ఓం గం గణపతయే నమః
లలాట తిలకం- భస్మధారణం
కొరిడె విశ్వనాథ శర్మ .
‘నరత్వం దుర్లభంలోకే’ అను ఆర్యోక్తిప్రకారము సమస్త జీవకోటిలోమానవజన్మదుర్లభమైనది.
ఇట్టి మానవజన్మలోకూడ ‘ఉద్ధరేదాత్మనాత్మానం’అని చెప్పబడినందున తన కర్మలద్వారా తన
ను తాను ఉద్ధరించుకొనవలెను. మానవునిగా జన్మించినది మొదలు.....
"జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ ఋణ వా జాయతే."
-తైత్తిరీయ సంహిత. 6/3/1015
అని చెప్పబడినట్లు దేవ,పితృ,మనుష్యసంబంధించినఋణములుకలిగినవాడగును. అట్టివాటి
నుండి విముక్తి నొందవలెనంటె శాస్త్రము నిర్దేశించిన నిత్యకర్మాచరణబద్ధుడై యుండవలెనువాటి
లో ముఖ్యముగా...
" సంధ్యా స్నానం జపశ్చైవ దేవతానాం చపూజనమ్,
వైశ్వదేవం తథాఽఽతిథ్యం షట్ కర్మాణి దినేదినే."
అని సంధ్యాస్నానజపములు,దేవతార్చన, వైశ్వదేవము,ఆతిథ్యం అనునవి ఆరుకర్మలు నిత్య
కర్మలుగా విధించబడినవి.ఏ నిత్యకర్మలనాచరించినప్పటికినీ తిలక (త్రిపుండ్ర )ధారణగావించని
చో అట్టి కర్మలు నిష్ప్రయోజనములగునని...
"సత్యం శౌచం జపో హోమస్తీర్థం దేవాదిపూజనమ్,
తస్య వ్యర్థమిదం సర్వం యస్త్రిపుండ్రం న ధారయేత్ ."
అని భవిష్యపురాణం పేర్కొన్నది. ప్రయోగపారిజాతం కూడ..
''అకృత్వా ఫాలతిలకం తస్య కర్మ నిరర్థకమ్ ."
అని తిలకధారణావశ్యకతను పేర్కొ న్నది.
తిలకధారణ మూడువిధములు. 1) ఊర్ధ్వపుండ్రము.2) త్రి పుండ్రము.3)చందనధారణము.
అని . కాగా బ్రహ్మపురాణము..
''మృత్తికా చందనం చైవ భస్మతోయం చతుర్థకం. "
అని జలముచే తిలకధారణను నాలగవదిగా పేర్కొన్నది
" . ఊర్ధ్వపుండ్రం మృదాకుర్యాత్ భస్మనా తు త్రిపుండ్రకమ్,
ఉభయం చందనేనైవ అభ్యంగోత్సవరాత్రిషు."
అని ప్రయోగపారిజాతము ఊర్ధ్వ పుండ్రము మట్టితో త్రిపుండ్రము భస్మముతో, చందనముతొ ఊర్ధ్వపుండ్రముగాను,, త్రిపుండ్రముగాను ఉత్సవరాత్రులలో ధరింపవచ్చునని తెలిపినది. ఊర్ధ్వపుండ్రము తులసీమూలమందలి మట్టితో కాని, లేదా గంగాది నదీ, సముద్రముల తీరములందలి మట్టితో కాని కావించవలెను.లేదా శ్రీ చందనమైననుగ్రహించవలెను.ఊర్ధ్వపుండ్రము గావించునప్పుడు కేశవాదినామములు ఇరువది నాలుగింటినుండి దామోదరనామమువరకు (12) నామములనుచ్చరించుతూ శుక్లపక్షమందు, సంకర్షణాది (12) నామములనుచ్చరించుతూ కృష్ణపక్షమందు లలాట,ఉదర, హృదయ, కంఠ,పార్శ్వ, బాహు, కర్ణములందునూ ఇరువైపులందు మరియూ వీపున, మెడ పైభాగమున ఇట్లు (12) స్ఠానములందు ధరింపవలెను.
