Friday, March 21, 2014
Godavari Mahatmyam (Brahma puranam) {1} Ramatheertham
బ్రహ్మపురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము
రచన: విశ్వనాధశర్మ కొరిడె
అష్టాదశ పురాణములలోని ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విశిష్టతను పుంజుకొన్నది. పురాణములన్నీ శ్రవణపేయములైన కథాత్మకములు కలిగినవి కావు. కొన్ని శాస్త్రములను విశ్లేషించునట్టివి కాగా మరికొన్ని మంత్రములను, వాటి విశిష్టతను, వాటి ఉపదేశ, ఆచరణాది విశేషములు పెర్కొన్నవి. ఉదాహరణమునకు గరుడపురాణము ఔషధశాస్త్రమునకు పెద్దపీఠ వేసినది. అగ్ని పురాణము మంత్రశాస్త్రమునకు విజ్ఞానఖని ఐనది . పురాణములన్నీ వ్యాసమహర్షి వ్రాసినట్టుగా అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీ సుతః అని పేర్కొనబడినప్పటికినీ తరచి చూస్తే రచయితల బాహుళ్యం , కాలముల భేదములు కూడా కనపడుతున్నవి. కనుక సాహిత్య విమర్షకులు ఏకకర్తృత్వాన్ని అంగీకరిస్తూ లేరు. పురాణాలలో చివరిదిగా గుర్తిఛబడుచున్న
శ్రీమద్ భాగవతం మధురభక్తిమయ కథలసంపుటిగా పేర్కొనవచ్చు. శివపురాణము పరమేశ్వరుని లీలలను తెలిపే శివభక్తి రసాత్మక కథలనిలయం. బ్రహ్మ పురాణము కూడా 246 అధ్యాయములలో అనేక కథలను తెలుపునట్టిది. ఇందు అధిక భాగము సూర్యవంశ, చంద్ర వంశ రాజులవంశుల కథనములతోపాటు శ్రీ కృష్ణుని వృత్తాంతము. పార్వతీపరమేశ్వరుల పరిణయాది వృత్తాంతములు దశావతారములు మొదలైనవి ప్రధానముగా నుండగా ఇందుప్రధానముగా గోదావరీ మాహాత్మ్యం వరుసగా 70 వ అధ్యాయమునుండి 175 వరకు 106 అధ్యాయములందు చెప్పబడినవి. వాటికి మరల ప్రత్యేకమైన అధ్యాయ సంఖ్యలు ఇవ్వబడినవి. దాదాపుగా అన్ని అధ్యాయాలలో విడివిడిగా గోదావరీ మాహాత్మ్య కథలు ఉన్నవి. నాకు లభ్యమైనంతవరకు వాటిని అందించే ప్రయత్నం చేస్తాను.
శ్రీ రామతీర్థము
బ్రహ్మహత్యా దోషమును నశింపజేయునట్టి రామతీర్థమను పేరుగల తీర్థ రాజము ఒకటి కలదు. అ తీర్థముయొక్క నామ శ్రవణముచేతనే సర్వ పాపముల నుండి విముక్తుడు కాగలడు. అట్టి దాని గురించి ఒక ఐతిహ్యము కలదు.
పూర్వకాలమున ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన దశరథ మహారాజు శూరుడు, ధీరుడు, ప్రజ్ఞాశాలి. లోకప్రసిద్ధుడు. తన వంశపరంపరగా వచ్చిన రాజ్యమును ఏలుచున్నట్టి వాడు. ఆయనకు కౌసల్యా , సుమిత్ర , కైకేయి అను ముగ్గురు భార్యలు . ఆ ముగ్గురు కూడ సద్వంశ సంజాతులు , రూపలావణ్యాది లక్షణ లక్షితులు. సద్గుణ సంపన్నులు.
బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాన తపోనిష్ఠా గరిష్ఠుడైన వశిష్ఠ మహర్షి పురోహితులై ఉపదేశములు ఇచ్చుచుండగా ఆ రాజు రాజ్యము చేయుచుండగా చాతుర్వర్ణ్యములకు ఆధి, వ్యాధి రోగములు గాని, అనావృష్టి , దుర్భిక్షాది ఈతి బాధలు కాని ఉండెడివి కావు. బ్రహ్మచర్యాది చతురాశ్రమవాసులు తమతమ సంతృప్తికరమైన సౌకర్యములను పొందెడివారు.
ఇట్లుండగా అట్టిసమయమున దేవదానవులకు రాజ్యనిమిత్తమై యుద్ధము జరిగినది. ఒకసారి వారు మరొకసారి వీరు విజయమును పొందెడివారు. అందువలన ముల్లోకములు మిక్కిలి భయముతో నుండెడివి. యుద్ధము మానుమని బ్రహ్మ దేవుడు చెప్పినపటికినీ వారు వినలేదు. ఆ రెండు వర్గములవారు మహావిష్ణువును, పరమేశ్వరునికలిసి వారితో యుద్ధము గురించిచెప్పగా వారిని చూసి, ఆ దేవాధిదేవతలు ఇరువురు కూడ “ముందు తపస్సుతో బలవంతులు కండి. అటుపిమ్మట యుద్ధము గావించండి.” అని ఉపదేశించినారు. అదేవిధముగా వారు తపస్సునావరించి మరల యుద్ధము జేసిరి కాని విజయము పొందలేక పోయినారు.
అట్టి సమయమున అశరీరవాణి వారితో “ దశరథ మహారాజు ఏ పక్షమున ఉండునో ఆ పక్షమునకు విజయము కలుగును” అని పలికినది . అది విని రెండు పక్షములవారు విడివిడిగా మహారాజు దగ్గరకు కలువడానికి బయలుదేరినారు . దేవతాపక్షపువాడగు వాయువు శీఘ్రముగా మహారాజు దగ్గరకు వెళ్ళి విషయమును చెప్పి,“నీవు మా పక్షమున నుండవలసినదని” కోరినాడు . అందులకు అంగీకరించి , ‘వత్తున’ని ‘నీవు వెళ్ళమ’ని మాట ఇచ్చినాడు. పిమ్మట దైత్యులు కూడ వచ్చినారు కాని వారికి దేవతలకు మాట ఇచ్చినట్లు చెప్పి తిప్పి పంపినాడు. అదే మాటప్రకారము దేవతల పక్షమున దశరథుడు యుద్ధము గావించునప్పుడు తాళలేక నముచి సోదరులైన దైత్యులు దశరథుని రథచక్రపు చీలని భిన్నము గావించినారు. యుద్ధసందోహమునందు దశరథుడు ఆ విషయమును గమనించలేదు. యుద్ధము చూడగోర వచ్చి రథమునందున్న కైకేయిదేవి అట్టి దానిని గమనించి, రాజునకు చెప్పక తానే ఆ చీల ప్రదేశమునందు తన చేతి వేలును ఉంచినది . అటుపిమ్మట కొంత సేపటికి యుద్ధము ముగిసినది . దేవతల పక్షమున విజయము వరించినది. దేవతలచే సన్మానితుడై దశరథుడు తిరిగి అయోధ్యకు బయలు దేరినాడు. మార్గమధ్యలో కైకేయీ సహాయమును గుర్తించి, ఆశ్చర్య పోయి, ఆమెను మూడు వరములను కోరుకొమ్మనమని అడిగినాడు. అఫ్ఫుడా కైకేయి తానిప్పుడు కోరుకొననని చెప్పెను . అందులకు ఆమెకు ఇష్టమైన ఆభరణములను, కానుకలుగా ఇచ్చి వరములను సమయానుకూలముగా కోరుకొమ్మనమని తెలిపినాడు .
ఒకసారి ఆ మహారాజు వేటకు వెళ్ళినాడు. ( ద్యూత, స్త్రీ, మృగయా, మద్య, వాక్పారుష్య దండ పారుష్య , అర్థదూషణములు అను ) రాజు సప్తవ్యసనములు లేనివాడై యుండాలి అని తెలిసి కూడ ఆయన విధివశాత్తు వేటకు వెళ్ళినాడు . అక్కడ ఒకచోట పల్లపు ప్రాంతములో నీటిని త్రాగుటకు వచ్చిన మృగములను సంహరించెడివాడు. అదే ప్రకారముగా ఆనాడు కూడ అక్కడికి చేరుకొన్నాడు.
