Friday, March 21, 2014

Godavari Mahatmyam (Brahma puranam) {2} Puthra theertham

బ్రహ్మ పురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము -2 రచన: విశ్వనాధశర్మ కొరిడె పుత్ర తీర్థ విశిష్టత గోదావరి యందు మరొక ప్రసిద్ధమైన తీర్థమొకటి కలదు. దాని పేరు ‘పుత్ర తీర్థం’. అట్టి దాని నామ శ్రవణము చేతనే సమస్త అభీష్టములను పొందగలడు. పూర్వమున దితి , తన పుత్రులు, దనుపుత్రులు కూడా యుద్ధములందు నశించుచుండగా తన సవితి పుత్రులైన ఆదిత్యులు అభివృద్ధిని పొందుతుండుట గమనించి, మిక్కిలి దుఃఖమును పొందినదై దనువు దగ్గరికి వెళ్ళినది. ఆయనతో తన దుఃఖానికి కారణాన్ని తెలిపి , “ఆర్యా! ! మన ఇరువురి పుత్రులు నశించుచున్నారు. నేనేమి జేతును? అదితి వంశమును చూడు. ఉన్నతమైనదిగా సర్వోన్నతముగా అభివృద్ధిని పొందుతున్నది. శత్రుదుర్భేద్యమైనదై , అజేయమైనదైనది. జయ,కీర్తులను కలిగి రాజసుఖములను పొందుచున్నది. నాతో సమానురాలగు అదితిని, అదితి సంతానమును, వారి వృద్ధిని చూచిన నాకు అస్వస్థత కలుగు చున్నది. కలలో కూడా ఆ అదితి వైభవమును చూచినప్పటికినీ కలిగే బాధకంటే అగ్నిలోనైనూ సుఖమనిపించుచున్నది . ” అని అతి దీనురాలై విలపించినది. ఆమెను చూచి , పరమేష్ఠి పుత్రుడైన దనువు ఓదార్చుతూ , “ ఓ కళ్యాణి ! నీవు ఇలా దుఃఖిచుట తగదు. పుణ్యకర్మానుచరణ ద్వారానే కోరికలు సాధింపబడగలవు. మహానుభావుడైన నీ భర్త కశ్యప ప్రజాపతి నీ కోరికలను సాధించు మార్గమును చెప్పగలడు .ఆ ప్రజాపతిని నీ సద్గుణములచేత సంతోష పెట్టు. ప్రసన్నుడైన ఆ మహానుభావుడు నీ అభీష్టమును నెరవేర్చగలడు . ” అని ఉపదేశించినాడు. అఫ్ఫుడామె అట్లే యని అంగీకరించి, తన భర్తయైన కశ్యపప్రజాపతిని సకలోపచారముల ద్వారా సంతోషపరచినది. సంతుష్టుడై కశ్యపుడు ఆమెతో ‘ ఓ దితి ! నీ అభీష్టమును కోరుకొమ్మనమ’ ని అడిగినాడు. అప్పుడా దితి తన భర్తతో “ బహుగుణములతో కూడుకొని సర్వలోక విజేత, సర్వలోక నమస్కృతు డగు పుత్రుని ప్రసాదించమని “ కోరినది . అందులకు కశ్యపుడు పన్నెండు సంవత్సరము లాచరించదగిన వ్రతమును ఉపదేశించి, ’అ వ్రత ఫలసిద్ధి వలన నీ మనోరథము సిద్ధించగల’దని తెలిపినాడు. ఆమె కూడా భర్త అదేశానుసారము భక్తితో ఆ వ్రతమును యథావిధిగా ఆచరించినది. అటు పిదప కశ్యప ప్రజాపతి వలన ఆమె గర్భమును ధరించినది. అటుపిమ్మట ఒకనాటి ఏకాంతమందున అమెతో కశ్యపప్రజాపతి ” ఓ దేవి ! తపోనిష్ఠులైన మునులు కూడా తమ వ్రతాదులందు కర్మలను ఆచరించుటలో నిర్లక్ష్యము గావింతురు. అందువలన తమ మనోరథములను పొందలేక పోవుచున్నారు. వ్రతదీక్షా నియమములేమనగా – ఉభయ సంధ్యాకాలములందు నిదురించ రాదు . ఆ సమయమునందు నింద్యకార్యములను ఆచరించరాదు , బయటకు వెళ్ళరాదు , వెంట్రుకలను విరబోసుకొని యుండరాదు , అట్టి సంధ్యా కాలములందు అనేక ప్రాణులతోనున్న ప్రదేశమునందు భుజించరాదు. ఆవలించుట, తుమ్ముట అనేవి చేయరాదు. నవ్వునప్పుడు కూడా ముఖముపై ఏదేని అడ్డుగా నుంచుకొనవలెను. అట్టి కాలములందు ఇంటి మధ్య ప్రదేశములందు ఉండరాదు. రోలు,రోకటి,చేట, పీట,(ఆసనము) మొదలైన వాటిని ఎప్పటికినీ దాటి వెళ్లరాదు. ఉత్తరము వైపు తల ఉంచి నిదురించరాదు. ముఖ్యముగా సంధ్యాకాలమునందు అట్లాచరించరాదు. అసత్యము పలుకరాదు. ఇతరుల ఇళ్ళకు వెళ్ళరాదు. పరపురుషుడిని చూడరాదు. ఇట్టి నియమ బద్ధురాలవై వ్రతమును అచరించినచో, నీకు జగదైశ్వర్యవంతుడగు పుత్రుడు కలుగగలడు. “అని ఉపదేశించినాడు. అందులకా దితి అంగీకరించి, ప్రతిజ్ఞ గావించినది. ఆమె ధరించిన గర్భము కూడా మంచి బలిష్టమై యున్నది. ఈ విషయము మయాసురుడు తన మాయ ద్వారా తెలిసికొనినాడు. తన స్నేహితుడైన ఇంద్రుని వద్దకు వెళ్ళి ఈ విషయమును వివరించినాడు. ” అని బ్రహ్మ ఈ కథను తెలుపుతూ ఉండగా మధ్యలో ఈ మాటను విని నారదుడు “నముచి సోదరుడైన మయునికి, నముచి హంతకుడైన ఇంద్రునికి స్నేహము ఎలా కుదిరింది ?” అని అడగగా, అప్పుడు వారి స్నేహాన్ని ఇట్లు తెలిపినాడు. పూర్వములో నముచి దైత్యకులకు ప్రభువు గా ఉండెడి వాడు. సురాసురులకు జరిగిన యుద్ధమునందు ఇంద్రుని చేతిలో సంహరించబడినాడు. తన సోదరుని సంహారకుని వధింపవలెనని మయుడు ఘోరమైన తపస్సు గావించి, శ్రీమన్నరాయణుని మెప్పించి అనేక వరములను శత్రు భీషణకరమైన మాయను కూడా పొందినాడు. అటుపిమ్మట నిత్యము అగ్ని బ్రాహ్మణ పూజలను గావించుచు, సత్య దాన పరాయణుడై, ఇంద్రుని జయించుటకు ఎదిరించుఛుచున్నాడు. వాయువు ద్వారా ఈ విషయమును తెలిసికొన్న ఇంద్రుడు మయుని దగ్గరకు బ్రాహ్మణ రూపమున వెళ్ళి “ఓ దితిజాధిపతీ ! నీ దాతృత్వమును గురించి తెలిసి బ్రాహ్మణుడను నీ దగ్గరకు వచ్చినాను. నాకు వరమునిమ్ము.” అని యాచించినాడు. అందులకు మయుడు ఇంద్రుని గుర్తించక బ్రాహ్మణుడేనని నమ్మి,” నీకు కావలిసింది ఏదైననూ ఇచ్చినాను. అది పెద్దదా. లేక చిన్నదా అని విచారించుట తగదు. ” అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు ’ నీతో స్నేహము కోరివచ్చినాను ’ అని అన్నాడు. అందులకు ఆశ్చర్య పోయిన మయుడు ‘మన ఇరువురికి శత్రుత్వము లేదు కదా ! ’ అని ప్రశ్నించినాడు . అప్పుడు ఇంద్రుడు వర విషయమున మాట తీసుకొని తన సహస్రాక్షరూపమును ధరించినాడు. మయుడు మరల ఆశ్చర్య పోయి, ఇదేమిటని యనగా