన్మదాతయో హంతయో, అఖిలభూతసృష్టికి భర్తయో, హర్తయో, ద్విజనాయకుని {గరుత్మంతుని/చంద్ర్ర్రుని} చే ధరించబడినవాడో, ధరించినవాడో అట్టివాడు ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

పాత్రే గజస్యాథ విఘాతుకాయ
ద్విషేఽసురాణామధిదైవతాయ |
 పూర్ణస్త్రియై వాఽర్ధతనుస్త్రియాయై
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||3||

భా. గజమునకు భక్తి పాత్రుడో, సంహారకారకుడో. రాక్షసులకు శత్రువో, అధిదైవతమో. సంపూర్ణస్త్రీ శరీరాకృతికలవాడో. అర్ధస్త్రీ శరీరముకలవాడో,ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

వినాయకేనాథ సువాహవత్తా
సుపుత్రవత్తాఽథ విభాతి యస్య|
పదం ను వాసోఽథ విహాసశ్చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||4||


భా. వినాయకుని{ గరుత్మంతుని ) చేత ఎవరి మంచివాహనము కలిగియుండు ధర్మము, వినాయకుని {గణపతి} చేత ఎవరి మంచిపుత్రునిగలిగి యుండు ధర్మము, ప్రకాశించుచున్నదో. ఎవరి నివాసస్థానము, ఆకాశమో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా
నమస్కారము.

యస్యాత్మభూభూయమథాత్మభూస్తు
కుమార ఏవైతి కుమారభూయమ్|
చక్షుర్హి చక్షుర్భువనస్య యస్య
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||5||


భా. ఆత్మభువుడు (బ్రహ్మ దేవుడు) ఎవరికైతే ఆత్మభువుడు(పుత్రుడు)గానూ కుమారుడు(కుమారస్వామి) ఎవరికైతే కుమారుడుగా (పుత్రుడు)గా అయ్యెనో భువనమునకే నేత్రమైనవాడు ( సూర్యుడు) ఏవనికి నేత్రమైయ్యెనో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.
సురర్షికార్యాయ వనేచరత్వ-
ముపేయుషే భూధరరాజభర్త్రే |
గవోల్లసత్పావనమూర్తయే చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||6||

భా. దేవ,ఋషుల కార్యములకై వనేచరత్వమును [ (1)వనే = నీటియందు, చరత్వం =సంచరించునట్టి మత్స్యావతారమును , (2) వనచరుడు = కిరాతావతారమును ] పొందినట్టివాడునూ, భూధర రాజభర్త యైనవాడునూ [ (1) భూధరరాజును = మంథరపర్వతమును మోసినట్టివాడునూ, (2) భూధరరాజునకు = కైలాసపర్వతమునకు అధిపతియైన వాడునూ,] గవోల్లసత్పావనమూర్తియైనవాడునూ [ (1)గోవుచేత = భూమిచేత ప్రకాశించే పవిత్రమూర్తి కలవాడునూ (2) గోవుయందు = వృషభముయందు ప్రకాశించే పవిత్రమూర్తి కలవాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

పంచాస్యతాభూషితపూర్వభిన్న-
వపుష్మతే చ చ్ఛలభిక్షుకాయ |
పరశ్వథోద్భాసితపాణయే చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||7||

భా. పంచాస్యత్వముచేత [=(1) సింహముఖము కలిగి యుండుటచేత (2) ఐదుముఖములు కలిగి యుండుటచేత ] అలంకరించబడిన పూర్వశరీరముకలిగిన భిన్నమైన ఆకృతికలవాడునూ, కపటమైన భిక్షువు (వామనునిగానూ, కపటబ్రహ్మచారిగానూ) ఐనట్టివాడునూ, పరశువు చేత మిక్కిలిప్రకాశించునట్టి పాణికలవాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

టి. పరశుశ్చ పరశ్వథః ” అమరమ్
 

పత్యే చ గోత్రాత్మభువోఽచ్ఛదేహ
త్విషే మహానాగమదాపహర్త్రే |
 దుర్దాన్తగోనాథమదాపహర్త్రే
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||8||

