Saturday, March 31, 2012

buduthadu


          బుడుతడు {18..01.2008 }
                         కోరిడె విశ్వనాథ శర్మ,

బుడిబుడి నడకల బుడుతడు నీలో
నిలిచియున్నాడు కృష్ణమ్మా!
వడి వడి నడకలు వీడి వాడిని
... కడకంటి చూపున కనుమమ్మా!

*ధర్మపురి మంథెన బాలకృష్ణుడై వాడు
మురళీ గానము రాగము తీయుచు
సుమతుల మతుల సంతసమొందగ
అనీలరూపుడై, సునీల చేష్టలతో..
నిఖిల జనులు మురిపించు........................ బుడిబుడి నడకల
 
* శశికాంతు మోముతో నటరాజుచిందులేస్తూ
ఫణిధరు మరిపించి, వినోదము కలిగించి
రాజీవలోచనుడు, శిఖిపింఛశేఖరుడు
మానసమోదమును ప్రసాదించు
ఉత్తముడోయమ్మ మన వాడు........................... బుడిబుడి నడకల

Jai Sri Ram


వారిధిపై వారధిగట్టి
వానరయూథమును చేతను బట్టి
రావణగర్వము ఖర్వము జేసి,
రాక్షసచర్యకు మంగళం పాడి,
అవనీనాథులు జయింపగ లేని
 అవనీతాపకారుడిని
అవ్వనితాపహారుడిని
అవలీలగా అంతమొందించితివి.
అవనీలో జనుల ఆర్తిబాపుటకై
అవతిరించితివి అవనీజానాథ!
అమరులకుకూడ అవధ్యుడైనను
ధర్మసమరం లో
మానవునిచేతిలోమరణం తప్పదని
అవనిన కీర్తి గడించితివి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2
 
జై శ్రీరామ్

నిజనాథుని వరించిన
నిజసుతని జూసి,
అవని నిర్వేదమునొందక
సవతినిగంటి సుతగా
నిజనాథుని అల్లునిగా జేసికొంటి
నిజము ! నాభాగ్యమని
అవని మురుపెమునొందె.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3
 
రాముడేకపత్నీ వ్రతుడనిరి లోకులు,
అనుకూలనాయకుడనిరి కవులు.
అది ఎట్లగున్?

భుజగభూషణుని ధనుర్భంగము జేసి,
 భుజబలశౌర్యప్రతాపము జాపి,
భూజాతచేతిని చేతను బట్టి,
భుజబలగర్వితుని తుదముట్టించి,
నిజదారారక్షణకు మార్గము జూపి,
నిజ దారయందు ప్రేమని చాటి
నిజదాంపత్యము నాదర్శము జేసి
భూలోకాన కీర్తిని గడించిన
సీతారాముల చరిత
కాదెవ్వరికి కమనీయ కావ్యం

ఔను అదియట్లుండన్
పట్టాభిషేకమున సతిగా గైకొని,,
పదిమందిలో ఏలుదునని,
పరవశించే సతితో పలికి,
నాథుడంటే ఇట్లుండవలెనని
అవనీజనుల మెప్పును పొందిన
అవనీనాథునికి అవని
కాదా రెండవపత్ని?
ఆమెపైచూపిన ప్రేమ అమితము కాదా?
రాముడు కాడా దక్షిణ నాయకుడు.?

{అనుకూలుడు =ఒకే భార్య కలిగి, మిక్కిలి ప్రేమగలవాడు,
దక్షిణుడు = అనేక భార్యలయందు సమానమైన
అనురాగముగకలవాడు}

Friday, March 23, 2012

Nenevarini ( who am I ) ?

                నెనెవరిని    

ప్రభూ !
గతమేమిటో గుర్తులేదు.
వర్తమానం అర్థం కాదు
భవిష్యత్తేమిటో తెలియగ లేదు.
ఔను ప్రభూ!
ఇంతకి నేనెవరిని?
కమ్మని అమ్మఒడిలో చేరినప్పడు
చల్లని ఆత్మీయతతో...
వెచ్చని హృదయ స్పందనలో
నేనెవరినో తెలియకనే కరిగిపోయా...

వద్దంటున్నా వినక నన్ను
బడి ఒడిలో పడవేసినఫ్ఫుడు
తోటి వారి అల్లర్లతో
బడి పంతుల పాఠాలతో..
నేనెవరినో తెలియకనే సాగిపోయా...

అన్నింటా జంటగా
నేనుంటా నీవెంట యంటూ
దరిజేరిన అర్ధాంగిని,
మమ్ము సాగే భారము నీదే నంటూ
పుట్టుకొచ్చిన పిల్లలను,
బాధ్యతలతో బతుకుబాటన
బడిపంతులనైనాను.
నాకే అర్థం కాని ఈ జీవనయానం ను
నేనెవరినో తెలియకనే లాగుతున్నా...

విశాల జగద్వేదికలో
ఆద్యంతాలులేని ఈ నాటకములో
ఆజన్మమరణాంతతరంగరంగాలలో
అగుపించని ఓ సూత్రధారీ!

నేనెవరినో తెలియని నాకు
ఎప్పుడిచ్చావు ఈ పాత్రను?
ఎంత వరకీ యాత్ర?

పూర్వ రంగములో నేనుంటినో లేనో?
తదుపరి రంగములో... తెలియదు.
రంగరంగాన రంగులద్దుకొని
విచిత్రపాత్రల పాత్రుడనై
ఎన్నిజన్మల యాత్రికుడనో..

ఐనా ప్రభూ!
నిస్తేజమైన శూన్యమునుండి
నిరాకారమైన ఆత్మను జేసి,
సాకారత్వపు ముసుగును గప్పి,
జన్మపరంపరలో భాగిని జేసి,
చరాచరజగత్తులో జీవిని జేసి,
మనిషిగ మరింత మార్పులు జేసి,
వీడొక ‘వాడ’ని పేరును తెచ్చి..
నిలబెట్టిన నారూపాన్ని జూసి,
నాకే అర్థంకాలేదు
ఇంతకూ
నెనెవరిని స్వామీ!

Friday, March 16, 2012

dharamapuri jatara veduka

ధర్మపురీశుని జతర వేడుక


శ్రితజనపోషక! దానవభంజక! ధర్మపురీశ్వర! దాసరతా!

జాతరలో నిను చూడ , జనమంత వచ్చీరి.
జగదేక! నిను గాంచ, జగమంత కదిలేను.  ........శ్రితజనపోషక! || 

1.నింగీన పందిర్లు, నేలంత ముగ్గూలు,

జగమంత వేదీక, ప్రతి ఇంట రంగూలు,
వచ్చీరి జనమంత, బంధువులై నినుచేర,
ఊరంత పండూగే, నీపెళ్ళీ రోజూన........ ........శ్రితజనపోషక! || 

2.నొక వంక చంద్రూడు, నొక వంక సూరీడు
ఒళ్ళంతా కళ్ళెట్టి, నిను చూడాచేరంగా,

కోనేటీ నీటీలో, తెప్పల్లో తిరిగాడి,
స్తంభాపు మేడాలో, ఊయాలాలూగూచు
సిరి దేవతా నిన్ను, సొగసూన చూడంగ,

దాసూలమై సేవాన, ధన్యులా మైతీమి ........శ్రితజనపోషక! || 

3.దొంగాలబాధ ఇక, భరియింపలేమని
  దాసూలు దయతోడ, నిను చూడవేడంగ
 రథముపై నీవెక్కి, దొంగాల చండాడి,

విజయుడవై నీవిట, ఆర్తూల బ్రోచేవు................శ్రితజనపోషక! || 

4.ఓ లక్ష్మీకాంతూడా!, నీకాంతా లక్ష్మమ్మ
ఏకాంతాసేవాకై , నిను చేరా వచ్చేను,

ఇనకాంతామణూలు, ఇంద్రనీలాలు
ధరియించి పురకాంతలు, పాటల్లూ పాడీరి. ........శ్రితజనపోషక! || 


5.వేదాలూ శాస్త్రాలూ, గాథాలూ గీతాలూ
 నాట్యవాయిద్యాలూ, మౌనస్తోత్రాలు
జయజయధ్వానాలు, చేసిరి జనులంత
మ్రోగంగ జగమంత, భక్తితో తలవంచి,
........శ్రితజనపోషక!

Wednesday, March 14, 2012

Laxmi narasimha kalyanam

              శ్రీ లక్ష్మీ నరసింహ కల్యాణం

కమనీయం నరసింహుని కల్యాణం కావ్యం,
కాంచినవారి నోముల పంట
చేసినవారికి సిరులేఇంట....|| కమనీయం||

ఒకవంక శ్రీదేవీ చూసేను క్రీగంట
నొక వంక భూదేవీ తలవంచే బిడియంగ

 బుగ్గల నిండా సిగ్గులతో భామలిద్దరు మురిసేరు...|| 
                          .........||కమనీయం||    
 బహు ముఖుడు బ్రహ్మ దేవుడు బ్రాహ్మణుడై నిలిచేను,

కన్యల నివ్వ సాగరుడు గంగమ్మతో వచ్చేను.
మహేశుడు గణేశుడు సురేశుడు గిరీశుడు
పెద్దలై హరిముందు గద్దెనెక్కి కూర్చుండిరి
.||
,
. .........||కమనీయం||