శ్రీచందనమును తిలకముగా ధరింపదగినదైననూ భగవంతుని అర్చనలో వినియోగింపగా మిగిలినట్టి దానిని మాత్రమే ధరింపవలెనె కాని తనకొరకై సిద్ధముచేసికొనరాదు.
ఇక భస్మవిలేపనము గురించి
"బ్రాహ్మణానాం త్రిపుండ్రకం"
శ్రీ వైష్ణవులు ఊర్ధ్వపుండ్రము గావించతగినదికాగా, బ్రాహ్మణులు త్రిపుండ్రభస్మధారణము గావించుట విధింపబడినది.
కావుననే..
'' శాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ,
భస్మత్రిపుండ్రైః పూతాత్మా మృత్యుంజయతి మానవః ."
శాద్ధ యజ్ఞ జప హోమ వైశ్వదేవ దేవతార్చనాదులందు భస్మత్రిపుండ్రధారణచేత పూతాత్ము
డై మానవుడు మృత్యువును జయించుచున్నాడని ధర్మసింధువు పేర్కొన్నది.
ఇక స్కందపురాణమున...
"విభూత్యాది కృతం సర్వం జగదేతచ్చరాచరమ్ ,
శివస్యాంగణలగ్నయా తస్మాత్తాం ధారయేత్ సదా ."
ఈ చరాచర జగత్తు విభూత్యాదులచేతనే సృజించబడినది.శివునిస్పృశించినవిభూతి సదా ధార్యమైనదని తెలిపినది. అట్టి విభూతిమహాత్మ్యము వివరించుచూ..మహాపాతకియైన చోరుడొకడిని రక్షకభటులు పడవేయగా భూడిదిలో దొర్లిన శునకమొకటి ఆ శవమును తిన ప్రయత్నించునపుడు పైన బూడిదపడినందున ఆ పాపి నిష్పాపియై,కైలాసమును పొందిన వృత్తాంతమును పేర్కొనది.
కావున అట్టి భస్మమును ధరింపవలెనన్న ముందుగా ఎడమచేతిలో
భస్మమునుంచుకొని పవిత్రమైన కొన్ని నీటిచుక్కలతో తడుపుతూ...
"ఓం అగ్నిరితి భస్మ | ఓం వాయురితి భస్మ | ఓం జలమితి భస్మ | ఓం సోమమితి భస్మ | ఓం వ్యోమేతి భస్మ | ఓం సర్వం హవా ఇదం భస్మ | ఓం మన ఏతాని చక్షూంసి భస్మానీతి | "
అనుమంత్రముచే నభిమంత్రించి ధరించవలెను . జలముచే తడుపబడిన భస్మము ప్రాతః కాలమునందు మాత్రమే ధరింపవలెనని , అదే విధముగా మధ్యాహ్నము గంధమిశ్రితముగాను, సాయంకాలమునందు పొడి భస్మమునుగాను విలేపనము గావించవలేనని దేవీభాగవతము ...
''ప్రాతః ససలిలం భస్మ మధ్యాహ్నే గంధమిశ్రితమ్,
సాయాహ్నేనిర్జలం భస్మ ఏవం భస్మవిలేపనమ్ . (11/1/43 )పేర్కొన్నది.
"మధ్యహ్నాత్ ప్రాక్ జలాక్తం తు పరతో జలవర్జితమ్ . "
అని
అనికూడ స్పష్టము గావించినది. భస్మమును ధరించునపుడు కూడ ...
''తర్జన్యనామికాంగుష్ఠై స్త్రిపుండ్రం తు సమాచరేత్ ."అని తర్జనీ (చూపుడువేలు ) , అనామిక (ఉంగరపువేలు) , అంగుష్ఠం (బొటనవేలు)లను ఉపయోగించవలెనని దేవీభాగవతము తెలిపినది. కాని మరొకచోట..