కాని కాలవైపరీత్యము బలీయమైనది. అక్కడికి సమీపములో వృద్ధుడైన వైశ్రవణుడు అను మహర్షి తన భార్యా పుత్రునితో ఉంటున్నాడు. ( వాల్మీకి రామాయణము ప్రకారము వారు వైశ్యులు) అతడు, అతని భార్యకూడ అంధులు, బధిరులు. (చూడలేరు వినలేరు). అదే సమయానికి వారు తన పుత్రుని పిలిచి అక్కడికి మేమిరువురము దాహముతో తాళలేక ఉన్నాము. తొందరగా నీరు తీసుకరమ్ము.” అని అన్నారు. తల్లిదండ్రులపట్ల మిక్కిలి భక్తిశ్రద్ధలు గల ఆ పుత్రుడు సరే యని వారికి నమస్కరించి, ఒక కలశమును తీసుకొని రాజున్న నీటి కొలనుకు వెళ్ళినాడు. రాజు అక్కడ ఉన్నట్టి విషయము ఆ బాలునకు తెలియదు. రాజుకూడ ఆ ద్విజకుమారుని రాకను గమనించలేదు. అతడు నీళ్ళ లోనికి దిగి , కలశమును నీట ముంచినాడు. ఆ సమయమున వచ్చిన శబ్దమును విని , రాజు ఏనుగు వచ్చినదనుకొని తీక్షణబాణములు వేసినాడు. వనగజములైనా రాజులకు సంహారయోగ్యములు కావన్న విషయము ఆయనకు తెలిసిననూ బాణములు వేసినాడు.
మర్మ దేశమునందు గాయపడిన ఆ బ్రహ్మణకుమారుడు ” అనపరాధుడైన బ్రాహ్మణపుత్రుడనైన నాపై బాణము వేసినది ఎవరు?” అని బిగ్గరగా అరువగా ఆ ఆర్తనాదమునకు నిశ్చేష్టుడైన దశరథుడు వెంటనే అక్కడికి చేరుకొన్నాడు. అక్కడ బ్రహ్మతేజస్సు చేత విరాజమానముగా నున్న ఆ ముని కుమారుని చూచి దుఃఖితుడైనాడు. ” ఓ బ్రాహ్మణోత్తమ ! నీవెవ్వరవు? నీ పై బాణము వేసిన నేను బ్రహ్మహత్యా దోషమును పొందినాను. బ్రహ్మ హంతకుడిని చండాలకుడు కూడా స్పృషించరాదు. చూడకూడదు. కదా ! నా పాపమునకు నిష్కృతి లేదా ? ” అని అనగా అప్పుడా బాలుడు ” నా ప్రాణములు పెకిలించబడుతున్నాయి. ఇదంతా పూరజన్మకర్మ ఫలితము. నేను నా గురించి బాధపడ్తూ లేను. కాని నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. అంధులైన వారిరువురికి శుశ్రూషచేయువారు లేరే ! నేను లేక వారిరువురు ఎట్లు బ్రతుకగలరు? అనియే నా బాధ . వారిరువురి సేవను కోల్పోతున్నాను. ఐనా భగవంతుడు ఎటువంటి పని చేసినాడు? సరే ఐనప్పటికినీ ఓ రాజా ! నీవు తొందరగా ఈ కలశములో నీరు తీసుకొని మా జననీ జనకులు ఇవ్వవలసినది. వారు దాహంతో అల్లాడుతున్నారు. వారి ప్రాణములను కాపాడవలసినది. ” అని కోరినాడు. ఈ విధముగా పలుకుతున్నంతలోనే ఆ బాలుని ప్రాణములు గాలిలో కలిసి పోయినవి.