భా. గోత్రాత్మభువునకు [ (1) గోత్రా =భూదేవికి ఆత్మభువురాలు =పుత్రికసీతాదేవికి (2) గోత్ర = పర్వతమగు హిమవంతునికి ఆత్మభువురాలు = పుత్రికయగు పార్వతీదేవికి ] భర్తయైనట్టివాడునూ, స్వచ్ఛమైనదేహకాంతి కలవాడునూ, మహానాగ = కాళీయమను సర్పము యొక్క లేదా మహానాగ = గజాసురునియొక్క మదమును హరించినట్టివాడునూ, మిక్కిలి మదగర్వితులైన గోనాథ = (కల్కి అవతారమున)రాజులయొక్క లేదా దేవతలగు పంచమహేంద్రులయొక్కయు గర్వమణిచినట్టివాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

టి. గోత్రా కుః పృథివీ పృథ్వీ " అమరము. శివుడు పంచమహేంద్రుల గర్వమణిచినట్టి విషయము ఆంధ్రమాహాభారతమున ఆది పర్వ సప్తమాశ్వాసమున ద్రపదీదేవీస్వయంవరప్రస్తావమున పంచేంద్రోపాఖ్యానమున చూడవచ్చు.
ఈ కవిత ఇట్లు ఎనమిది శ్లోకములతో ముగిసినది. ఆదరించిన పెద్దలకు కృతజ్ఞతలు.

Tuesday, April 9, 2013

Avadhanam : dattha padi


తేది : 31.3.13 రోజున సాయంత్రము అంతర్జాలము (Inter net) నందు బ్ర. శ్రీ.మాడ్గుల అనిలకుమార్ గారి చే శ్రీ శాకంబరీ అంతర్జాల అవధానము జరిగినది. ఈ అవధానము సా. 6 గంటలమొదలుకొని రా.11 ల వరకు కొనసాగినది. శ్రీ చింతా రామకృష్ణ రావు గారు అధ్యక్షులు గా నిర్వహించిన ఈ కార్యక్రమమును http://magazine.maalika.org/ అంతర్జాల పత్రికా నిర్వహకురాలు శ్రీమతి వలబోజు జ్యొతి గారు పర్యవేక్షించడమే కాక తమ అంతర్జాల పత్రికలో ప్రత్యక్ష ప్రసారము కూడ కావించినారు. ఇట్టి కార్యక్రమము అంతర్జాల మైనందున అవధానులు అధ్యక్షులు నిర్వాహకులు పృచ్ఛకులు తమతమ నివాసాదులలోనే ఉంటూ కార్యక్రమమును దిగ్విజయమునునొనరింపజేసినారు.
ఈ కార్యక్రమమున సమస్యలు రెండు, దత్తపదులు రెండు, నిషిద్ధాక్షరిలు రెండు, వర్ణన, అప్రస్తుత ప్రశంసలు ఒక్కొక్కటి. రెండవ దత్తపదిపృచ్ఛకునిగా నేను పాల్గొన్నాను. నా దత్తపది ప్రశ్న ఇట్లున్నది :
వృత్తం : చంపకమాల నజభజజజర , 11 యతి.
దత్తపది : పదములు: టమాట. దోస(కాయ) బీర (కాయ), ఆలు.
విషయము : రామాయణమున యుద్ధకాలవర్ణన :
అవధాని మాడ్గుల అనిలకుమార్ గారి పూరణ :

అతడటమాట మాటకునుయంజలి బట్టక నాయుధంబులన్
ప్రతిగనొసంగెబీరముల పద్ధతి కాదని రామచంద్రుడై
కుతకుత దోసపూర్ణుడగు కుత్సితుడా దశకంఠుడంతటన్
వెతలతొనాలుబిడ్డలనువీడి చనెన్ యమలోక మంతటన్ ll
నా పూరణ :

చం. కదనము నీటమాట సరికాదు దశాస్యునితో, కపీంద్రులా
ర! దితిజు( వంటి దోసముల రాజును ముట్టడి సేసి, నంతమొం
దు దనుక సేదదీర్చదగదుర్విన బీరము నుప్పరిల్లగన్
మదిని దయాలు రామవిభుమాత్రమునిండుగ జేసి రండికన్

అవధాని గారి నాప్రశంస :
 
చం. అనిలకుమార! నీ యనుపమాన వచః ప్రవిముక్త పద్యముల్
ననితరసాధ్యహృద్యములు నై నవధానబుధేంద్ర! పృచ్ఛకా
గ్రణుల మనో విలాసముల( రంజిలజేసి సరోజగంధ వీ/
చినివృతసాంద్రమాలికలచే నలరింపగ జేసినాడవే!