'' మధ్యమానామికాంగుష్ఠైరనులోమవిలోమమతః |"అని తర్జనికి బదులు మధ్యమ (నడిమి ) వేలును ఉపయోగించుటకై పేర్కొన బడినది . ఇట్లు భస్మమును అనులోమవిలోమ పద్ధతులలొ ధరింపవలేనని నిర్దేశింపబడినది .అనగా ముందుగా అంగుష్ఠముతో ఊర్ధ్వపుండ్రము (నిలువు గా ) లలాటమధ్యమున గావించి, అటుపిమ్మట మధ్యమ ( నడిమి ), లేదా తర్జనీ వేలితొ మరియు అనామికలతో మధ్యన స్థలమును విడిచుచు నుదుటిన ఎడమ నుండి కుడికి ధరించి
ఆ రెంటివరుసల మధ్యన బొటనవేలితో కుడి నుండి ఎడమకు విలేపితము గావించవలెను. ధరింఛునపుడు మూడురేఖలు స్పష్టముగా అగుపించునట్లుండవలెను. రేఖలు స్పష్టముగా లేనట్టివాడు నరాధముడని పద్మపురాణము....
" నిరంతరాలం యః కుర్యాత్ త్రిపుండ్రం సనరాధమః . " అని పేర్కోనగా, అట్టిరేఖలు నేత్రములను అతిక్రమిచకూడదని దేవీభాగవతము ..
నేత్రయుగ్మప్రమాణేన భాలే దీప్తం త్రిపుండ్రకం ."(11/15/23) అని వివరించినది. అంతేకాక ..
''అతిస్వల్పమనాయుష్యమతిదీర్ఘం తపః క్షయమ్ "
అట్టిభస్మరేఖలు చిన్నవైనచో ఆయుష్యమును,దీర్ఘమైనచో పుణ్యకర్మాచరణఫలమును హరించివేయునని కూడ పేర్కొన్నది. కావున ప్రమాణానుగుణముగా భస్మరేఖలను ధరింపవలెను.
భస్మధారణసమయమునందు కూడా ‘త్ర్యంబకం’ మంత్రముచేతనేకాని , శివతారకమంత్రము చేతనేకాని , లేదా ప్రణవనాదయుక్త శివపంచాక్షరీ మంత్రము చేతనే కాని
ఉచ్చారణపూర్వకముగా ధరింపవలెనని క్రియాసారము.... ,
''త్ర్యంబకేన చ మంత్రేణ సతారేణ శివేన వా ,
పంచాక్షరేణ మంత్రేణ ప్రణవేన యతేన చ . "
అని ఉపదేశించినది.లలాటమునందు , కంఠమునందు , భుజద్వయములందు హృదయమునందు త్రిపుండ్రవిధానమున భస్మరేఖలు ధరింపవలెను. అట్టి సమయమునందు..
ఓం త్ర్యాయుషం జమదగ్నేరితి లలాటే ,
ఓం కశ్యపస్య త్ర్యాయుషమితి గ్రీవాయామ్,
ఓం యద్దేవేషు త్ర్యాయుషమితి భుజయోః ,
ఓం తన్నో అస్తు త్ర్యాయుషమితి హృదయే .
అని మంత్రించుచు ఆయాస్థానములందు విలేపనము గావించవలెను.అదేవిధముగా నాభి
యందు,భుజశిరస్సులతోపాటు బాహువులసంధులందును వీపుయందు గావించు విధానమును కూడ ధర్మసింధువు విశదపరిచినది. కాని నాభికిందిభాగముననూ, పాదములందునూ భస్మధారణ గావించుట ఉచితము కాదు.ఇట్లు చెప్పబడిన త్రిపుండ్రముగా ( మూడురేఖలుగా) ధరించువిధానము బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడగా క్షత్రియులకు నాలుగు రేఖలుగాను , వైశ్యలకు రెండు రేఖలు గాను, శూద్రులకు ఒకే రేఖగా ధరించుట శాస్త్ర నిర్దేశితమైనది.
భస్మధారణమహాత్మ్యము ఇట్లు కొనియాడబడినది....
భూతిం భూతకరీ పవిత్రజననీ పాపం చ విధ్వంసినీ
చిత్తానందకరీ యశః సుఖకరీ సర్వార్థసంపత్కరీ ,
రక్షోభూతపిశాచ రాక్షస మహారక్షైక సంత్రాసినీ
తేజోరాజ్యవిశేషపూణ్యజననీ భూతః సదా ధార్యతామ్ .పౌరాణికకల్పోక్త ప్రకాశికా
ఇతి శమ్
----.౦౦Ooo--