రాజు వెంటనే తన ధనుర్ బాణములను వదిలి కలశమున నీటిని తీసుకొని ఆ వృద్ధదంపతులదగ్గరికి వెళ్ళినాడు. తమ కుమారుని రాక ఆలస్యమునకు తాళలేక వారు పలు పర్యాయములు కీడును శంకించుతూ దుఃఖితులై యుండగా కాళ్ళ చప్పుళ్ళకు తమ కుమారుడే అని తలంచి సంతసించినారు. ఆలస్యానికి గురించి పలుప్రశ్నలు వేసినారు. మహారాజు జవాబు ఇవ్వక పోయేసరికి వారికి అనుమానము వచ్చి జవాబివ్వనిచో జలపానము చేయమని భీష్మించుక కూర్చొనేసరికి వారికి దశరథుడు జరిగిన సంఘటన చెప్పినాడు.
అది వినగానే ఆ దంపతులు హఠాత్తుగా క్రిందపడి దుఃఖించినారు . రాజు వారిని సమీపించగా”బ్రహ్మహత్యా దోషముగల నిన్ను మేము తాకరాదు. నీకు ఎప్పటికినీ పాపనివృత్తి లేదు.” అని నివారించినారు . తోవ చూపించగా వారు పుత్రుని శవముదగ్గరకు వెళ్ళి ఆ శవమును స్పృశించి మిక్కిలి విలపించుతూ “నీవు కూడా మావలె పుత్రవియోగము తాళలేక ప్రాణములను వదిలెదవు ” అని శపించుతూ , వారిరువురు ఆ శవముపైననే ప్రాణములను వదిలినారు. రాజు వారందరికి అంతిమసంస్కారములు గావించి తన భవనమునకు వెళ్ళినాడు.
అటుపిమ్మట మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్పగా ఆయన కూడ ఆ పాప నిష్కృతికై పలు విధములుగా ఆలోచించి, మహారాజుతో అనేకమహర్షుల ఆధ్వర్యమున అశ్వమేధ యాగమును గావింపజేసినాడు. అట్టి యాగము పూర్తి ఐనంతలోనే అశరీరవాణి “దశరథుని శరీరము పవిత్రమైనది . యథా ప్రకారముగా వ్యవహరించగలడు. ఆతనికి పుత్రులు కలుగగలరు. జ్యేష్ఠ పుత్రుని పుణ్య ప్రభావమువలన భవిష్యత్తులో నిష్పాపుడు కాగలడు. ” అని పలికినది.
అటు పిమ్మట చాలా రోజులకు ఋష్యశృంగ మహర్షి ప్రభావమువలన , దేవతల కార్యసిద్ధికొరకు దేవతలతో సమానులైన నలుగురు పుత్రులు కలిగినారు. కౌసల్యయందు శ్రీరాముడు, సుమిత్రయందు లక్ష్మణ , శత్రుఘ్నలు , కైకేయి యందు భరతుడు జన్మించినారు. వారు పెరిగి పెద్దవారైనారు, వశిష్ఠాదులవద్ద సకల విద్యాపారంగతులైనారు. విశ్వామిత్రమహర్షి యాగ రక్షణమునకు బాలులను పంపమని కోరగా ముందు అంగీకరించక పోయినప్పటికినీ వశిష్ఠ మహర్షి ఉపదేశము మేరకు దశరథుడు విశ్వామిత్రుని వెంబడి రామలక్ష్మణులను పంపినాడు. విశ్వామహర్షి కూడా సంతసించి, వారికి అనేకమైన దివ్యమైన శస్రాస్త్రవిద్యలను వారికి ఉపదేశించినాడు. అట్టి శస్త్రవిద్యలతో వారు యాగ రక్షణ గావించినారు,
యాగరక్షణ ముగిసిన పిదప ఆ మహర్షి రామలక్ష్మణులతో జనకమహారాజును చూడ వెళ్ళినాడు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు వారిరువురు బాలలు తమ విలువిద్య యొక్క చిత్రమైన ప్రదర్శనముతో వారందరిని అబ్బురపరిచినారు. అట్టిదానికి మిక్కిలి సంతోషించిన జనకమహారాజు లక్శ్మీస్వరూపిణీ, అయోనిజయగు తన కూతురు సీతాదేవిని రామునకు ఇచ్చినాడు, అట్లే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా తమ కూతురులను ఇచ్చి అందరికి దశరథ సమక్షములో వివాహము గావించినాడు.