అప్పుడు ఇంద్రుడు మయుని ఆలింగనము గావించుకొనుచు ఏ విధముగానైన పండితులు తాము సాధించుకొనుదానిని సాధింతురు కదా ! కావున మనమివ్వురము ఇక్కడినుండి మిత్రులము. గడచినదేదో గడిచినది. వదిలి వేయుము.” అని తెలిపినాడు. అప్పటినుండి వారిరువురు ప్రియమిత్రులైనారు. మయుడు ఇంద్రునికి హితైషి యైనాడు. అందువలననే ఇంద్రుని హితముకోరి మయుడు దితి వృత్తాంతమును తెలిపినాడు . మయుని మాటలను విన్న ఇంద్రుడు ’నేనేమి చేతును ? ‘ అని అడిగినాడు. అందులకు మయుడు తన వద్దనున్న మాయావిద్యను ఇచ్చి , ” మిత్రమా! నీవు అగస్త్యాశ్రమమునకు వెళ్ళు. అక్కడ గర్భిణియైన దితి ఉంటుంది. నీవు కొంతకాలము ఆమెకు సేవ చేస్తూ సరియైన సమయమునకై ఎదిరి చూడు. సమయము వచ్చిన పిదప ఆమె గర్భమున ప్రవేశించి, నీ వజ్రాయుధముతో ఆ గర్భమును ముక్కలుగా చేస్తూ సంహరించుము. లేదా నీ వశము అయ్యే విధముగా ఒనరించుము. అందువలన ఇక నీకు భవిష్యత్తులో శత్రు బాధ ఉండదు. ” అని అన్నాడు. ఇంద్రుడు కూడ అందులకు సరే యని అదే విధముగా దితి దగ్గరకు మిక్కిలి వినయమును నటిస్తూ వెళ్ళినాడు. ఏంతో సేవలను గావించినాడు. ఇంద్రుని ఆంతర్యమును గుర్తించని అ దితి కూడ ఆతనిని నమ్మినది. ఒకనాటి సంధ్యాకాలమున మిక్కిలి నిద్ర వచ్చుటచేత ఉత్తరదిక్కుగా తలను పెట్టి, పరుండినది. అదే సమయము సరియైనదిగా తలంచి. వెంబడే మయుని మాయావిద్య ద్వారా ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆమె గర్భములోనికి ప్రవేశించి, గర్భమును సంహరించ బోయినాడు. అప్పుడు ఆ గర్భమందున్న శిశువు భీతుడై, “ఓసోదర! సోదరుడవైన నన్ను సంహరింతువా? నీవు పరాక్రమవంతుడవు. కదా ! యుద్ధముకంటే భిన్నముగా యుద్ధమునందు కాక మరొకరకముగా సంహరించుట ధర్మవిరుద్ధము కదా ! ఐననూ నేను ఈ గర్భమునుండి వెలివడిన పిదప నాతో యుద్ధము గావించుము. ఇట్లు గర్భమునందు శస్త్రాయుధ విహితుడనగు నన్ను సంహరించుట తగదు. ఆపత్తులోనున్ననూ మహనీయులు అధర్మ కార్యముల నాచరించరు కదా ! నన్న సంహరించిన నీవు విశ్వాసఘాతకుడవు. బాలఘాతకుడవు. బ్రహ్మ ఘాతకుడవు అగుదువు. ఈ చరాచర జగత్తే నీ ఆజ్ఞవలన నడుచుకొను చున్నది. అట్టి నీవు ఇట్లాచరించుట తగునా? శిశువు నైన నా పై దౌర్జన్యమునకు పాల్పడుటకు కారణమేమి? ఈ చర్య అపకీర్తికరమగునే కాని. పౌరుష చిహ్నమగునా? ” అని వివిధరీతుల అభ్యర్తన ద్వారా ఉపదేశమును గావించినాడు. కాని ఇట్లెన్ని చెప్పిననూ, వినక ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఖండించినాడు. లోభగ్రస్తులకు, క్రోధగ్రస్తులకు దయ ఉండదు కదా! అట్లు ఖండించబడిన ఆ గర్భస్థ శిశువు చనిపోక, ఆ ముక్కలు అనేకులుగా మారి ఆయుధఘాత బాధలు తాళలేక “మేము నీ సోదరులము. విశ్వసింపదగినవారము. మమ్ము చంపవద్దు.” అనినప్పటిని పలుమారులు తన ఆయుధముతో ముక్కలుగా చేసినాడు. ద్వేషముచే బుద్ధినశించిన వారికి లేశమాత్రమైన కరుణ ఉండదు కదా ! . మొదట ఏడు భాగములుగాను, ఆ ఒక్కొక్కటి మరల ఏడేడు భాగములుగాను (7 x 7 = ) కలిసి మొత్తము 49 భాగములుగాను ఐనవి. అట్లు బహుశుభకర రూపములైన ఆ శిశువులు రోదించినవి. వాటి రోదనలు వినలేక ఇంద్రుడు రోదించవద్దు ( మా రుత ) అని పలికినాడు. అప్పటినుండి ఆ శిశువులు తేజో బల గుణ సమేతులైయ్యిరి. అటు పిమ్మట వారు తమ తల్లి ఎవరి ఆశ్రమమునందున్నదో అట్టి అగస్త్యుని వేడుకొనుచూ ” ఓ మహర్షి! మా జనకులు మీకు సోదరులు. మీ ఇరువురి సఖ్యత మా జనకులు నిరంతరము స్మరింతురు. మాపై కూడా మీకు అమితమైన వాత్సల్యముందని అనుకుంటున్నాము. కాని ఈ ఇంద్రుడు మాకు సోదరుడైననూ ఒక చండాలుని వలె మమ్ము సంహరించ ప్రవర్తించుతున్నాడు. ” అని వారందరు తమ బాధను తెలియ జేయగా వెంటనే అగస్త్యుడు అక్కడికి వచ్చి, దితికి తెలియజేసినాడు. ఇంద్రుని కూడ ” ఓ ఇంద్రా ! నీ శత్రువులు ఎల్లపుడు నీ పృష్ఠభాగమును చూతురు గా ! యుద్ధమునందు ఎవని పృష్ఠభాగమును శత్రువులు చూతురో అట్టి వానికి అది మరణప్రాయమే కదా ! ” అని శపించినాడు. గర్భవేదన నుభవించుచున్న దితి కూడ క్రోధముతో.. ” స్త్రీలచే అవమానము నొంది రాజ్యభ్రష్ఠుడవవుదువు .” అని శపించినది. అదేసమయమునకు అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చినాడు. ఆయనకు అగస్త్య మహర్షి విషయమును వివరించినాడు. ఇంద్రుడు కూడ గర్భమునుండి వెలుపలికి వచ్చుటకు భయపడినాడు. ఆ పరిస్థితిని చూసి కశ్యపుడు మిక్కిలి దుఃఖించినాడు. ఇంద్రుని బయటకు రమ్మన్నాడు. “నీవు చేసినపని ఎట్టిది? నిర్మల వంశసంజాతులు ఇటువంటి నీచకార్యములాచరించుటకు మనస్సును కేంద్రీకరించరు.” అని అసహనంగా పలికినాడు.ఇంద్రుడు బయటకు వచ్చి, సిగ్గుతో తలవంచుకొని నిలబడినాడు. వ్యక్తులాచరించిన సదసద్ కర్మలను వారి స్వరూపమే తెలియజేయును. చివరకు మరల ఇంద్రుడే శిరస్సు వంచి , “శ్రేయస్సని తలచి, మీరేమి చెప్పుదురో నిస్సంశయముగా దానిని ఆచరింతున” ని పలికినాడు. కశ్యపుడు లోకపాలురతో పాటు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు. ఆయనకు వృత్తాంతమంతా చెప్పి, దితికి గర్భశాంతిని ,ఇంద్రునికి నిర్దోషమును మరియు శాపవిమోచనమును , గర్బస్థ శిశువులకు ఆరోగ్యము తోపాటు ఇంద్రునితో మైత్రిని, విషయములను గురించి అడిగినాడు. అట్లు వినయముతో అడిగిన కశ్యప ప్రజాపతిని