Monday, April 15, 2013

NAMO MAHASE OF Dr. K.Rajanna Shastry


                                   నమో మహసేమా నాన్నగారు{Dr.K.Rajanna Shastry} నేటికి 40 సంవత్సారలకు పూర్వం {4.4.1973} తన 40 సంవత్సరాల వయస్సులో ‘సుమనోంజలిః’ అనే తన చిన్ననాటనుండి ఆయా సందర్భాలలో వ్రాసిన సంస్కృతకవితలపుస్తకమును విడుదల చేసినారు. దానిలోనుండి హరిహరత్మకతత్వమును తెలిపే ఈ పద్యకుసుమాష్టకమును భావముతో మీకు అందిస్తున్నాను.

కాలాయ వర్ష్మణ్యథ కన్ధరాయాం,
పాదేఽథ మూర్ధ్న్యభ్రనదీవతే చ |
 శయ్యావతే నాగవరేణ భూషా-
వతే నమో మే మహసేఽపి కస్మై ||1||


భా. శరీరమందే కాని, కంఠమందే కాని నలుపువర్ణముగలవాడునూ, పాదమందే కాని. మూర్ధభాగమందు కాని ఆకాశగంగను కలిగినవాడునూ, నాగవరుని శయ్యగా కలిగినవాడు కాని భూషణముగ కలిగినవాడే కాని ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

పిత్రేఽథ హన్త్రేఽసమసాయకస్య,
భర్త్రేఽథ హన్త్రేఽఖిలభూతసృష్టేః |
 ధార్యాయ ధర్త్రే ద్విజనాయకస్య,
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||2||

భా. అసమసాయకుడగు మన్మథుని జన్మదాతయో హంతయో, అఖిలభూతసృష్టికి భర్తయో, హర్తయో, ద్విజనాయకుని {గరుత్మంతుని/చంద్ర్ర్రుని} చే ధరించబడినవాడో, ధరించినవాడో అట్టివాడు ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

పాత్రే గజస్యాథ విఘాతుకాయ
ద్విషేఽసురాణామధిదైవతాయ |
 పూర్ణస్త్రియై వాఽర్ధతనుస్త్రియాయై
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||3||

భా. గజమునకు భక్తి పాత్రుడో, సంహారకారకుడో. రాక్షసులకు శత్రువో, అధిదైవతమో. సంపూర్ణస్త్రీ శరీరాకృతికలవాడో. అర్ధస్త్రీ శరీరముకలవాడో,ఎవరో అట్టి మహత్త్వశక్తికి నా నమస్కారము.

వినాయకేనాథ సువాహవత్తా
సుపుత్రవత్తాఽథ విభాతి యస్య|
పదం ను వాసోఽథ విహాసశ్చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||4||


భా. వినాయకుని{ గరుత్మంతుని ) చేత ఎవరి మంచివాహనము కలిగియుండు ధర్మము, వినాయకుని {గణపతి} చేత ఎవరి మంచిపుత్రునిగలిగి యుండు ధర్మము, ప్రకాశించుచున్నదో. ఎవరి నివాసస్థానము, ఆకాశమో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా
నమస్కారము.

యస్యాత్మభూభూయమథాత్మభూస్తు
కుమార ఏవైతి కుమారభూయమ్|
చక్షుర్హి చక్షుర్భువనస్య యస్య
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||5||


భా. ఆత్మభువుడు (బ్రహ్మ దేవుడు) ఎవరికైతే ఆత్మభువుడు(పుత్రుడు)గానూ కుమారుడు(కుమారస్వామి) ఎవరికైతే కుమారుడుగా (పుత్రుడు)గా అయ్యెనో భువనమునకే నేత్రమైనవాడు ( సూర్యుడు) ఏవనికి నేత్రమైయ్యెనో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.
సురర్షికార్యాయ వనేచరత్వ-
ముపేయుషే భూధరరాజభర్త్రే |
గవోల్లసత్పావనమూర్తయే చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||6||

భా. దేవ,ఋషుల కార్యములకై వనేచరత్వమును [ (1)వనే = నీటియందు, చరత్వం =సంచరించునట్టి మత్స్యావతారమును , (2) వనచరుడు = కిరాతావతారమును ] పొందినట్టివాడునూ, భూధర రాజభర్త యైనవాడునూ [ (1) భూధరరాజును = మంథరపర్వతమును మోసినట్టివాడునూ, (2) భూధరరాజునకు = కైలాసపర్వతమునకు అధిపతియైన వాడునూ,] గవోల్లసత్పావనమూర్తియైనవాడునూ [ (1)గోవుచేత = భూమిచేత ప్రకాశించే పవిత్రమూర్తి కలవాడునూ (2) గోవుయందు = వృషభముయందు ప్రకాశించే పవిత్రమూర్తి కలవాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

పంచాస్యతాభూషితపూర్వభిన్న-
వపుష్మతే చ చ్ఛలభిక్షుకాయ |
పరశ్వథోద్భాసితపాణయే చ
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||7||

భా. పంచాస్యత్వముచేత [=(1) సింహముఖము కలిగి యుండుటచేత (2) ఐదుముఖములు కలిగి యుండుటచేత ] అలంకరించబడిన పూర్వశరీరముకలిగిన భిన్నమైన ఆకృతికలవాడునూ, కపటమైన భిక్షువు (వామనునిగానూ, కపటబ్రహ్మచారిగానూ) ఐనట్టివాడునూ, పరశువు చేత మిక్కిలిప్రకాశించునట్టి పాణికలవాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

టి. పరశుశ్చ పరశ్వథః ” అమరమ్
 

పత్యే చ గోత్రాత్మభువోఽచ్ఛదేహ
త్విషే మహానాగమదాపహర్త్రే |
 దుర్దాన్తగోనాథమదాపహర్త్రే
నిత్యం నమో మే మహసేఽపి కస్మై ||8||

భా. గోత్రాత్మభువునకు [ (1) గోత్రా =భూదేవికి ఆత్మభువురాలు =పుత్రికసీతాదేవికి (2) గోత్ర = పర్వతమగు హిమవంతునికి ఆత్మభువురాలు = పుత్రికయగు పార్వతీదేవికి ] భర్తయైనట్టివాడునూ, స్వచ్ఛమైనదేహకాంతి కలవాడునూ, మహానాగ = కాళీయమను సర్పము యొక్క లేదా మహానాగ = గజాసురునియొక్క మదమును హరించినట్టివాడునూ, మిక్కిలి మదగర్వితులైన గోనాథ = (కల్కి అవతారమున)రాజులయొక్క లేదా దేవతలగు పంచమహేంద్రులయొక్కయు గర్వమణిచినట్టివాడునూ ఎవరో అట్టి మహత్త్వశక్తికి నిత్యము నా నమస్కారము.

టి. గోత్రా కుః పృథివీ పృథ్వీ " అమరము. శివుడు పంచమహేంద్రుల గర్వమణిచినట్టి విషయము ఆంధ్రమాహాభారతమున ఆది పర్వ సప్తమాశ్వాసమున ద్రపదీదేవీస్వయంవరప్రస్తావమున పంచేంద్రోపాఖ్యానమున చూడవచ్చు.
ఈ కవిత ఇట్లు ఎనమిది శ్లోకములతో ముగిసినది. ఆదరించిన పెద్దలకు కృతజ్ఞతలు.

No comments:

Post a Comment