అటు పిమ్మట చాలా కాలమునకు రాజు ప్రజల కోరికతో గురువుల అనుమతితో శ్రీరామునకు రాజ్యమునివ్వ గోరగా మంథర ప్రోద్బలమువలన కైకేయి అందులకు అడ్డుపడి, రాముని వనవాసమునకు వెళ్ళునట్లు చేసినది. రాముడు కూడ తన తండ్రిని సత్యవాక్యపాలకునిగా గావింపజేయ గోరి, సీతా లక్ష్మణులతో పాటు వనములకువెళ్ళెను. దశరథుడు కూడా భరతునికి రాజ్యమునివ్వలేదు. దశరధుడు వనములకు వెళ్ళిన వారిని తలచుకొంటూ బ్రాహ్మణ శాపమును కూడా స్మరించుకొనుచూ ప్రాణములను వదిలినాడు.
తాను గావించిన పరిపాకముల వలన ఆ దశరథ మాహారాజు యమ లోకమునకు తీసుకపోబడినాడు. అక్కడ తామిస్రాది అనేక నరకములందు విభిన్న భయంకర యమయాతనములు విధించబడినవి.
ఇంతలో సీతా రామలక్ష్మణులు వనవాసము గావించుచు కొంతకాలము చిత్రకూటమునందు కొంతకాలము గడపి. అక్కడ నుండి దండకావనమునకు చేరుకొన్నారు . అక్కడ సంచరించుచూ ఒకసారి గౌతమీ నదికి ఐదు యోజనముల దూరములో చేరుకొన్నారు. అట్టి సమయమున యమరాజు తన కింకరులను పిలిచి, ” శ్రీరాముడు గోదావరీ సమీపమునకు చేరుకొన్నాడు. ఆయన గోదావరికి ఐదు యోజనాల పరిసర ప్రాంతములో ఉన్నంతవరకు ఆతని తండ్రియైన దశరథుని నరకబాధను కలిగించవద్దు. పరమేశునితో కలిసిన పరాశక్తిగా గోదావరిని చెప్పుదురు. కావున త్రిమూర్త్యాది సమస్త దేవతలకు అర్చ్యనీయురాలు. ఎవరైననూ గౌతముని అగౌరవించనిచో వారు నిష్కృతి లేని పాపమున పడుదురు. పాపాత్ముని కుమారుడైననూ నిరంతరము ఆ దేవిని స్మరించినచో, ఆతని తండ్రి ఐన పాపాత్ముడు కూడ అనంత ఘోర పాపముల నుండి విముక్తుడగును. ఆ నది సమీపమున పుత్రుడున్నచో తండ్రిని నరకయాతన గావించుట ఎవరితరము కాదు. ” అని ఆదేశించుచూ పలికినాడు. అదేవిధముగా దశరథునకు యమబాధలు నిలిపివేయబడినవి.
వారు దశరథుని ఘోర నరకముల నుండి ఉద్ధరించుతూ “ఉత్తముడైన పుత్రుని పొందినందులకు నీవు ధన్యుడవు. అట్టి పుత్రుని వలన తండ్రికి ఇహ, పరలోకములందు కూడ సౌఖ్యమే కదా ! భాగ్యశాలివైన నీవు తప్ప అట్టి పుత్రుని మరెవరు పొందగలరు ?” అని పొగిడినారు. మహారాజునకు జరిగిన విషయము ఏమిటో అర్థం కాలేదు . విషయమేమిటని వారిని అడిగినాడు. అప్పుడు వారిలోని ఒక కింకరుడు ఒకడు ” వేదశాస్త్రాలలో నున్న అతి రహస్యమైన విషయము ఈ రోజు నీ పుత్రుని వలన మేము తెలిసికోగలుగుతున్నాము. నీ పుత్రుడు రాముడు భార్యా, సోదరులతో పాటు గౌతమీ పరిసర ప్రాంతమునకు వచ్చినాడని నీవు ఈ నరకమునుండి ఉద్ధరింపబడినావు . వారు ఆ ప్రాంతమున ఉన్నంతవరకు నీకు నరక బాధలు నిలిపివేయబడును. ఒకవేళ వారు ఆ పవిత్ర గోదావరీతీరాన నిన్ను స్మరించినవారై, స్నానమాచరించి , పిండాదికములు అర్పించినచో నీవు సర్వపాప విముక్తుడవై స్వర్గమును చేరుదువు. ” అని వివరించినాడు.