చూసి, బ్రహ్మ దేవుడు ” ఓ కశ్యపా ! నీవు ఇంద్రునితో పాటు వసువులతో, లోకపాలకులతో కలసి గౌతమీ నదికి వెళ్ళు. అక్కడ అందరితో కలిసి ఆ నదియందు స్నానమాడి, పరమేశ్వరుని పూజించి కీర్తించు. అందువలన శివానుగ్రహము కలిగినవాడవై , సర్వ శ్రేయస్సులను పొందగలవు. ” అని ఉపదేశించినాడు. అదే ప్రకారము ఆచరించి, కశ్యపుడు పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించినాడు. ఆర్తుల దుఃఖములను తొలగించుటలో శివుడు, గౌతమీ రెండే కీర్తించబడినవి కదా ! కశ్యపుని స్తోత్రములకు మిక్కిలి సంతసించిన పరమేశ్వరుడు వృషవాహనుడై ప్రత్యక్షమైనాడు. కశ్యపుని మొర వినినాడు. అటు పిమ్మట దితి అగస్త్యులతో ఆ భగవంతుడు ” దితి గర్భమునందున్ననలుబది తొమ్మండుగురు మరుత్తులు సౌభాగ్యవంతులై, యజ్ఞభాగధేయమును , మరియు యజ్ఞములందు ఇంద్రుని కంటే ముందుగా హవిర్భాగమును పొందుదురు. ఇంద్రునితో వీరు సంతోషముతో నుందురు. అదేవిధముగా మరుత్తులతో కలిసిన ఇంద్రుని శత్రువులు జయింపజాలరు. ఓ కశ్యప ! నీ పుత్రులు సర్వకాలములందు విజయమును పొందుదురు. నేటి నుండి సోదరులను వధించువారు వంశనాశనమును , ఆపత్తులను పొందుదురు.” అని అన్నాడు . అగస్త్యునితో ” ఇంద్రుని పై క్రోధము తగ్గించుకొని శాంతించుము” అని అన్నాడు దితితో కూడ” ఐశ్వర్యవిభూషితుడగు పుత్రును ఒకడినే నీవు కోరుకొని దీక్ష వహించితివి. కాని నేడు నీకు శుభ, గుణ, శూర, బలసమన్వితులగు అనేకులైన పుత్రులు కలిగినారు. కావున మనో వ్యథను వదిలి వేయుము.” అని అనునయించినాడు. అటుపిమ్మట దితి పరమేశ్వరునికి రెండు చేతులు జోడించి, ” ఓ భగవాన్ ! సురపూజిత ! తల్లిదండ్రులకు విశేషించి తల్లికి పుత్రదర్శనము శ్రేష్ఠమైనది, ప్రియమైనట్టిది కూడా కదా ! అందులోనూ రూపసంపద, శౌర్యవిక్రమములుగల పుత్రుడు ఒక్కడున్ననూ సంతోషము కలిగిచినప్పుడు అనేకులున్న ఇక చెప్పవలసినదేమున్నది? నీ అనుగ్రహమువలన నా పుత్రులు నిశ్చయముగా విజేతలగుదురు. ఓ దేవా ! నీ అనుగ్రహము కలిగే చోటు , గౌతమి అనుగ్రహము కలిగే చోటు శుభములను నిస్సంశయముగా కలిగించగలవు. నేను కృతార్థురాలనైతిని. ఐననూ మీరంగీకరించినచో భక్తితో మీకు ఒక విజ్ఞాపన. స్వామీ ! లోకమున సంతానము కలుగుట దుర్లభము. పుత్రుడు కలిగిన ఆ తల్లి కి కలుగు ఆనందము ఏమని వర్ణింపవచ్చు ? అందునా గుణవంతుడు, దీర్ఘాయుర్వంతుడు, రూపవంతుడు జన్మించిన ఆ తల్లికి స్వర్గలోకముతోనూ బ్రహ్మపదవి తోనూ అవసరమేమున్నది? ఇహ, పరలోకములందు ప్రయోజనములను కోరుకొనువారికి గుణవంతుడైన పుత్రుడు లభించుట అభీష్టకరమైనదే కదా ! అందువలన కల్పాంతమువరకు కూడా ఇట్టి