Sunday, January 13, 2013

Bharati theertha swamy sthuthi kusuma padya panchakam

31వ డిసెంబర్2012 రోజున సాయంత్రము మాధర్మపురికి శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామిగారు వచ్చినాఅరు. వారికి ఆమరునాడు(1వ జనవరి రోజున నేను అర్పించిన పద్యకుసుమపంచకమ్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~‘
ఓం గం గణపతయే నమః శ్రీశోమేశాభ్యాం నమః శ్రీమాత్రే నమః
శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య,పదవాక్యప్రమాణపారావారపారీణయమనియమాద్యష్ఠాఙ్గయోగానుష్ఠాననిష్ఠ ,తపోనిష్ఠావరిష్ఠ , షడ్దర్శనస్థాపనాచార్య , వ్యాఖ్యానసింహాసనాధీశ్వర,వైదికమార్గప్రవర్తక ,సర్వతంత్ర స్వతంత్ర, శ్రీమదాదిశంకరాచార్య
పరంపరాప్రాప్త , ఋష్యశృంగ పురవరాధీశ్వరతుఙ్గభద్రతీరవాసీ శ్రీ శ్రీ శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామిగురుకరకమలసంభవ శ్రీజగద్గురుశృఙ్గేరీ దక్షిణామ్నాయ శారదాపీఠాధిప తత్ర భగవత్
...
... శ్రీశ్రీశ్రీమద్ భారతీ తీర్థమహాస్వామి చరణారవిందేభ్యః సమాదర భక్తిపూర్వకం
సప్రశ్రయం సమాహ్వానపూర్వకం సమర్ప్యతే పద్యకుసుమపంచకం యద్ -

శ్లో. సకలనిగమశాస్త్రావాస! పుంభావవాణే! ,
ప్రణతనిజముఖస్త్వ ద్దర్శనాసక్తచిత్తః |
వదతి సహృదయం సుస్వాగతం ధర్మపుర్యాం ,
పురజనసముదాయో భారతీతీర్థ యోగిన్ ! ||1||

శ్లో.పరిగతవరపాత్రః శారదాంబాదయాయాః ,
కిమయమపరరూపః శంకరో బ్రహ్మతేజాః |
కలికలుషనివారః పామరాణాం జనానాం ,
ప్రచురిత ఋషి(1) విద్యారణ్యమూర్తిర్ భవాన్ కిం || 2 ||

శ్లో. విధువదన! భవంతం తంగిరాలాబ్ధి వంశః ,
నిజసుతముపగమ్యోత్తుంగవీచీయశస్కః |
సకలజనహితాయ ప్రాపయత్ ఋష్యశృంగం ,
సుతమివ వసుదేవో బంధనాత్ నందగేహమ్ || 3 ||

శ్లో.గతవరగురుపాదోఽధీతవేదాంబురాశిర్ ,
బుధనుత ! కటిబద్ధో ధర్మరక్షాయ విద్వన్
ప్రణిహిత వరదీక్షో వేదరక్షాక్రియాయై,
తిమిరమివ రవేస్ త్వన్నో గతం మోహజాలమ్ || 4 ||

శ్లో.పరిగతపరమార్థం ధర్మరక్షాకరం త్వాం,
వికసితనిగమాంతం ఖండితధ్వాన్తమాయమ్ |
అభయదకరపద్మం భారతీతీర్థ యోగిన్ ! ,
నిహితచరణపద్మం ధర్మపుర్యాం నతాః స్మః || 5 ||

స్వస్తి శ్రీ నందన మార్గ. కృ. ౩----------- తత్రభగవత్స్వామినః సందర్శనాశీర్వచనాద్యభిలాషిణః,
తే. 31. 12. 2012 ----------------------శ్రీ లక్ష్మీనృసింహదేవార్చకాదిమందిరబృందమ్ ,
బ్రాహ్మణసంఘసేవాభవనవేదికా ,--------ధర్మపురీస్థానిక బ్రాహ్మణపౌరసంఘః ,
ధర్మపురీ -----------------------------------------ఆర్యవైశ్యాదిసేవాసంఘాశ్చ ,
~ పద్యరచనా : కోరిడే విశ్వనాథ శర్మా (శృంగేరీఫీఠాస్థానవిద్వద్ డా. కోరిడే రాజన్నశాస్త్రిపుత్రః) సంస్కృతోపన్యాసకః ,
1)ఋషిర్వేదే వశిష్ఠాదౌ..’ మేదినీ | ఋత్యకః ఇతి విసంధిః |See More
— with DrBachampalli Santhosh Kumara Sastry and Jagadguru Sri Bharati Tirtha Mahaswamigal.