అది విని సంతోషించిన దశరథుడు ” అటులైన నాకు అనుమతించిన నేను అక్కడికి వెళ్ళి మీ మాటలను వారిరువురికి చెప్పెదను. నా విముక్తికై అనుజ్ఞ నిచ్చి నాకు సహాయపడగలరు” అని వారిని కోరినాడు. అందులకు వారు రాజు పట్ల దయతో అంగీకరించగా రాజు తన పుత్రులున్న గౌతమీసమీపమునకు వెళ్ళినాడు. కాని పాపాత్ములు పొందదగిన భయంకర యాతనా శరీరమును చూచుకొనుచూ , తమ పాపకర్మను తలంచుకొనుచూ మిక్కిలి బాధపడుచున్నవాడై అక్కడికి చేరుకున్నాడు .
అదే సమయానికి సీతారామలక్ష్మణులు కూడా గోదావరీ తటమునకు వెళ్ళినారు. యథావిధిగా స్నానమాడినారు. కాని వారికి అక్కడ తినుటకు ఏమియునూ దొరకలేదు. ఆకలితో నున్న లక్ష్మణుడు “తినుటకు ఏమియునూ దొరకుట లేదు. ఆకలితో నున్నాము ఏమి చేయుదుము?” అని అన్నను అడిగినాడు. అప్పుడు రామచంద్రుడు “సోదరా ! మనమాచరించిన కర్మానుసారముగా మనకు ఫలితము దక్కగలదు. మనము బ్రాహ్మణ భోజనము గావింపలేదు . ఎవరైతే బ్రాహ్మణులకు భోజనము పెట్టరో, వారిని పూజించరో. పెట్టిన భొజనము కూడా అవమానమును కలిగించుతూ పెట్టుదురో వారికి భొజనము దొరకక ఆకలితో అలమటింతురు . అందువలన మనకు భోజనము దొరకలేదు. కావున మనము దేవతాభ్యర్చన గావించి, అగ్నికి హవనము గావించిన , సమయానుకూలముగా విధి మనకు భోజనము కల్పించగలదు . ”
ఇట్లు వారిరువురు కర్మసంచయఫలితములను గురించి ఆలోచించుతూ మాట్లాడుతున్నంతలోనే దశరథుడు పిశాచరూపములో అక్కడికి చేరుకొన్నాడు. లక్ష్మణుడు తండ్రిని చూచి కూడ గుర్తుపట్టక కోపముగా ధనస్సును ఎక్కుపెట్టి, “ఓరి ! నీవు దానవుడవో రక్కసుడవో గాని ఆగుమక్కడనే. దగ్గరికి వచ్చిన నిన్ను సంహరింతును. ఇక్కడ ధర్మపరాయణుడు, సత్యసంధుడు, గురుభక్తిపరాయణుడు, దేవ,బ్రాహ్మణ సేవానిరతుడు ముల్లోకరక్షకుడునూ ఐన దశరథాత్మజుడగు శ్రీ రాముడు ఉన్నాడు. నీవంటి పాపాత్ములకు ఇక్కడికి ప్రవేశము లేదు. వెళ్ళు . లేదా నీ ప్రాణములను నేను అంతమొందింతును . ” అని హెచ్చరించినాడు.
