Friday, March 21, 2014

Dhanur Masam - Vaikuntha Ekadashi

ధనుర్మాసము -వైకుంఠ ఏకాదశీ రచన: కొరిడె విశ్వనాథ శర్మ మన ప్రాచీనులు కాలాన్ని సూచించడములో నాలుగు ప్రమాణములను అనుసరించారు. ‘మాసశ్చతుర్థా – సావనస్సౌరశ్చాంద్రో నాక్షత్ర ఇతి ” అని నిర్ణయ సింధుకారుడు మాసములు సావనము, సౌరము, చాంద్రము, నాక్షత్రము అని నాలుగు విధములని పేర్కొన్నాడు. మనము చైత్ర, వైశాఖాది మాసములు, అదేవిధముగా పాడ్యమి, విదియాది తిథులను చాంద్రమానముననుసరించి లెక్కింతుము. చంద్రుని భ్రమణమును బట్టి ఈ కాలమానము నడుచును. ఔత్తరాహికులు ఆచరించు బార్హస్పత్యమానము కూడ చాంద్రమానమునే అనుసరించును. దాక్షణాత్యులు సౌరమానమును అనుసరింతురు. సూర్యోదయాస్తమయాదులే ఈ కాల మానమునకు ఆధారములగుచున్నవి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండు నెల రోజులకు ఆయా మాసములుగా గుర్తించబడుచున్నవి. ఇవి చాలావరకు ఆయా ఇంగ్లీష్ తేదీలను పోలినవై, అధిక శాతం ఆయా తేదిలలోనే వచ్చును. అందులకే తమిళులకు ఏప్రిల్ 14వ తేదీయే మేషమాసారంభమగుటచే దానిని వారు సంవత్సరాదిగా ఉత్సవము జేసికొందురు. “రవేః సంక్రామణం రాశౌ సంక్రాంతి రితికథ్యతే ” నాగరఖండం అని చెప్పుట చేత ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంక్రాంతిగా చెప్పబడుచున్నది, ఈ ప్రమాణముగా మకర సంక్రాంతి (జనవరి 14 ) మొదలుకొని కర్కాటక సంక్రాంతి (జులై 16) వరకు ఉత్తరాయణముగా, తదాది మరల సంక్రాంతివరకు దక్షిణాయణముగా – “మకర కర్కట సంక్రాతి క్రమేణోత్తరాయణం దక్షిణాయనం స్యాత్” ముక్తసంగ్రహం అని చెప్పబడినది. ఇది మానవులకు కాలమానము కాగా “ అయనే దక్షణే రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కాపింజలసంహిత పేర్కొన్నది. మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక అహోరాత్రమైన దివసముగా చెప్పబడుతున్నది.అందు ఉత్తరాయణము దివసభాగము కాగా, దక్షిణాయనము రాత్రి భాగమగుచున్నది. ధనుర్మాసము అట్టి ప్రమాణమున మనకు ఒక సంవత్సరము (12 నెలలు ) దేవతలకు 24 గంటలు అగుచున్నది. అనగా మనకు ఒక నెల వారికి 2 గంటలు కదా ! అట్లైన మకర సంక్రాంతి దేవతల సూర్యోదయ కాలమగును. మకర సంక్రాంతికంటే పూర్వమైన ధనుస్సంక్రాంతి ఉషః కాలమగును అగుచున్నది. ‘ బ్రాహ్మే ముహూర్తే బుద్ధ్యేత ధర్మార్థౌ చాను చింతయేత్ ” అని స్మృతికారులు చెప్పినట్లు బ్రాహ్మీ ముహూర్తమునందు మేల్కొనాలి. అదే విధముగా ఈ ధనుర్మాసము దేవతలకు బ్రాహ్మీమూహూర్తకాలము కావున ఇట్టి సమయమున దేవతార్చన చాలా విశిష్టమైనది. “ఆషాఢాదిషు మాసేషు శయంతం కార్తికావధి చాపంగతే దివానాథే ఉత్థాప్య శయనాద్ధరిమ్ | సవిష్ణులక్షణైఃస్తోత్రైర్ బహుభిః పరిగీయ చ ఉషః కాలే తు సంప్రాప్తే చార్చయిత్వా జనార్దనమ్ ఉపచారైః షోడశీభిర్ ముద్గాన్నం చ నివేదయేత్ “ అని బ్రహ్మండపురాణము తెలిపినది. ముల్లోకాధిపతియైన ఆ శ్రీమన్నారాయణుడు ఆషాఢమున మొదలుకొని కార్తీకము ( మానవ ప్రమాణమున రాత్రి ఏడున్నర నుండి ఉదయము నాలుగున్నర ) వరకు నిదురించును. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశిగా సంబోధిస్తారు. ఈ సమయమును చాతుర్మాస్య దీక్షాసమయము గా ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఆ సమయములో చతుర్వర్ణ్యములవారికి ఆచరించవలసిన నియమములను అవి పేర్కొన్నవి. సూర్యుడు దనురాశి లోనికి ప్రవేశించిన సమయమునుండి విష్ణు సంబంధమైన స్తోత్రాదులచేత భగవంతుని మేల్కొపవలెను. (మానవ ప్రమాణాత్మకమైన) ఉషఃకాలమునందు షోడ శోపచారములచే పూజిచవలెను. పిమ్మట ముద్గాన్నము (పులగం) ను నివేదించవలెను కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయేద్ధరిమ్ | “ సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి ||”~ శ్రీమద్భాగవతము “ ధనుస్సంక్రాంతిమారభ్య మాసమేకం వ్రతం చరేత్ | ~ కాపింజలసంహిత .63.అధ్యా.39 శ్లో. అని భాగవత , కాపింజలసంహితలు కూడ ఈ ధనుర్మాస పూజా వైశిష్ట్యాన్ని తెలుపుతున్నాయి. సూర్యోదయమున కంటే పూర్వమే ఉషః కాలము అరుణోదయ సమయమునందు ఆ భగవంతుని నెలరోజులు పూజించవలెనని పేర్కొంటున్నాయి. అరుణోదయ సమయమనగా _ “ఉదయాత్ప్రాక్ చతస్రస్తు ఘటికా అరుణోదయః ” మాధవీయ స్కంధం అని అరుణోదయమును గురించి నిర్ణయ సింధువు నందు తెలియజేయబడినది. ఉదయమునకు పూర్వము నాలుగు ఘడియలు అరుణోదయమగును. అనగా ఒక ఘడియ ఇరువది నాలుగు నిమిషములు కాగా నాలుగు ఘడియలనగా తొంబది ఆరు నిమిషములగును. అనగా ఒక గంటా ముప్పది అరు నిమిషములు అని కదా ! తత్పూర్వము అరుణోదయముగా చెప్పవచ్చును. “ చాపస్థితే ఉషః కాలే రవౌ ప్రతిదినం హరిం” ~ వాసిష్ఠ సంహిత వచనం “ బ్రాహ్మేముహూర్తే సంప్రాప్తే రవౌ ధనుషి సంస్థితే | .అర్చయిత్వా శ్రియః పతిమ్ ||”~ శ్రీ వైఖానస శాస్త్రము. అను ప్రమాణములు కూడ ఉషఃకాల పూజను ప్రశంసించుచున్నవి. ఇట్లు చేసినచో సహస్రవర్ష పూజను చేసిన ఫలితమును పొందునని తెలిపి యున్నవి. ముక్కోటి ఏకాదశి – వైకుంఠ ఏకాదశి ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా శుక్లపక్ష ఏకాదశి తిథి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రములైనవి. ఇట్టి దివసమునందు గృహస్థునకు , బ్రహ్మచారులకు నిత్యాగ్ని హోత్రులకు కూడ నైమిత్తికమైన కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. “ గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్తథైవ చ | ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి || అని అగ్ని పురాణము మొదలైనవి తెలిపినవని నిర్ణయసింధుకారుడు తెలిపియున్నాడు. ఇట్టి ఏకాదశి దివసమున సౌరమానమునందలి ప్రశస్తమైన ధనుర్మాసము నందు ( అది మార్గశిర్షము నందే కాని పుష్యమాసమందే కాని ) వచ్చు ఏకాదశి వైకుంఠ ఏకాదశి గా లేదా ముక్కోటి ఏకాదశి గా కీర్తించ బడుచున్నది. ఇది ఆ భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది. శుభకరమైనది కూడ. ఎందులకనగా రెండు నేత్రములు కలిగిననూ దృష్టి యొకటే యైనట్లు సూర్యచంద్రులు నేత్రములుగా కలిగిన ఆ భగవంతునకు సౌరమాన , చాంద్రమానములలోని ప్రశస్తములైన ధనుర్మాసము , శుక్ల ఏకాదశి శ్రేష్ఠమైనదనుటలో అతిశయోక్తి కాదు కదా ! “ ధనూ రాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ త్రింశత్ కోటిసురైః సాకం బ్రహ్మా వైకుంఠమాగతః || “ “ పౌలస్త్యేన నిపీడితాః సురగణాః వైకుంఠ లోకం యయుః ద్వారే తత్ర విషాదభావమనసా సూక్తైర్ హరిం తుష్టువుః | శుక్లే శ్రీహరివాసరే ప్రభాతసమయే భానౌ ధనుః సంస్థితే తేభ్యోఽదాత్ సుఖదర్శనం కరుణయా నారాయణో మాధవః || అనియు ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యము తెలుపబడినది. రావణుని బాధలు తాళలేక దేవతలు బ్రహ్మను ఆశ్రయించగా , అప్పుడా బ్రహ్మ దేవుడు ధనుర్మాస శుక్లైకాదశీ (హరివాసరమునందు) దివసమున దేవతలందరితో వైకుంఠమును చేరినాడు. అచ్చడ అట్టి శ్రీహరి నిలయమునందు దేవతలు విషాదభావ మనస్కులై వేదముల సూక్తములతో శ్రీహరిని స్తుతించగా అపుడా ధనుర్మాస శుక్ల పక్ష ఏకాదశీ దివసమున వారికి భగవంతుడు సుఖకరమైన దర్శనమును కలుగజేసినాడు. అని ఈ దివస ప్రశస్తి కనబడుతున్నది. అదియును గాక ! ఈ దివస ప్రాశస్త్యమును తెలుపుతూ.. శ్రీప్రశ్న సంహిత ( 46 అధ్యా.) యందు కూడ ఒక ఐతిహ్యము కలదు అందు మధుకైటభులను భగవంతుడు సంహరించగా , ఆ సమయమునందు వారు దివ్య రూపధారులై దివ్యజ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడిరి. ఇంకనూ … బ్రహ్మాదిశ్చాపి త్వల్లోక సదృశం రత్నమందిరం కల్పయిత్వా త్వదర్చాయాం ఏకాదశ్యుత్సవం చరేత్ | తదా పశ్యంతి యే త్వాంతు నమస్యంతి యే జనాః ఉత్తరద్వారమార్గేణ ప్రవిశంతి చ యే హరేః ||” 45./38, 39 అని కోరిరి. అనగా బ్రహ్మాది దేవతలెవరైననూ నీలోకమువంటి మందిరమును నిర్మించి ఏకాదశి దివసోత్సవము గావించి, నిన్ను గాంచి నమస్కరించి ఉత్తర ద్వారమున నిన్ను సమీపింతురో అట్టి వారికి వైకుంఠప్రాప్తి కలుగునట్లు వరమిమ్మనమనిరి. కృత్వోత్సవం తథాభూతం ఏకాదశ్యాం విశేషతః | విశంతి మోక్షం తస్మాత్ సో మోక్షోత్సవ ఇతీర్యతే || 45/42 ఏకాదశి దివసాన ఉత్సవము జేసి , ఉత్తరద్వారము ద్వారా మోక్షము ( వైకుంఠము) లోనికి ప్రవేశింతురు గాన ఈ ఏకాదశి మోక్షోత్సవ ఏకాదశి గా చెప్పబడును అని శ్రీమహా విష్ణువు వారికి వరమిచ్చినట్లు శ్రీ సంహిత తెలుపుచున్నది. ఇట్లు ముక్కోటి దేవతల బాధలను నివారించినందున “ ముక్కోటి ఏకాదశి ” గానూ, వైకుంఠ దర్శనము కలిగించునది కావున “‘ వైకుంఠ ఏకాదశి ” గాను భగవంతుని దర్శించుకొను పవిత్ర దివసము కావున “భగవదవలోకన దివసము” గానూ ఈ దివసము కొనియాడబడుచున్నది. సర్వశ్రేష్ఠమైన ఈ హరివాసరము నందు బుద్ధిశాలి వేదపారాయణాదులచేత శ్రీమన్నారాయణోత్సవము గావించవలెనని పేర్కొనబడినది. ఈ ధనుర్మాస ఏకాడశి కొన్నిసార్లు మార్గశిర మాసమునందు, మరి కొన్నిసార్లు పుష్యమాసమునందు వచ్చును ఈ రెండు మాసముల శుక్లైకాదశులు ప్రశస్తమైనవే . మార్గశిర మాసమునందలి ఏకాదశి మోక్షదైకాదశి కాగా, పుష్యమాసమునందలి ఏకాదశి ‘పుత్రద’, గాను ‘ఫలద ’ గాను ప్రశంసించబడినది. సుకేతనుడను రాజు విశ్వే దేవతల ఉపదేశానుసారాము ‘పుష్యమాసమునందలి ఏకాదశి వ్రతమునాచరించి భగవంతుని అనుగ్రహమున పుత్రుని బడసినట్లు పద్మపురాణము చెప్పుచున్నది. కావున ఈ దివసమున సకల దేవతారాధ్యుడైన శ్రీమన్నారాయణుని పాద పద్మముల నర్చన గావించినవానికి పుణ్యఫలమేమని చెప్పవచ్చును ! అందులకే భాగవతమున శుకమహర్షి ఆ స్వామి పాదారవిందము నశ్రయించిన భక్తునికి సంసార సాగరము ను దాటుట తేలికయై ఉపద్రవమునుండి తరించునని ఈ శ్లోకమునందు తెలిపిన విధానమును అవలోకించండి . : సమాశ్రితా యే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్యయశోమురారేః | భవాంబుధిర్ వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషామ్ ||

No comments:

Post a Comment