అనుగ్రహమును కలిగించుము” అని కోరినది. అందులకు పరమేశ్వరుడు ” సంతానము కలుగకపోవుటకు గాని, స్త్రీకి, గాని వంధ్యత్వం కలిగిన గాని కారణము గతజన్మ కృత మహాపాపఫలము. అట్టి దోషమును నివారించుటకు ఈ పుణ్య తీర్థమున స్నానము గావించి నన్నుస్తుతించిన, వారికి పాపము నశించును. మూడు మాసములు స్నాన, దానములు కావించిన పుత్రుని పొందగలరు. పుత్రసంతానము లేనట్టి స్త్రీ ఇక్కడ స్నానము గావించిన పుత్రుని పొందగలదు. ఋతు స్నాతయైన స్త్రీ ఈ గోదావరియందు స్నానమాడినచో పుత్రులనేకులను పొందగలదు.మూడు మాసములందు స్నానము గావించి నన్ను దర్శించుకొని స్తోత్రములతో స్తుతించునో ఆట్టి స్త్రీకి ఇంద్రునితో సమానుడైన పుత్రుడు కలుగగలడు. పితృదోషములచేత పుత్రులుపొందని వారు గాని, ధనాపహార దోషములచేత కూడుకొన్నవారు గాని ఇక్కడ గోదావరియందు నిష్కృతి లభించగలదు. ఇక్కడ స్నానమాచరించి పిండదానము గావించుటచేత యథాశక్తిగా సువర్ణదానము గావించుటచేత పితృదేవతలు సంతోషించగలరు. వారికి పుత్రుడు కలుగగలడు. ఎవరైతే కుదువబెట్టిన వాటిని దుర్బుద్ధితో అపహరింతురో రత్నమాణిక్యాదులను అపహరింతురో పితృదేవతలకు శ్రాద్ధాది కర్మలనాచరించడో అట్టి వారికి సంతానము కలుగదు. వంశవృద్ధి కలుగదు. వారికి ప్రేతగతి కలుగును. కావున అట్టివారు బ్రతికి యున్నప్పడు తీర్థ సేవనాదుల ద్వారా శ్లాఘ్యమైన సంతానము కలుగగలదు. గంగాసంఘమునందు స్నానమాడి, అనాదియూ, అనంతుడునూ, అజరుడు, చిత్సదానంద స్వరూపుడునూ, లింగాత్మకుడైన మహాదేవుడగు సిద్ధేశ్వరుని పూజించినచో, నిత్యం భక్తితో నియమ నిష్ఠలతో నిత్యము ముఖ్యముగా చతుర్దశి,అష్టమీ దివసములందు స్తుతించి, యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము సువర్ణదానము ఈ గోదావరియందు గావించినచో వారు శతాధిక పుత్రులను పొందుదురు. అటు పిమ్మట సకల మనోవాంఛలను పొంది అంత్యమునందు శివపురమును చేరుదురు . ఎవరైననూ మీరు ఈ స్తోత్రము గావించిన ఆరునెలలో వంధ్యయైనప్పటికినీ నిస్సంశయముగా పుత్రుని పొందగలదు. ” అని వరమిచ్చినాడు. అప్పటినుండి గోదావరిలోని ఆ తీర్థము ’పుత్రతీర్థము’ గా కీర్తించబడుచున్నది. అక్కడ స్నానదానాదులచేత సర్వాభీష్టములను పొందగలడు. ఇంద్రునికి మరుత్తులకు కూడ అక్కడ మైత్రీ ఏర్పడుటచేత ’మిత్రతీర్థము’ గానూ ఇంద్రునకు నిష్పాపము కలిగినందువలన ’శక్రతీర్థము’ గానూ ,ఇంద్రుడు ఐంద్రీ (ఇంద్ర సంధమైన) శ్రీని పొందినాడు గావున ’కమలాతీర్థము’ గానూ చెప్పబడుచున్నది . ఆ ఒక్క తీర్థమే లక్ష తీర్థముల పుణ్యముల నిచ్చునట్టిదిగా కీర్తించబడుచున్నది.

No comments:

Post a Comment