అప్పుడా దశరథుడు వారితో ” పుత్రులారా ! నేను దశరథుడను . మీ జనకుడను . మూడు బ్రహ్మహత్యా దోషములవలన నరకమునందు పడి ఈ విధమైన శరీరముద్వారా నరక బాధలను అనుభవించుతున్నాను.”అని తన పాప వృత్తంతమును వివరించినాడు. తండ్రిని గుర్తించి, ఆయనకు సాష్టాంగంగా నమస్కరించుతూ వారు ఆయన వృత్తాంతమును విని , మిక్కిలి దుఃఖితులై మూర్ఛను పొందినారు . చివరకు సీతాదేవి వారిని ఓదారుస్తూ రామునితో ” నాథా! మీవంటి వారు ఇట్లు దుఃఖించ తగదు. ఇది దైవికమైననూ, మానుషమైననూ ప్రతీకారము గావించుట గురించి ఆలోచించవలెను. మూడు బ్రహ్మహత్యాదోషములలో హత్యగావించబడిన విప్రకుమార హత్యాదోష పాపమును మొదట నాకివ్వనిమ్ము. మిగిలిన రెండిటిల్లో మీరిరువురు తలా ఒకొటిని తీసుకొనండి. ” అని ధర్మయుతమైన మార్గమును తెలిపినది. అందులకు వారిరువురు కూడా అంగీకరించినారు.
అప్పుడు దశరథుడు సీతతో ” సీత ! నీవు బ్రహ్మతత్వజ్ఞుడైన జనకరాజ పుత్రికవు. అయోనిజవు. ధర్మస్వరూపుడైన రాముని ధర్మపత్నివి కావున యుక్తి యుక్తముగా మాట్లాడుచున్నావు. ఐననూ, నా విషయములో అంతగా శ్రమ పడవలసిన పని లేదు. ఈ గోదావరియందు స్నానదానములు గావించుట చేతనూ, పిండ నిర్వాపణము ద్వారా బ్రహ్మహత్యా దోషముల మూడింటినుండి విముక్తుడను కాగలను. గోదావరియొక్క అనుగ్రహము చేత దుర్లభమైనదేమున్నది?”అని పలికినాడు .
ఆ మాటలకు రాముడు అంగీకరించి సిద్ధపడుచుండగా అక్కడ భక్ష్య భోజ్యపదార్థములు ఏవి కనపడనందున లక్ష్మణుడు ఇంగుదీ ఫలములను తెచ్చినాడు.
ఆ ఇంగుదీ ఫలముల పిండిముద్దతో పిండప్రదానము చేయబోవుచూ మిక్కిలి దుఃఖించినాడు. అంతలో అశరీరవాణి ” ఓ రామ ! ధర్మనిరతుడవైన నీవు ఈ విధముగా దుఃఖించకూడదు. ధనప్రాగల్భముతో చేసిన వ్యక్తి పాపి యగును. శ్రాద్ధమును చేయుగోరు వ్యక్తి ఏ అన్నమును స్వీకరిస్తున్నాడో , అదే అన్నమును పితృదేవతలు కూడ గ్రహింతురు . అని శాస్త్రములలో చెప్పబడుతున్నది కదా ! అందువలన శ్రద్ధయే ప్రధానము. ” అని పలికినది.
ఓదార్పు పొందిన ఆ రామచంద్రుడు అదే విధముగా పిండప్రదానము చేయుచూ , పిండమును భూమిపై నుంచినంతనే అక్కడ దశరథుడు కనబడలేదు. అక్కడ ఆయన శవము మాత్రమే కనబడినది. ఆ వెంఠనే అనేక విమానములలో లోకపాలకులు , రుద్రులు , ఆదిత్యులు , అశ్వినీదేవతలు చేరుకున్నారు. వారి మధ్యన దశరథుడు దివ్యరూపమును ధరించి, కిన్నెరులచేత కీర్తించబడుచు, మిక్కిలి ప్రకాశమానుడై యున్నాడు. ఆ దేవతాగణమును గని రాముడు చేతులు జోడించి నమస్కరించినాడు. కాని వారి మధ్యనున్న తన తండ్రిని గుర్తించక ‘ మా తండ్రి దశరథమహారాజు కనబడుట లేదు. ఎక్కడున్నాడు? ’ అని వారిని అడిగినాడు. అప్పుడు అశరీరవాణి ” రామ ! మీ పితృపాదులు సమస్త బ్రహ్మహత్యాది దోషములనుండి విముక్తుడైనాడు . దేవతలందరితో పాటు ఆ విమానాన్ని అధిరోహించినాడు. చూడుము. ” అని పలికినది .
ఆ తరువాత దేవతలు కూడ శ్రీ రామునితో ” ఓ రామా ! నీవు ధన్యుడవైనావు. కృతకృత్యుడవైనావు. గౌతమీ తీరమునందు నీవు చేసిన పుణ్యకర్మల ద్వారా మీ జనకుడైన దశరథుడు స్వర్గమును చేరుకుంటున్నాడు. ఏ వ్యక్తియైతే తన కర్మలద్వారా తమ పితృవర్గములను ఉద్ధరించునో, అట్టివాడు ధన్యుడు. ఆట్టి ధన్యుని చేత ఈ భువనత్రయము అలంకరించబడుచున్నది.” అని ప్రశంసించినారు. దశరథుడు కూడ ” ఓ పుత్రా! నీ కర్మాచరణ ద్వారా నేను తరించబడినాను. నేను కృతకృత్యుడనైనాను. ఏ పుత్రుడైతే తన పితృవర్గమును తరింపజేయునో, అట్టి పుత్రుడు ధన్యుడు.” అని ఆనందముతో పలికినాడు .
అది విని దేవతలతో రాముడు “ఓ దేవతలారా ! పరమపూజ్యుడైన మా జనకుల విషయమున చేయదగిన కార్యములు ఇంకా ఏమున్నవి ? ” అని అడిగినాడు. అప్పుడు దేవతలు “మహావీర ! గంగతో సమానమైనట్టిది గంగ ( నది) కాని , నీతో సమానుడైన పుత్రుడు కాని , శివునితో సమానుడైన దేవుడు కాని తారకమంత్రముతో సమానమైన మంత్రము కాని లేవు. నీవు పితృలకు చేయదగినదంతయునూ చేసియున్నావు. పుత్రుడవైన నీ చేత పితరులు తరించబడినారు. కావున నీవు స్వేచ్ఛగా నుండవచ్చు.” అని పలికిరి. అట్లు దేవతల ద్వారా ఆ గోదావరీ మాహాత్మ్యము విని విస్మితుడై మిక్కిలి సంతోషముతో “అహో ఈ గంగా ప్రభావము. ముల్లోకము నందు సాటిలేనట్టిది. త్రిలోకపావనమైన ఈ గంగను మేము చూసి ధన్యులమైతిమి.” అని అక్కడ గౌతమీ సైకతముతో మహేశ్వరుని ప్రతిష్ఠించి , భక్తిపూర్వకముగా పూజించినాడు. బహువిధములుగా స్తుతించినాడు .
సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. అందులకు రాముడు” భక్తితో నిన్ను ఎవరైతే స్తుతింతురో వారు కార్యసిద్ధులను పొందవలెను. నరకమున పడినవారు తమ పుత్రులు గావించిన పిండ ప్రదానముచేత నరకమును వీడి స్వర్గమును చేరుకొనవలెను. ఈ గోదావరియందు స్నానమాత్రము చేతనే తమ పుట్టుకనుండి త్రికరణముల ద్వారా గావించిన పాపములన్ని నశించవలెను. ఇక్కడ ఎవరైతే యాచకులకు భక్తితో అణు పరిమాణమైన దానమును జేసిన వారికి అక్షయమైన ఫలితము కలుగవలెను.” అని కోరినాడు. భగవంతుడు మహేశ్వరుడు కూడా అందుకు తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. దేవతలు కూడా తమ తమ లోకములకు వెళ్ళినారు.
అప్పటినుండి ఆ తీరము రామతీర్థముగా ప్రసిద్ధమును పొంది స్నాన,దాన,పూజా పితృ కర్మల నాచరించువారి సమస్త పాపములను నశింపజేయుచూ సర్వాభీష్టములను నెరవేరజేయుచున్నది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment